కొత్త పన్నుల విధానం ఎంచుకుంటేనే ఊరట..
స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంపు
ఈ పెంపు కేవలం కొత్త పన్నుల విధానం ఎంచుకున్న వారికే అంటూ మెలిక
ఇదే సమయంలో కొత్త పన్నుల విధానం శ్లాబుల్లో స్వల్ప మార్పులు
5 శాతం పన్ను పరిధిని ఆరు నుంచి ఏడు లక్షలకు పెంపు
10 శాతం పన్ను పరిధిని తొమ్మిది నుంచి పది లక్షలకు పెంపు
ఫ్యామిలీ పెన్షన్‌దారుల స్టాండర్డ్ డిడక్షన్ రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంపు
ఈ మార్పుల వల్ల ప్రతీ పన్ను చెల్లింపు దారునికి రూ.17,500 ప్రయోజనం అంటూ ఆర్థిక మంత్రి ప్రకటన
పాత పన్నుల విధానం ఎంచుకున్న వారికి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వని మంత్రి
ఇంటి అమ్మకం విలువ రూ.50 లక్షలు దాటితే టీడీఎస్ కట్టాల్సిందే
సాక్షి, అమరావతి : ఉద్యోగస్తులు పాత పన్నుల విధానం కాకుండా కొత్త పన్నుల విధానం ప్రోత్సహించే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆదాయపన్ను రిటర్నులు దాఖలును సులభతరం చేస్తున్నామన్న నెపంతో పొదుపుపై ఎటువంటి పన్ను ప్రయోజనాలు ఉండని కొత్త పన్నుల విధానం ఎంచుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. పాత ఆదాయ పన్ను విధానంలో బీమా ప్రీమియం, గృహరుణం, పిల్లల చదువులు, పోస్టాఫీసు వంటి వివిధ సేవింగ్ పథకాలకు చేసే వ్యయాలను చూపించడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు.
కానీ 2020లో తక్కువ పన్నురేట్లతో వివిధ శ్లాబులను కొత్త పన్నుల విధానం ప్రవేశపెట్టింది. కొత్త పన్నుల విధానం ఎంచుకున్న వారు పొదుపు, వ్యయాలపై ఎటువంటి మినహాయింపులు వర్తించవు. మొత్తం ఆదాయం ఎంత అయితే అంత పన్ను చెల్లించాల్సిందే. కొత్త పన్నుల విధానం సులభతరంగా ఉండటంతో పన్ను చెల్లింపుదారులు ఈ విధానంవైపే మొగ్గు చూపుతున్నారని, 2023–24లో ఆర్థిక సంవత్సరంలో మూడింట రెండొంతుల మంది కొత్త పన్నుల విధానంలో రిటర్నులు దాఖలు చేసినట్లు సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు 8.61 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొత్త పన్నుల విధానం ఎంచుకున్న వారికే ఈ మార్పులు వర్తిస్తాయని ఆమె స్పష్టం చేశారు. రానున్న కాలంలో అందరూ కొత్త పన్నుల విధానం ఎంచుకోవాలన్న ఉద్దేశ్యంతో పాత పన్నుల విధానంకు పన్ను మినహాయింపులను తగ్గిస్తూ కొత్త విధానానికి ప్రయోజనాలను పెంచుతున్నారని ట్యాక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా మార్పులు చేసిన తర్వాత పది లక్షల లోపు పన్ను ఆదాయం ఉన్న వారికి కొత్త పన్నుల విధానం ఎంచుకుంటేనే ప్రయోజనంగా ఉంటుందంటున్నారు.
స్థిరాస్తి విలువ రూ.50 లక్షలు దాటితే టీడీఎస్..
ఇక నుంచి రూ.50 లక్షలు దాటిన స్థిరాస్థి విలువను విక్రయిస్తే ఒక శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 194ఐఏ సెక్షన్ ప్రకారం స్థిరాస్థి విలువ రూ.50 లక్షలు దాటితే ఒక శాతం టీడీఎస్ వసూలు చేయాలి. స్థిరాస్థి విలువను ఒకరికంటే ఎక్కువ మందికి అమ్మినా మొత్తం విలువను పరిగణనలోకి తీసుకొని టీడీఎస్‌ను వసూలు చేస్తారని ఆమె స్పష్టం చేశారు. కానీ ఈ టీడీఎస్ నుంచి వ్యవసాయ భూములకు మినహాయింపు ఇచ్చారు.
స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలకు పెంపు
కొత్త పన్ను విధానంలో ఉద్యోగులకు ఊరటనిస్తూ స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 50% పెంచుతూ సీతారామన్ ప్రకటించారు. రూ.50 వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75వేలకు పెంచారు. ఫ్యా మిలీ పెన్షన్‌దారుల స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 15వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. కొత్త పన్నుల విధానంలో 10% పన్నులోపు శ్లాబుల్లో స్వల్ప మార్పుల ను ప్రతిపాదించింది.
కొత్త పన్నుల విధానంలో 3 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవస రం లేదు. గతంలో 5% పన్ను శ్లాబు పరిధి రూ.3– 6 లక్షలుగా ఉంటే ఇప్పుడు దాన్ని రూ.3–7 లక్షలకు, గతంలో రూ.6–9 లక్షలుగా 10% పన్ను పరిధిని రూ.7–10 లక్షలకు పెంచా రు. ఈ మార్పుల వల్ల ప్రతీ పన్ను చెల్లింపుదారునికి రూ.17,500 ప్రయోజనం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment