ఫెడ్‌ పాలసీ, బడ్జెట్‌పై ఫోకస్‌ | Sakshi
Sakshi News home page

ఫెడ్‌ పాలసీ, బడ్జెట్‌పై ఫోకస్‌

Published Mon, Jan 29 2024 6:23 AM

Markets to focus on budget, US Fed policy in eventful week - Sakshi

ముంబై: మధ్యంతర కేంద్ర బడ్జెట్‌ 2024 – 25 ప్రభావిత అంశాలు, యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ద్రవ్య పాలసీ నిర్ణయాలు ఈ వారం మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని స్టాక్‌ నిపుణులు భావిస్తున్నారు. వాహన విక్రయ డేటా, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. దేశీయ కార్పొరేట్‌ డిసెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి.

వీటితో పాటు సాధారణ అంశాలైన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి కదిలికలు, కమోడిటీ, క్రూడాయిల్‌ ధరలూ సూచీల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ట్రేడింగ్‌ 3 రోజులే జరిగిన గతవారంలో స్టాక్‌ సూచీలు ఒకశాతం నష్టపోయాయి. కార్పొరేట్‌ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, ఎఫ్‌ఐఐల వరుస విక్రయాలు, మధ్యంతర బడ్జెట్, ఫెడ్‌ పాలసీ ప్రకటనకు అప్రమత్తతతో గతవారంలో నిఫ్టీ 270 పాయింట్లు, సెన్సెక్స్‌ 982 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.  

‘‘అమెరికా, బ్రిటన్‌ కేంద్ర బ్యాంకుల ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో పలు పెద్ద కంపెనీలు తమ క్యూ3 ఫలితాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. అమ్మకాలు కొనసాగితే సాంకేతికంగా నిఫ్టీకి దిగువున 21050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 20,970 – 20,770 శ్రేణిలో మరో మద్దతు ఉంది. సానుకూల పరిణామాలు నెలకొని కొనుగోళ్లు జరిగితే ఎగువ స్థాయిలో 21,640 పాయింట్ల వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది.’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా తెలిపారు.

క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం
దేశీయ కార్పొరేట్‌ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ, సన్‌ ఫార్మా, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్‌తో ఈ వారంలో మొత్తం 475 కంపెనీలు తమ డిసెంబర్‌ ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటితో పాటు ఎన్‌టీపీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బీపీసీఎల్, అదానీ టోటల్‌ గ్యాస్, కొచి్చన్‌ షిప్‌యార్డ్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్, పిరమిల్‌ ఫార్మా, స్ట్రైడ్స్‌ ఫార్మా, వోల్టాస్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, డాబర్‌ మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది.  

స్థూల ఆర్థిక డేటాపై దృష్టి  
కేంద్ర గణాంకాల శాఖ డిసెంబర్‌ నెలకు సంబంధించి ద్రవ్య లోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలను బుధవారం వెల్లడించనుంది.
మరుసటి రోజు ఫిబ్రవరి ఒకటిన(గురువారం) ఆటో కంపెనీలు తమ జనవరి నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. అదే రోజున తయారీ రంగ పీఎంఐ డేటా వెల్లడవుతుంది. వారాంతాపు రోజున (శుక్రవారం) జనవరి 26తో ముగిసిన ఫారెక్స్‌ రిజర్వ్‌ డేటాను ఆర్‌బీఐ విడుదల చేస్తుంది. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు.  

రెండు లిస్టింగులు, ఒక ఐపీఓ  
ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న ఈప్యాక్‌ డ్యూరబుల్‌ జనవరి 30న, మరుసటి రోజు (31న)నోవా ఆగ్రిటెక్‌ కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కానున్నాయి.  బీఎల్‌ఎస్‌ ఈ–సరీ్వసెస్‌ పబ్లిక్‌ ఇష్యూ బుధవారం ప్రారంభమై ఫిబ్రవరి ఒకటిన ముగుస్తుంది.
 
అందరి చూపు ఫెడ్‌ సమావేశం పైనే

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం మంగళవారం(జనవరి 30న) ప్రారంభమవుతుంది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ బుధవారం(జనవరి 31)రోజున ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టినట్లయితే ఈ ఏడాదిలో మూడు దఫాలు వడ్డీరేట్ల కోత ఉంటుందని గతేడాది డిసెంబర్‌లో పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్‌ సంకేతాలిచ్చింది. ఈ దఫా ఫెడ్‌ కీలకవడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయి (5.25 – 5.50 వద్ద) యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. యూఎస్‌ జీడీపీ అంచనాలకు మించి నమోదైన నేపథ్యంలో మార్కెట్‌ వర్గాలు ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ వ్యాఖ్యలను నిశీతంగా పరిశీలించే వీలుంది.  

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతుడంతో భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ జనవరి 25వ తేదీ నాటికి రూ.24,700 కోట్ల షేర్లను విక్రయించారు. ఇదే సమయంలో డెట్‌ మార్కెట్లో రూ.17,120 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అమెరికా బాండ్లపై రాబడులు ఆందోళనలను కలించే అంశమే కాకుండా నగదు మార్కెట్లో అమ్మకాలను ప్రేరేపిస్తుందని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వీకే విజయ్‌ కుమార్‌ కుమార్‌ తెలిపారు. ఆటో, ఆటో ఉపకరణాలు, మీడియా ఎంటర్‌టైన్‌మెంట్, ఐటీ షేర్లను విక్రయించారు. ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఎంపిక చేసుకున్న ఫైనాన్స్‌ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు.

  మధ్యంతర బడ్జెట్‌పై ఆసక్తి
ఫెడ్‌ పాలసీ తర్వాత దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు అత్యంత ఆస్తకిగా ఎదురుచూసే మరో కీలక ఘట్టం బడ్జెట్‌. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్‌ 2024–25 ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక బడ్జెట్‌ ఉండొచ్చనేది అత్యధిక వర్గాల అంచనా. ముఖ్యంగా ద్రవ్య పరమైన కార్యాచరణ, మూలధన ఆధారిత పెట్టుబడుల విస్తరణ, గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలకు మధ్యంతర బడ్జెట్‌ అధిక ప్రాధ్యాన్యత ఇవ్వొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఏదిఏమైనా మార్కెట్‌కు అనుకూలంగా నిర్ణయాలుంటే సూచీలు, షేర్లు ఇప్పటికే భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో లాభాలు పరిమితంగా ఉండొచ్చు. ప్రతికూల నిర్ణయం వెలువడితే మరింత లాభాల స్వీకరణ చోటుచేసుకొని సూచీలు పతనాన్ని చవిచూడొచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement