సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ. చిదంబరంపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతోంది. యూపీఏ హయాంలో ప్రైవేట్ వర్తక సంస్థలకు అనుకూలంగా బంగారం దిగుమతి నిబంధనలను సడలించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. బంగారం దిగుమతి నిబంధనల సడలింపుతో ఆయా సంస్థలకు కేవలం ఆరు నెలల్లోనే రూ 4,500 కోట్లు వచ్చిపడ్డాయని పేర్కొంది. పీఎన్‌బీ స్కామ్‌లో కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న విమర్శల దాడి నేపథ్యంలో 80:20 గోల్డ్ ఇంపోర్ట్ స్కీమ్ ద్వారా నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చిదంబరం సాయపడ్డారని పాలక బీజేపీ ఆరోపిస్తోంది.
ప్రైవేట్ గోల్డ్ దిగుమతిదారులకు అనుకూలంగా ఉన్న ఈ పథకాన్ని తాము అధికారంలోకి వచ్చిన కొద్దినెలల్లోనే తొలగించామని పేర్కొంది. 2014, మార్చి 5న ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన అనంతరం మే 13న అప్పటి ఆర్థిక మంత్రి సవరించిన 80:20 స్కీమ్‌కు ఆమోదముద్ర వేశారని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మే 16న ఎన్నికల ఫలితాలు వెలువరించనున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఆపద్ధర్మ ప్రభుత్వం బంగారం దిగుమతులకు ప్రైవేట్ సంస్థలను అనుమతిస్తూ వాటికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం పరిశీలించి..దీనిలో ప్రమేయం ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటుందని ప్రకటన పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment