
న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్ల వడ్డీపై టీడీఎస్ మినహాయింపు విషయంలో వృద్ధులకు సంతోషాన్నిచ్చే నిర్ణయం వెలువడింది. ఇకపై రూ.5 లక్షల వరకు వార్షిక పన్ను ఆదాయం కలిగిన వృద్ధులు బ్యాంకు డిపాజిట్ల వడ్డీపై మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్) నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇప్పటి వరకు రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికే ఈ అవకాశం ఉంది. 2019–20 మధ్యంతర బడ్జెట్‌లో రూ.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి పన్ను రాయితీని కేంద్రం ప్రకటించిన విషయం గమనార్హం.
ఈ నిర్ణయానికి అనుగుణంగా ఫామ్ 15హెచ్‌ను సవరిస్తూ సీబీడీటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 87ఏ కింద అన్ని రకాల రాయితీలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నికర ఆదాయం పన్ను పరిధిలో లేని వారి నుంచి ఫామ్15 హెచ్‌ను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్వీకరించాల్సి ఉంటుంది. వార్షికాదాయం రూ.5 లక్షలు ఉన్న వారు తమ బ్యాంకు డిపాజిట్ల వడ్డీ నుంచి టీడీఎస్ కోయకుండా, ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఫామ్15 హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment