
పీఎఫ్ చందాదారులకు టీడీఎస్ఊరట
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించి చందాదారులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఇకపై రూ. 50 వేల వరకూ పీఎఫ్ విత్‌డ్రాయెల్స్ విషయంలో సోర్స్ వద్ద పన్ను (టీడీఎస్) ఉండదు. జూన్ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకూ రూ. 30,000 వరకూ విత్‌డ్రాయెల్స్ వరకూ మాత్రమే టీడీఎస్ మినహాయింపు ఉండేది. పరిమితిని పెంచడానికి 1961 ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 192ఏను 2016 ఫైనాన్షియల్ యాక్ట్ సవరించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ముందస్తు విత్‌డ్రాయెల్స్ నివారణ, పొదుపులు దీర్ఘకాలం కొనసాగేలా చూడ్డం వంటి లక్ష్యాలను నిర్దేశించి పీఎఫ్ విత్‌డ్రాయెల్స్‌పై టీడీఎస్ వసూలు చేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, పాన్‌ను సమర్పిస్తే... 10% మాత్రమే టీడీఎస్ అమలవుతోంది. వచ్చిన డబ్బే తమ ఆదాయం, ఆధారం అని ధ్రువీకరించే ఫామ్ 15జీ (60 సంవత్సరాల లోపు) ఫామ్15 హెచ్ (60 ఏళ్లు పైబడినవారు) సమర్పిస్తే... అసలు టీడీఎస్ కోత ఉండదు. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు పీఎఫ్ మొత్తం మారినా... లేక ఐదేళ్ల కాలం తర్వాత పీఎఫ్ విత్‌డ్రాయెల్స్ జరిగినా పన్ను భారం ఉండదు.