పసిడి దిగుమతుల టారిఫ్ విలువ పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా గురువారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) పసిడి దిగుమతులపై టారిఫ్ విలువను పెంచింది. 10 గ్రాములకు 363 డాలర్ల నుంచి 388 డాలర్లకు ఈ ధర పెరిగింది. వెండి విషయంలో ఈ ధర 443 డాలర్ల నుంచి 487 డాలర్లకు ఎగసింది. ఎటువంటి అవకతవకలకూ(అండర్ ఇన్‌వాయిసింగ్) వీలులేకుండా పసిడి దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధించడానికి దిగుమతి టారిఫ్ విలువ ప్రాతిపదికగా ఉంటుంది. అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి సీబీఈసీ ఈ టారిఫ్‌లను సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకుంటుంది.
గోల్డ్ ఈటీఎఫ్ అవుట్‌ఫ్లో రూ.656 కోట్లు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడచిన 10 నెలల కాలంలో ఇన్వెస్టర్లు పసిడి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి రూ.656 కోట్లు వెనక్కు తీసుకున్నారు (అవుట్‌ఫ్లోస్). దీనితో ఫండ్స్ నిర్వహణలోని ఈటీఎఫ్‌ల విలువ (ఏయూఎం) మొత్తం దాదాపు 8.5 శాతం వరకూ పడిపోయింది. ఈటీఎఫ్‌ల నికర అవుట్‌ఫ్లోలు ఈ ఏడాది వరుసగా మూడవ సంవత్సరం. అయితే ఈక్విటీ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థల మందగమనం వల్ల గడచిన రెండేళ్లతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అవుట్‌ఫ్లో స్పీడ్ తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. 2014-15 మొత్తం ఆర్థిక సంవత్సరంలో అవుట్‌ఫ్లో మొత్తం విలువ రూ.1,475 కోట్లు. మొదటి 10 నెలల కాలానికి రూ.1,290 కోట్లు. 2013-14లో వెనక్కు వెళ్లిన మొత్తం రూ. 2,293 కోట్లు.