నల్లధనం గుట్టుచెప్పు.. రూ.15 లక్షలు పట్టుకెళ్లు..
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి పెద్ద ఎత్తున పన్ను ఎగవేసి భారీగా నల్లధనాన్ని కూడబెట్టినవారికి సంబంధించి రహస్య సమాచారాన్ని అందించే వ్యక్తులకు ఇచ్చే పారితోషికం విషయంలో ఆదాయపు పన్నుశాఖ కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. టీడీఎస్, స్వంతంగా పన్ను మదింపు వివరాలు అందించే కేటగిరీలు సహా ఎవరైనా పన్ను ఎగ్గొట్టినవారికి సంబంధించి చర్యలకు వీలుకల్పించే సమాచారం ఇచ్చినవారికి ఇకపై పన్ను ఎగవేసిన మొత్తంలో పదిశాతం పారితోషికం ఇవ్వాలని ఐటీశాఖ నిర్ణయించింది.
ఈ మేరకు గతవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే పారితోషికంగా ఇచ్చే సొమ్ము రూ.15 లక్షలకు మించకూడదని ఆ మార్గదర్శకాల్లో అధికారులకు సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాలను గత ఆర్థిక సంవత్సరం నుంచి వర్తింప జేస్తారు. న్యాయపరమైన అంశాలు వచ్చిన సందర్భం మినహా, నల్లధనం గురించి సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. వీరితో సంప్రదింపులకోసం ప్రత్యేకంగా ఓ కోడ్‌నంబర్‌ను కూడా ఇస్తారు. అయితే సమాచారం ఇచ్చేవారు పక్కా ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున పన్ను ఎగ్గొట్టినవారి వివరాలను పత్రికల్లో ప్రచురించాలని ఐటీశాఖ నిర్ణయించింది.