కమ్మతిమ్మాపల్లె జెడ్పీ హైస్కూల్‌లో భోజనం వండుతున్న కార్మికులు
పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను..అని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి బడుగుజీవులకు ఆర్థిక భరోసా ఇస్తున్నారు. సామాజిక పింఛన్లు రూ.2,250, కిడ్నీ రోగులకు రూ.10 వేలు, దివ్యాంగ పింఛన్ రూ.3వేలకు పెంచుతూ తొలిసంతకం చేశారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేస్తున్న అమ్మలకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ. వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, గుడిపాల(చిత్తూరు): మండలంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 65 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు 80మంది ఉన్నారు. వారికి గౌరవ వేతనం రూ.3వేలకు పెంచడంతో ఆర్థికంగా ఎంతో ఆసరా కానుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు నిరాటంకంగా విద్యాభ్యాసం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలని కార్మికులు గత ప్రభుత్వాన్ని కోరారు.
అయితే సర్కార్ వారి మొరను పెడచెవిన పెట్టింది. వారి ఆకాంక్షను నిర్లక్ష్యం చేసింది. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా గత ప్రభుత్వం స్పందించలేదు. ఈ క్రమంలో రాష్ట్రసారధ్య బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.వెయ్యి గౌరవవేతనాన్ని రూ.3 వేల పెంచడంతో వారిలో ఆనందం వెల్లువెత్తుతోంది. వైఎస్ జగన్ తండ్రిబాటలోనే సువర్ణ పాలన సాగిస్తారని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
జనం కష్టాలు తెలిసిన నేత
ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మా గౌరవ వేతనం రూ.3వేలు చేశారు. గత ప్రభుత్వంలో ఇస్తామని చెప్పారు. కాని ఇవ్వలేదు. ఇప్పుడు సమాజంలో మాకు కూడా గౌరవంగా చెప్పుకునే వేతనం ఇస్తున్నారు. –లక్ష్మీ, నరహరిపేట, గుడిపాల
మాట నిలబెట్టుకున్నారు:
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి,వంట ఏజెన్సీల కష్టాలను గుర్తించి గౌరవ వేతనాన్ని రూ.3వేలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రజల సమక్షంలో ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నారు. –విజయ, నరహరిపేట, గుడిపాల
మా నమ్మకం నిజమైంది
మా కష్టాలు తీర్చే నాయకులు ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అని ఎప్పటినుంచో నమ్మకం పెంచుకున్నాం. ఆయన సీఎం అయిన వెంటనే వృద్ధులు, కిడ్నీ బాధితులకు పింఛన్లు పెంచారు. వంట ఏజెన్సీలకు కూడా ఇచ్చినహామీ నెరవేర్చారు. ఆయనకు రుణపడి ఉంటాం. –మునెమ్మ, గుడిపాల
ఎంతో ఆనందంగా ఉంది
గత ప్రభుత్వంలో సక్రమంగా గౌరవ వేతనం వచ్చేది కాదు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వంట ఏజెన్సీల కష్టాలు చూసి గౌరవవేతనం రూ.3వేలు చేశారు. మమ్మల్ని గుర్తించి ఇంతమేలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈశ్వరమ్మ, గుడిపాల
Comments
Please login to add a commentAdd a comment