పన్నుదారులకు టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) విధించకుండా పాన్ కార్డు వివరాలు సమర్పించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) తన వాటాదార్లను కోరింది. రూ.10 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై ఎల్‌ఐసీ రూ.6 డివిడెండ్ ప్రకటించింది. వ్యక్తులకు అందే డివిడెండ్ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 లోపు ఉంటే టీడీఎస్ ఉండదని పేర్కొంది. ఒకవేళ పాన్ వివరాలు ఇవ్వకపోయినా, ఇచ్చిన వివరాలు చెల్లకపోయినా (ఆధార్-పాన్ అనుసంధానం అవ్వకపోతే పాన్ చెల్లదు) డివిడెండ్‌పై 20 శాతం టీడీఎస్ కట్ చేసేకునే అవకాశం ఉందని తెలిపింది.
డివిడెండ్ కోసం జులై 19ని రికార్డు తేదీగా ఎల్‌ఐసీ ప్రకటించింది. ఆ రోజు వరకు ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ అకౌంట్‌లో ఎల్‌ఐసీ షేర్లు కలిగి ఉంటే, సెప్టెంబరు 20 లోపుగా డివిడెండ్ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. వాటాదార్లు తమ డిపాజిటరీ పార్టిసిపెంట్ల దగ్గర బ్యాంకు ఖాతా వివరాలను మరోసారి తనిఖీ చేసుకోవాలని ఎల్‌ఐసీ తెలిపింది. అవసరమైతే వాటిని అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. అదే సమయంలో బ్యాంకు ఖాతాకు పాన్‌ను అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. ఒకవేళ బ్యాంకు ఖాతా అందుబాటులో లేకపోతే, అనుమతించిన మార్గాల్లో డివిడెండ్ చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, ఆగస్టు 22న వార్షిక సాధారణ సమావేశంలో ఈ అంశంపై మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: బడ్జెట్‌లో రైతన్న కోరుకుంటున్నవి..
Comments
Please login to add a commentAdd a comment