న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొ న్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం (2022– 23)లో పసిడి దిగుమతులు 24% తగ్గాయి. వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 35 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2021– 22లో ఇవి 46.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2022 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మందగించిన పసిడి దిగుమతులు మార్చిలో ఒక్కసారిగా ఎగిశాయి. ఆ నెలలో 3.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
అంతక్రితం ఏడాది మార్చిలో ఇవి 1 బిలియన్ డాలర్లే. ఇక వెండి దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 6 శాతం పెరిగి 5.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. బంగారం దిగుమతులు తగ్గినప్పటికీ వాణిజ్య లోటు భర్తీ యత్నాలకు పెద్దగా తోడ్పడలేదు. 2022– 23లో ఉత్పత్తులపరమైన వాణిజ్య లోటు 181 బిలియన్ డాలర్ల నుంచి 267 బిలియన్ డాలర్లకు పెరిగింది. రత్నాభరణాల ఎగుమతులు 3 శాతం క్షీణించి 38 బిలియన్ డాలర్లకు పరిమిత మయ్యాయి.
అధిక సుంకాలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు బంగారం దిగుమతులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశీ పరిశ్రమకు తోడ్పాటు అందించే దిశగా సుంకాలను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నాయి. అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉండటం, రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం, చైనా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం తదితర అంశాల కారణంగా రత్నాభరణాల రంగానికి సవాళ్లు తప్పకపోవచ్చని పరిశ్రమ సమాఖ్య జీజేఈపీసీ మాజీ చైర్మన్ కొలిన్ షా అభిప్రాయపడ్డారు. జ్యుయలరీ పరిశ్రమ అవసరాల కోసం భారత్ ఏటా దాదాపు 800–900 టన్నులను దిగుమతి చేసుకుంటోంది. కరెంటు అకౌంటు లోటు (సీఏడీ)ని కట్టడి చేసే దిశగా పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment