మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం కరువు | nutrition drought in Mid-day meals | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం కరువు

Published Fri, Nov 8 2013 1:48 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

nutrition drought in Mid-day meals

 సాక్షి, మంచిర్యాల :
 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం జిల్లాలో అభాసుపాలవుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. నిత్యావ సర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు పెంచినా.. ఆహార నాణ్యతలో మార్పు రావడం లేదు. చాలా పాఠశాలల్లో నిర్వాహకులు మెనూ పాటించడం లేదు. కూరగాయలకు బదులు.. పప్పు.. పప్పుకు బదులు పచ్చడి పెడుతూ విద్యార్థుల పొట్ట కొడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. కలెక్టర్ అహ్మద్‌బాబు ఈ నెల 25న ఎంఈవోలతో జరిగిన సమావేశంలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
 ధర పెంచినా మారని తీరు..
 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 3,913 ప్రభుత్వ పాఠశాలల్లో 2,71,244 మంది విద్యార్థులు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 6,882 మంది నిర్వాహకులు ఉన్నారు. గ త విద్యా సంవత్సరం ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4, యూపీఎస్, హైస్కూల్ విద్యార్థులకు రూ.4.65 చొప్పున ఏజెన్సీలకు బిల్లులు చెల్లించింది. కానీ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో కట్టెలు, నూనె, పప్పు, ఉప్పు, ఇతర కిరాణ సామగ్రి కొనుగోలు చేయాలంటే నిర్వాహకులకు ఇబ్బందిగా మారింది. చాలాచోట్ల నాణ్యమైన భోజనం అందడం లేదు. సమస్యను గుర్తించిన రాష్ట్ర విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరమే పీఎస్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4.35, యూపీఎస్, హైస్కూల్ విద్యార్థులకు రూ.6 చొప్పున ఏజెన్సీలకు బిల్లులు పెంచింది. దీంతో పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని భావించింది.
 
 నిద్రపోతున్న కమిటీలు
 మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఎంఈవోలు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలతో ప్రతి మండలానికి ఒక కమిటీ ని నియమించింది. సభ్యులందరూ రోజు కనీసం ఒక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం రుచి చూడడంతోపాటు పాఠశాల, పరిసర ప్రాంతాల పారిశుధ్యంపై దృష్టిసారించాలని ఆదేశించింది. పదిహేను రోజులకోసారి నివేదిక  తెప్పించుకొని.. తమకు పంపాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోకు సూచించింది. పథక పర్యవేక్షణ బాధ్యత ఎంఈవోలపై ఉందని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లాలో సగానికిపైగా కమిటీలు సమర్థవంతంగా పనిచేయడం లేదు. కొద్ది మాత్రమే వాస్తవ పరిస్థితులను విద్యాశాఖకు నివేదిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో సభ్యులు మొక్కుబడి నివేదిక సమర్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
 
 మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి వారంలో రెండు రోజులు సోమ, గురువారం కోడి గుడ్డు ఇవ్వాలి. కానీ చాలా స్కూళ్లలో నిర్వాహకులు వారంలో ఓ రోజు గుడ్డు ఇచ్చి రెండో రోజు తక్కువ విలువ చేసే అరటిపండ్లు ఇస్తున్నారు. మంగళవారం, శుక్రవారం కూరగాయలు పెట్టాలి. కూరగాయల ధరలు పెరుగుదలతో పప్పు పెడుతునానరు. బుధ, శనివారాల్లో పప్పు, ఆకుకూరలు ఇస్తున్నారు. రిఫైండ్ ఆయిల్ తో కాకుండా ఫామాయిల్‌తోనే వంట కానిచ్చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు పౌష్టికాహారం కరువవుతోంది. ఫలితంగా విద్యార్థుల్లో రోగ నిరోధక శక్తి తగ్గి అనారోగ్యం పాలవుతున్నారు. పలు ఏజెన్సీ నిర్వాహకులు మార్కెట్‌లో నిత్యావసర  వస్తువులు, కూరగాయల ధరలు పెరగడంతో పప్పు వండిపెడుతున్నామని చెప్తున్నారు.
 ఏజెన్సీలను రద్దు చేస్తాం..
 - అక్రముల్లాఖాన్, డీఈవో
 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథక అమలు తీరును పర్యవే క్షించాల్సిన బాధ్యత ఆయా క మిటీలదే. మెనూ పాటించని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించని ఏజెన్సీలను రద్దు చేసి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలి. ఎంఈవోలు స్పందించకుంటే వారిపైనా చర్యలు తీసుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement