పసిడి పై ఆంక్షలు సబబే
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై ఆంక్షలను కొనసాగించడం సబబేనని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం సమర్థించుకున్నారు. పసిడి దిగుమతులు తగ్గడం వంటి కారణాలతో కరెంట్ ఖాతా లోటు 50 బిలియన్ డాలర్ల దిగువకు చేరినప్పటికీ ఆంక్షలు కొనసాగించాల్సిందేనని వ్యాఖ్యానించారు. అయితే దేశీయంగా పసిడి ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సి ఉన్నదని చెప్పారు. మూతపడ్డ బంగారం గనులను వేలం వేయాల్సిందిగా ఆదేశిస్తూ ఇటీవల వెలువడ్డ సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ చిదంబరం మైనింగ్ శాఖ వీటిని విక్రయించాల్సి ఉన్నదని తెలిపారు. తద్వారా పసిడి అన్వేషణకు తెరలేపాలని పేర్కొన్నారు.
కాగా, దిగుమతులపై అమలు చేస్తున్న ఆంక్షల కారణంగా పసిడి దొంగరవాణా పుంజుకుంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ తదితరులు అభిప్రాయపడిన నేపథ్యంలో చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా, గత ఆర్థిక సంవత్సరం(2012-13)లో కరెంట్ ఖాతాలోటు చరిత్రాత్మక గరిష్ట స్థాయి 88 బిలియన్ డాలర్లకు ఎగసిన నేపథ్యంలో అటు ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ బంగారం దిగుమతులపై పలు ఆంక్షలను విధించాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటు 50 బిలియన్ డాలర్లలోపునకు దిగివచ్చింది. ఇక జనవరి 28న రిజర్వ్ బ్యాంక్ చేపట్టనున్న పరపతి సమీక్షపై స్పందిస్తూ చిదంబరం తొలుత ధరల అదుపుపై దృష్టిపెట్టాల్సి ఉన్నదని చెప్పారు.