బంగారు కొండ.. దిగొస్తోంది!
6 నెలల్లో మరో 10 శాతం తగ్గుతుందని అంచనా
పది గ్రాములు రూ. 26,000-24,000 శ్రేణికి రావొచ్చు
కలిసొస్తున్న డాలరు పతనం, ఆంక్షల సడలింపు
అంతర్జాతీయంగా బంగారానికి తగ్గుతున్న డిమాండ్
ఇప్పట్లో పెరిగే అవకాశాలు తక్కువే అంటున్న నిపుణులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొద్దికాలంగా స్థిరంగా కదులుతున్న బంగారం ధరలు రానున్న కాలంలో మరింత తగ్గుతాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యలోటు తగ్గించడానికి గతంలో బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించడం, రూపాయి పతనం కారణాలతో అంతర్జాతీయంగా తగ్గుతున్నా, దేశీయంగా తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. మోడీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం రావడంతో ఎఫ్‌ఐఐ నిధుల ప్రవాహం పెరిగి రూపాయి విలువ బలపడ సాగింది. దీనికి తోడు బంగారం దిగుమతులపై ఆంక్షలు తొలగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ అంశాల నేపథ్యంలో రానున్న కాలంలో బంగారం ధరలు మరింతగా తగ్గుతాయంటున్నారు. ఇప్పటికే బంగారం ధరలు 5 శాతం క్షీణించాయని, మరో మూడు నుంచి నాలుగు నెలల్లో తక్కువలో తక్కువ మరో 5-7 శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయని జెన్‌మనీ డెరైక్టర్, బులియన్ నిపుణులు ఆర్.నమశ్శివాయ పేర్కొన్నారు. ప్రస్తుత స్థాయి నుంచి పది గ్రాముల బంగారం ధర రూ. 26,000-25,000కి తగ్గొచ్చన్నారు. రానున్న కాలంలో డాలరుతో రూపాయి మారకం విలువ రూ 56-54 స్థాయికి చేరొచ్చని అంచనాలు వేస్తున్నారని, దీనికి ప్రభుత్వం సుంకాలు తగ్గించడం తోడైతే ప్రస్తుత స్థాయి నుంచి బంగారం ధరలు గరిష్టంగా 15 నుంచి 18 శాతం తగ్గినా ఆశ్చర్చపోనవసరం లేదని నమశ్శివాయ పేర్కొన్నారు. పెళ్లిల సీజన్, శ్రావణ మాసం వంటివి ఉండటంతో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ బాగుంటుందని, దీంతో తక్షణం ధరలు బాగా తగ్గే అవకాశాలు తక్కువని, నవంబర్ నాటికి బాగా తగ్గొచ్చని అంచనా వేస్తున్నట్లు ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శరత్ శర్మ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కిలోకి ఐదు లక్షలు అధికం
బంగారంపై ప్రభుత్వ ఆంక్షల వల్ల అంతర్జాతీయ ధరల కంటే దేశీయంగా కిలో బంగారం ధర రూ. 5 లక్షలు అధికంగా ఉందని రిద్ధిసిద్ధి బులియన్స్ డెరైక్టర్ గుంపెళ్ల శేఖర్ పేర్కొన్నారు. బంగారం దిగుమతులపై ఆర్‌బీఐ విధించిన 20:80 శాతం నిబంధనలతో రూ. 2 లక్షలు, దిగుమతి సుంకంతో రూ. 2 లక్షలు, వ్యాట్ లక్ష చొప్పున మొత్తం అయిదు లక్షలు అధికంగా ఉందన్నారు. ఇప్పుడు ఆర్‌బీఐ 20:80 పరిధి కింద మరో పది కంపెనీలకు బంగారం దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ఇప్పటి వరకు ఉన్న ప్రీమియం కిలోకి రూ.80,000 తగ్గిందన్నారు.
మోడీ ప్రభుత్వం సుంకాలు తగ్గిస్తే మరో 5 శాతం తగ్గుతుందని, అప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ.25,000కి రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బంగారం అమ్మకాలకు డిమాండ్ లేదని, ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత వస్తే కాని ఎంత వరకు తగ్గవచ్చన్నది చెప్పలేమని ఆంధ్రప్రదేశ్ గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. ప్రస్తుతం పది శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 4-5 శాతానికి తగ్గిస్తే దీపావళి నాటికి బంగారం ధరలు రూ. 23,000 నుంచి రూ.24,000కు తగ్గుతాయని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది.
ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు
అంతర్జాతీయంగా పుత్తడికి డిమాండ్ తగ్గడం, ఇదే సమయంలో బంగారం ఉత్పత్తి పెరుగుతుండటంతో ఇప్పట్లో ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదని బులియన్ నిపుణులు అంటున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం జనవరి- మార్చి త్రైమాసికంలో బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే ఇండియాలో 26%, చైనాలో 16% క్షీణించడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. ఒకవేళ ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,280 డాలర్ల వద్దే స్థిరంగా ఉన్నా, దేశీయ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ తగ్గుతుందని నమశ్శివాయ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 1,050 డాలర్ల వరకు క్షీణించే అవకాశం ఉందని, ఒకవేళ పెరిగితే 1,320-1,400 డాలర్ల వద్ద తీవ్ర నిరోధాలున్నాయన్నారు. ఇలా ఏ విధంగా చూసినా రానున్న కాలంలో ఇండియాలో బంగారం ధరలు తగ్గడమే కాని పెరిగే అవకాశాలు తక్కువన్నది చాలామంది నిపుణుల అభిప్రాయం.