ప్రతీకాత్మక చిత్రం
సాంకేతిక రంగంలో నేడు వస్తోన్న విప్లవాత్మకమైన మార్పులు ప్రపంచం రూపు రేఖల్ని మార్చేస్తున్నాయి. 21వ శతాబ్దంలో మనిషి మేధస్సుతోపాటే అభివృద్ధి చెందిన నూతన సాంకేతిక విప్లవంలో మరమనిషి ఆవిష్కరణ ఓ మహాద్భుతం. మనిషి మేధో వికాసాన్నుంచి ఉద్భవించిన ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏకారణం చేతైనా మనిషే అందిపుచ్చుకోలేని పరిస్థితి వస్తే వాళ్ళు తరాలపాటు వెనకబడిపోవాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరూ టెక్నా లజీతో అనుసంధానం కాక తప్పని పరిస్థితులు కల్పిం చింది.
అభివృద్ధి చెందిన దేశాల్లో, మానవ వనరుల కొరత ఉన్న దేశాల్లో ఇప్పటికే చాట్ బోట్స్ పేరిట రోబోల వినియోగం పెరిగిపోయింది. ఇది ఒక్క కమ్యూనికేషన్ రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. విద్య, వైద్యం, జర్నలిజం, హోటల్ మేనేజ్ మెంట్ ఇలా ప్రతి రంగంలోనూ మరమనిషి ప్రమే యం పెరుగుతోంది. ఈ సవాల్‌ను దీటుగా ఎదు ర్కొని మనిషి మనగలగాలంటే నిరంతర జ్ఞాన సము పార్జన, దాని ఆచరణ తప్పనిసరి. ఈ ప్రక్రియ బాల్య దశ నుంచే మొదలు కావాలి. పాఠశాల స్థాయి నుంచే ఆ ప్రయత్నం ప్రారంభించాలి. బడి చదువే అందుకు వేదిక కావాలి. సాంకేతిక విజ్ఞాన బోధనకు తొలి అడుగు పాఠశాలలోనే మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు.
21వ శతాబ్దంలో సామాజిక, ఆర్థిక, సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు మిగతా రంగాలతో పాటు విద్యారంగాన్నీ తీవ్రంగా కుదిపేస్తున్నాయి. పోస్ట్‌కార్డులు అంతరించి వాట్సాప్, టెలిగ్రామ్‌ల రాకతో సమాచార బట్వాడా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్టుగా విద్యారంగం లోనూ నేడు అలాంటి మార్పులే రావాల్సిన తప్పని సరి పరిస్థితి. అభివృద్ధి చెందిన దేశాలు కాలానుగు ణంగా తమ విద్యాబోధనా ప్రమాణాలను ఎప్పటిక ప్పుడు విశ్లేషించుకుంటూ ముందుకెళుతున్నాయి. గతంలో విద్యారంగానికి ఉపా«ధ్యాయుడే కేంద్ర బిందువు. కానీ నేడు విద్యార్థి కేంద్రంగా విద్యాబో ధన జరుగుతోంది. పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని విద్యార్థి మెదడులోకి ఎక్కించడమే నాడు ప్రధాన లక్ష్యం. ఎంత సమర్థంగా విద్యార్థి ఆ సమాచారాన్ని గుర్తుపెట్టుకుంటే అంత గొప్పగా భావించేవారు. అదే ఓ గొప్ప విద్యగా పరిగణించేవారు ఆనాడు.
కానీ నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇన్ఫర్మేష న్‌కన్నా ఇన్నోవేషన్ ప్రధానమైంది. కొత్త ఆవిష్కర ణలు చేసే విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా మారింది. విద్యార్థిలో సమాచారం గుర్తు పెట్టుకొనే సామర్థ్యం కన్నా, ఆ సమాచారం ఎంత మేరకు అవగతం చేసుకొనే శక్తి, విశ్లేషించే నైపుణ్యం ఉందో చూస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచా రాన్ని నేటి సామాజిక పరిస్థితులతో అన్వయించు కొనే సామర్థ్యంతో నూతన ఆవిష్కరణలు చేసే విద్యార్థులకే నేడు పెద్దపీట వేస్తున్నారు. అందువల్ల ఈ రోజు విద్యారంగంలో ఉపాధ్యాయుడు సర్వాంత ర్యామి కానేకాదు. తరగతి గదిలో విద్యార్థి నైపుణ్యాభి వృద్ధికి, మేథో వికాసానికి అవసరమైన మెళకువలను బోధించడమే ఉపాధ్యాయుడి ప్రథమ కర్తవ్యంగా మారింది. విద్యార్థిలో అవగాహన ఎంతగా పెరిగితే అన్ని కొత్త ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉంటుంది.
టెక్నాలజీ నేడు అన్ని రంగాలనూ శాసిస్తోంది. ఎవరైతే సాంకేతిక నైపుణ్యాన్ని కలిగి ఉంటారో వారికే అవకాశాలు విరివిగా లభిస్తాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీలో వచ్చే మార్పులు విద్యారంగంలో రాక పోయినట్టయితే ఆ విద్య వచ్చే శతాబ్దానికి పనికి రాదు. పిల్లలు పుట్టి పెరుగుతున్న క్రమంలో పలకా బలపం పట్టుకుంటేనే మురిసిపోయేరోజులు పోయి పుట్టడంతోనే సెల్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లను అవలీలగా ఆపరేట్ చేయగలిగిన డిజిటల్ యుగంలో మనమున్నాం. ఈరోజు సెల్‌ఫోన్ ఓ నిత్యావస రంగా మారిపోయింది. దేశంలో సెల్‌ఫోన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ రోజు తరగతి గదిలో విద్యార్థి చేతిలో ఉన్న సెల్‌ఫోన్ తీసుకుంటే వాళ్ళకు కోపం వస్తుంది. టెక్నాలజీలో అనునిత్యం వస్తోన్న మార్పుల వల్ల విద్యార్థులు తమను తాము నిత్యం అప్‌డేట్ చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ సాంకేతిక మార్పులను గమనించి విద్యారంగానికి వాటిని అన్వయించుకోవడంలో విఫలమైతే మాత్రం విద్యార్థులు తరగతి గదులకు దూరమయ్యే ప్రమా దం లేకపోలేదు. విద్యార్థి ఆసక్తిని గమనించి విద్యా వ్యవస్థకు సాంకేతిక సొబగులు అద్దాలి.
సమాచార రంగం, డిజిటల్ టెక్నాలజీలో వస్తున్న మార్పులు చాలా వేగంగా మారుతున్నాయి. ఈ రోజు విద్యార్థి అవగాహన పెంచే అంశంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఏ విద్యార్థీ పుట్టుక తోనే మేధావి కాడు. పిల్లవాడికి తగిన వాతావరణ కల్పిస్తేనే రాణించగలరు. అందువల్ల పిల్లల్లో కొత్త ఆలోచనలను రేకెత్తించడమే నేటి ఉపాధాయుడి ప్రధాన కర్తవ్యం. ఆలోచించే వ్యక్తి దేశానికి వరం. ఒకప్పుడు తరగతిగదిలో పాఠం బోధించిన వెంటనే పిల్లవాడిని ప్రశ్నించేవాళ్ళం. దీంతో పిల్లవాడు అదే సమాచారాన్ని గుర్తుంచుకొని చెప్పగలిగితే మేధావి అని కీర్తించే వాళ్ళం. విద్యార్థి ప్రదర్శించే ఆ నైపు ణ్యంతో ఉపాధ్యాయుడు సంతృప్తి చెందేవాడు.
కానీ అది అవగాహన కాదు. అది కేవలం రీకాల్ మాత్రమే. అలాంటి చదువులో విద్యార్థి పాత్రధారి కాలేదు. గురువు బోధించిన పాఠంలో విద్యార్థి శ్రమ లేకపోతే అది కేవలం ఉపరితల జ్ఞానంగానే మిగిలి పోతుంది. అందువల్ల విద్యార్థిని బోధనలో పాత్ర ధారి చేయాలి. అందుకు విద్యార్థి ఉపయోగించే సెల్ ఫోన్‌నే సాధనంగా ఎంచుకొని ఆ టెక్నాలజీతో అతడి ఆలోచనను పెంచేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. అలాకాకుండా మనం మడికట్టు కొని కూర్చుంటే ఛాదస్తులమవుతాం. దినదినం మారుతున్న టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థి అవ గాహనను, ఆలోచనను పెంచేలా కృషి చేయాలి.
ఉపాధ్యాయుడి బోధనలు విద్యార్థికి ఆసక్తికరంగా ఉంటే మెదడులో కవాటాలు తెరుచుకుంటాయి. అవి తెరచుకుంటేనే విద్యార్థి ఆలోచనలు మొదలు పెడ తాడు. ఆ ఆలోచనలతోనే కొత్త జ్ఞానం ఉత్పత్తి అవు తుంది. అదే నూతన ఆవిష్కరణలకు కారణమౌ తుంది. క్లాస్‌రూంలు కొత్త ఆవిష్కరణలకు కేంద్రాల యినప్పుడే విద్యారంగంలో మరో విప్లవం సాధ్యమ వుతుంది. నేటి తరగతి గది ఆవిష్కరణల సృష్టిగానీ, పాత జ్ఞానాన్ని వల్లించే కేంద్రం కారాదు. మర మనిషి విసురుతున్న చాలెంజ్‌లను తరగతి గదులు స్వీకరిం చాలి. 21వ శతాబ్దంలో వచ్చిన సమాచార, సాంకేతిక విప్లవాలకు విద్యారంగాన్ని జోడిస్తే వచ్చే మరో విప్ల వంతో సామాజిక పరివర్తన సాధ్యమవుతుంది.
-వ్యాసకర్త : ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు డాక్టర్ చుక్కారామయ్య
Comments
Please login to add a commentAdd a comment