న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యునైటెట్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) నుంచి అధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో యూఏఈ నుంచి భారత్ తయారీదారులు, వ్యాపారులు రాయితీ రేటుతో 160 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం నోటిఫై చేసింది. భారతదేశం–యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత స్థాయి అధికారి తెలిపారు.
రెండు దేశాల మధ్య 2022 మే 1వ తేదీ నుంచి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పదం ప్రకారం, టారిఫ్ రేట్ కోటా (టీఆర్‌క్యూ) కింద ఒక శాతం టారిఫ్ రాయితీతో యూఏఈ నుండి ఏటా 200 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించింది. గత ఏడాది 140 టన్నులు ఈ తరహాలో నోటిఫైకాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాజాగా 160 టన్నుల దిగుమతులకు ఆమోదముద్ర వేసింది.
భారత్ బంగారం దిగుమతులలో 40 శాతంతో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటా కలిగిఉంది. యూఏఈ వాటా 16 శాతం కాగా, దక్షిణాఫ్రికా వాటా 10 శాతంగా ఉంది. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ నిధులకు సంబంధించిన కరెంట్ అకౌంట్‌పై పసిడి కొనుగోళ్ల (దిగుమతుల) ప్రభావం కనబడుతోంది. 2023–24లో భారత్ పసిడి దిగుమతుల విలువ 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
జీఎస్టీ లేకపోవడం, తయారీ ఖర్చులు తక్కువగా ఉండడంతో భారత్‌లో కంటే దుబాయ్‌లో బంగారం ధరలు చౌకగా ఉంటాయి. బంగారం దిగుమతులపై ప్రభుత్వం అందిస్తున్న ఈ వెసులుబాటుతో రెండు దేశాల మధ్య పసిడి వాణిజ్యం మరింత బలపడటమే కాకుండా భారతీయ జువెలరీ పరిశ్రమకూ ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment