‘ట్రీటీ’తో బురిడీ...! | Gold illegally imported from Indonesia | Sakshi
Sakshi News home page

‘ట్రీటీ’తో బురిడీ...!

Published Wed, Oct 14 2015 12:37 AM | Last Updated on Thu, Aug 2 2018 4:31 PM

‘ట్రీటీ’తో బురిడీ...! - Sakshi

‘ట్రీటీ’తో బురిడీ...!

♦ ఇండోనేషియా నుంచి అక్రమంగా బంగారం దిగుమతి
♦ రెండేళ్లలో వివిధ దఫాల్లో దాదాపు 400 కేజీల పైనే
♦ భారత్‌కు ఇండోనేషియాతో ఉన్న ఒప్పందంతో మాయ
♦ కస్టమ్స్ కళ్లుగప్పిన చిక్కడపల్లికి చెందిన పసిడి వ్యాపారి
♦ నోటీసుల జారీకి కస్టమ్స్ సన్నద్ధం
 
 సాక్షి, హైదరాబాద్: ఇండోనేషియా నుంచి రెండేళ్లలో 400 కేజీల పసిడి దిగుమతి.. ఆన్ రికార్డు ప్రకారం అంతా క్లీన్.. కానీ రెండేళ్లలో ఒకే వ్యాపారికి, ఒకే దేశం నుంచి, ఒకే రకమైన ఆభరణాలు రావడంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆరా తీయగా.. ‘ట్రీటీ’(ఒప్పందం) పేరుతో బురిడీ కొట్టించినట్టు తేలింది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లికి చెందిన ఓ పసిడి వ్యాపారి శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి 400 కేజీల గోల్డ్‌స్కామ్ దందా నడిపినట్టు గుర్తించారు.

 ట్రీటీని అనుకూలంగా మార్చుకున్న వ్యాపారి..
 బంగారం సహా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువుపైనా నిర్ణీత శాతం కస్టమ్స్ డ్యూటీ(పన్ను) చెల్లించాలి. అయితే అంతర్జాతీయ సంబంధాలు, వాణిజ్య లావాదేవీలతో పాటు అనేక కారణాల నేపథ్యంలో భారత్ కొన్ని దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఇలా ఒప్పందం చేసుకున్న దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పూర్తి స్థాయిలో/నిర్ణీత శాతం కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. బంగారంతో పాటు కొన్ని రకాల వస్తువుల దిగుమతికి సంబంధించి భారత్‌కు ఇండోనేషియాతో ఒప్పందం ఉంది. దీని ప్రకారం సదరు బంగారం, వస్తువు ఆ దేశంలోనే తయారైందని ధ్రువీకరణ పత్రంతో దిగుమతి చేసుకుంటే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. సరిగ్గా ఇదే ఒప్పందాన్ని చిక్కడపల్లికి చెందిన పసిడి వ్యాపారి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. రెండేళ్లుగా ఇండోనేషియా నుంచి బంగారం దిగుమతి చేసుకుంటున్న సదరు వ్యాపారి.. అధికారిక ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆన్ రికార్డ్ అన్నీ పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

 రెండేళ్లలో 400 కేజీల వరకు దిగుమతి..
 ఇండోనేషియా నుంచి బంగారాన్ని కడ్డీలు, దిమ్మెల రూపంలో తెచ్చుకోవడానికి నిబంధనలు అంగీకరించవు. కచ్చితంగా ఆభరణాలుగానే దిగుమతి చేసుకోవాలి. దీంతో ఇండోనేషియాలోనే కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న సదరు వ్యాపారి కడ్డీలు, దిమ్మెలను నామ్‌కే వాస్తేగా రింగుల రూపంలోకి మార్చి దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. అయితే ఒకే వ్యాపారికి, ఒకే దేశం నుంచి, ఒకే రకమైన ఆభరణాలు వస్తుండటం, రెండేళ్లలో పలు దఫాల్లో 400 కేజీల వరకు దిగుమతి కావడంతో కస్టమ్స్ అధికారులకు సందేహం వచ్చింది. ఆరా తీయాలని ఢిల్లీలోని కస్టమ్స్ ప్రధాన కార్యాలయాన్ని(సీబీఈసీ)కోరారు.

దీంతో ప్రత్యేక అధికారిని ఇండోనేషియా పంపి ఆరా తీయగా.. పసిడి వ్యా పారి చెపుతున్నట్లుగా బంగారం ఆ దేశానికి చెందినది కాద ని తేలింది. ఏజెంట్ల సహకారంతో దుబాయ్, సౌదీ వంటి దేశాల నుంచి ఇండోనేషియాకు తరలించి, అక్కడ అధికారిక ధ్రువీకరణ పత్రాలు పుట్టించి విమానంలో హైదరాబాద్‌కు తీసుకువస్తూ సుంకం ఎగ్గొడుతున్నట్లు నిర్ధారించారు. దీంతో 400 కేజీల పసిడిపై పన్ను చెల్లించాల్సిన సదరు వ్యాపారికి నోటీసులు జారీ చేయడానికి కస్టమ్స్ విభాగం సన్నద్ధమవుతోంది. ఈ తరహా వ్యాపారం చేసే ముఠాలు మరికొన్ని ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు జరుపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement