బంగారమే బిగ్‌ బాస్‌ | Gold ETFs alone accounted for approximately Rs 24040 crore | Sakshi
Sakshi News home page

బంగారమే బిగ్‌ బాస్‌

Feb 11 2026 3:03 AM | Updated on Feb 11 2026 8:05 AM

Gold ETFs alone accounted for approximately  Rs 24040 crore

దారి మళ్లిన పెట్టుబడులు

ఈక్విటీల నుంచి గోల్డ్‌ ఫండ్స్‌లోకి చరిత్రలో తొలిసారి

జనవరిలో రూ.24,040 కోట్లు

న్యూఢిల్లీ: గోల్డ్, వెండి ఈటీఎఫ్‌లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో రూ.24,040 కోట్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రాగా, వెండి ఈటీఎఫ్‌లు రూ.9,463కోట్లను ఆకర్షించాయి. గత డిసెంబర్‌లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన రూ.11,647 కోట్లతో పోల్చితే రెట్టింపునకు పైగా పెరిగాయి. అంతేకాదు ఒక నెలలో ఈక్విటీ ఫండ్స్‌కు మించి బంగారం ఈటీఎఫ్‌లు పెట్టుబడులను ఆకర్షించడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి సన్నగిల్లుతూ.. బంగారం, వెండిపైకి మనసు మళ్లుతోంది. 

జనవరిలో ఈక్విటీ ఫండ్స్‌ నికరంగా రూ.24,028 కోట్లను ఆకర్షించాయి. డిసెంబర్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.28,054 కోట్లతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక తగ్గడం వరుసగా ఇది రెండో నెల. గతేడాది నవంబర్‌లో ఈక్విటీ ఫండ్స్‌ రూ.29,911 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. దీంతో పోల్చితే డిసెంబర్‌లో 6 శాతం తగ్గాయి. ఇక గతేడాది అక్టోబర్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.24,690 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద ఈక్విటీ పెట్టుడుల రాక మూడు నెలల కనిష్టానికి చేరింది.  

కమోడిటీల వైపు అడుగులు.. 
గత కొన్ని నెలలుగా ఈక్విటీ మార్కెట్లు ఎలాంటి రాబడులు ఇవ్వకపోగా.. బంగారం, వెండి మంచి ర్యాలీ చేస్తున్నాయని.. దీంతో కొంత మేర పెట్టుబడులు కమోడిటీల్లోకి మళ్లినట్టు వీఎస్‌ఆర్‌కే క్యాపిటల్‌ డైరెక్టర్‌ స్వప్నిల్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇక నుంచి ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడుల రాక క్రమంగా మెరుగుపడొచ్చని అభిప్రాయపడ్డారు. స్టాక్స్‌ విలువలు ఆకర్షణీయంగా ఉండడం, స్థిరీకరణ ముగియడంతో ఈ ఏడాది ఈక్విటీలు బలమైన పనితీరు చూపించొచ్చని, దీంతో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు. 

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌/ పన్ను ఆదా ఫండ్స్‌) పథకాల నుంచి రూ.594 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. 
⇒  మరోవైపు డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నికరంగా రూ.74,827 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్‌లో ఇదే విభాగం రూ.1.32 లక్షల కోట్లను కోల్పోవడం గమనార్హం.  

⇒  హైబ్రిడ్‌ ఫండ్స్‌లోకి (ఈక్విటీ, డెట్‌ కలసిన) రూ.17,356 కోట్లు.. మల్టీ అసెట్‌ ఫండ్స్‌లోకి (ఈక్విటీ, డెట్, బంగారం, వెండి కలసిన) రూ.10,485 కోట్లు చొప్పున వచ్చాయి. 
⇒  మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని అన్ని రకాల పెట్టుబడుల విలువ (ఏయూఎం) జనవరి చివరికి రూ.81.01 లక్షల కోట్లకు పెరిగింది.   సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి జనవరిలోనూ రికార్డు స్థాయిలో రూ.31,000 పెట్టుబడులు వచ్చాయి. 

గోల్డ్, వెండికి డిమాండ్‌.. 
గోల్డ్‌ ఈటీఎఫ్‌లోకి రూ.24,040 కోట్లు రావడంతో.. ఫండ్స్‌ నిర్వహణలోని మొత్తం గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఆస్తుల విలువ రూ.1.84 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.61,000 కోట్లు రావడం గమనార్హం. మరోవైపు వెండి ఈటీఎఫ్‌ల్లోకి డిసెంబర్‌లో రూ.9,463 కోట్లు రావడంతో.. వెండి ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తుల విలువ రూ. 1.16 లక్షల కోట్లకు పెరిగింది. డిసెంబర్‌లో వచ్చిన 3,962 కోట్లతో పోల్చి చూస్తే ఒక్క నెలలోనే 139 శాతం పెరిగాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement