Precious Metals
-
అంతరిక్షంలో డబ్బుల కుప్ప.. 72 లక్షల కోట్ల కోట్లు..!
మనకు రెండెకరాలో, మూడెకరాలో భూమి ఉంది.. అందులో ఏ బంగారమో, ప్లాటినమో దొరికితే.. అమ్మో డబ్బులే డబ్బులు.. కోట్లకుకోట్లు వస్తాయి అంటారు కదా.. మరి అంతరిక్షంలో తిరుగుతున్న ‘సైకీ’ అనే ఓ గ్రహశకలాన్ని భూమికి తెచ్చేసుకుంటే ఎన్ని డబ్బులొస్తాయో తెలుసా.. 72 లక్షల కోట్ల కోట్లు. 72 పక్కన 19 సున్నాలు పెట్టినంత డబ్బు. ఎప్పుడో ఒకప్పుడు ఆ గ్రహ శకలాన్ని తవ్వి తెచ్చుకుందామని శాస్త్రవేత్తలు ప్లాన్ చేస్తున్నారు. మరి సైకీ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? –సాక్షి సెంట్రల్ డెస్క్ ఈ ఆస్టరాయిడ్.. ఎంతో చిత్రం సౌరకుటుంబంలో అంగారక, గురుగ్రహాల మధ్యలో ఆస్టరాయిడ్ బెల్ట్ ఉంది. ఇతర గ్రహాల తరహాలోనే అక్కడి కొన్ని లక్షల ఆస్టరాయిడ్లు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. వాటిలో ఒకటి ఈ సైకీ. మామూలుగా ఆస్టరాయిడ్లు అంటే కొన్ని మీటర్ల నుంచి ఐదో, పదో కిలోమీటర్ల పెద్దవి దాకా ఉంటాయి. కానీ సైకీ ఆస్టరాయిడ్ చాలా పెద్దది. దీని వ్యాసం రెండు వందల కిలోమీటర్లు. అంటే మన చందమామ పరిమాణంలో సుమారు 15వ వంతు ఉంటుంది. భూమికి సైకీకి మధ్య దూరం సుమారు 37 కోట్ల కిలోమీటర్లు. ‘సైకీ’ అంటే ఆత్మ దేవత! ఇటలీకి చెందిన అంతరిక్ష పరిశోధకుడు అన్నిబేల్ గస్పారిస్ 1852లోనే ఈ ఆస్టరాయిడ్‌ను తొలిసారిగా గుర్తించారు. గ్రీకుల ‘ఆత్మ’ దేవత ‘సైకీ’ పేరును దానికి పెట్టారు. శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఈ ఆస్టరాయిడ్‌పై పరిశోధనలు చేస్తున్నారు. నాసా వచ్చే ఏడాది దీని దగ్గరికి వ్యోమనౌకను పంపుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఏమిటి దీని ప్రత్యేకత? సౌర కుటుంబంలో గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లు ఏవైనా రాళ్లు, వివిధ మూలకాలతో కూడిన నేల, వాయువులు, మంచుతో కూడి ఉంటాయి. ముఖ్యంగా సిలికేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ‘సైకీ’ ఆస్టరాయిడ్ మాత్రం చాలా వరకు లోహాలతో కూడి ఉన్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా ఇనుము, నికెల్‌తోపాటు బంగారం, ప్లాటినం, రాగి ఇతర అరుదైన లోహాలు ఉన్నట్టు అంచనా వేశారు. సౌర కుటుంబంలో ఇప్పటివరకు గుర్తించిన అన్ని గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లలో అన్నింటికన్నా ‘సైకీ’ ఆస్టరాయిడ్ భిన్నమైనదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త కేథరిన్ డిక్లీర్ చెప్పారు. దానిపై ఉన్న లోహాలను భూమ్మీదికి తేగలిగితే.. ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. సైకీపై ఉన్న లోహాల విలువ కనీసం 72 లక్షల కోట్ల కోట్లు (10 వేల క్వాడ్రిలియన్ డాలర్లు) ఉంటుందని శాస్త్రవేత్త డాక్టర్ ఎల్కిన్స్ టాంటన్ అంచనా వేశారు. ఇది ఓ పెద్ద గ్రహం మధ్యభాగమా? సౌర కుటుంబం ఏర్పడిన తొలినాళ్లలోని ఓ గ్రహం మధ్యభాగమే (కోర్) ఈ ఆస్టరాయిడ్ అని అంచనా వేస్తున్నారు. సాధారణంగా గ్రహాలు ఏర్పడినప్పుడు తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ సమయంలో బరువుగా ఉండే ఇనుము, ఇతర లోహాలు ద్రవస్థితిలో గ్రహం మధ్యభాగం (కోర్)లోకి చేరుతాయి. మన భూమి, అంగారకుడు, ఇతర గ్రహాల మధ్యభాగంలో కొన్ని వందల కిలోమీటర్ల మేర లోహాలు ఉంటాయి. అలాంటి ఓ గ్రహం వేరే గ్రహాన్నో, భారీ ఆస్టరాయిడ్నో ఢీకొని ముక్కలై ఉంటుందని.. దాని మధ్యభాగమే ‘సైకీ’ ఆస్టరాయిడ్ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిని పరిశీలించడం ద్వారా గ్రహాలు ఏర్పడినప్పటి పరిస్థితులను తెలుసుకోవచ్చని, కోర్ ఎలా ఏర్పడుతుంది, ఏమేం ఉంటాయన్నది గుర్తించవచ్చని అంటున్నారు. వచ్చే ఏడాదే వ్యోమనౌక ప్రయాణం సైకీ ఆస్టరాయిడ్‌పై విస్తృతంగా పరిశోధన చేయడం కోసం నాసా శాస్త్రవేత్తలు వ్యోమనౌకను పంపుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో అమెరికాలోని ఫ్లారిడా నుంచి ఈ ‘సైకీ స్పేస్‌క్రాఫ్ట్’ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అది సుమారు మూడున్నరేళ్లు ప్రయాణించి 2026లో సైకీని చేరుకుంటుంది. రెండేళ్లపాటు దానిచుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేస్తుంది. -
రేపే పోలింగ్ : భారీ నగదు, నగలు పట్టివేత
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున నగలు నగదు పట్టుబడింది. అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని గంటల్లో పప్రారంభం కానున్న నేపథ్యంలో మొత్తం 428 కోట్ల రూపాయల విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న వాటిలో 225.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా, బంగారంతో సహా విలువైన లోహాలు 176.11 కోట్లు ఉన్నట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మద్యం కూడా పట్టుబడింది. గత 24 గంటలలో కరూర్, కోయంబత్తూర్, తిరుప్పూర్ , చెన్నైలు భారీ దాడులు నిర్వహించినట్టు ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గత కొన్ని వారాలుగా ఈ దాడులు జరిగాయన్నారు. ఇందులో కరూర్ అగ్రస్థానంలో ఉండగా, కోయంబత్తూర్, తిరుప్పూర్, చెన్నై తరువాతి స్థానాల్లో నిలిచాయి. తాజాగా రాణిపేట జిల్లాలో రూ. 91.56 లక్షలు, చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో 1.23 కోట్ల రూపాయలు, సేలం వీరపాండి వద్ద 1.15 కోట్ల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా గత నెలలో, ఆదాయపు పన్ను శాఖ 16 కోట్లకు పైగా అక్రమ నగదును స్వాధీనం చేసుకుంది.అలాగే ఎన్నికల నిఘాలో భాగంగా రాష్ట్రంలో పలు సంస్థలపై దాడుల తరువాత సుమారు రూ. 80 కోట్ల బ్లాక్ మనీని గుర్తించింది. కాగా 234 నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్ షురూ కానుంది. తమిళనాట సింగిల్-ఫేజ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే ప్రచార పర్వం ముగిసి నసంగతి తెలిసిందే. -
బంగారు కొండ.. దిగొస్తోంది!
6 నెలల్లో మరో 10 శాతం తగ్గుతుందని అంచనా పది గ్రాములు రూ. 26,000-24,000 శ్రేణికి రావొచ్చు కలిసొస్తున్న డాలరు పతనం, ఆంక్షల సడలింపు అంతర్జాతీయంగా బంగారానికి తగ్గుతున్న డిమాండ్ ఇప్పట్లో పెరిగే అవకాశాలు తక్కువే అంటున్న నిపుణులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొద్దికాలంగా స్థిరంగా కదులుతున్న బంగారం ధరలు రానున్న కాలంలో మరింత తగ్గుతాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యలోటు తగ్గించడానికి గతంలో బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించడం, రూపాయి పతనం కారణాలతో అంతర్జాతీయంగా తగ్గుతున్నా, దేశీయంగా తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. మోడీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం రావడంతో ఎఫ్ఐఐ నిధుల ప్రవాహం పెరిగి రూపాయి విలువ బలపడ సాగింది. దీనికి తోడు బంగారం దిగుమతులపై ఆంక్షలు తొలగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశాల నేపథ్యంలో రానున్న కాలంలో బంగారం ధరలు మరింతగా తగ్గుతాయంటున్నారు. ఇప్పటికే బంగారం ధరలు 5 శాతం క్షీణించాయని, మరో మూడు నుంచి నాలుగు నెలల్లో తక్కువలో తక్కువ మరో 5-7 శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయని జెన్‌మనీ డెరైక్టర్, బులియన్ నిపుణులు ఆర్.నమశ్శివాయ పేర్కొన్నారు. ప్రస్తుత స్థాయి నుంచి పది గ్రాముల బంగారం ధర రూ. 26,000-25,000కి తగ్గొచ్చన్నారు. రానున్న కాలంలో డాలరుతో రూపాయి మారకం విలువ రూ 56-54 స్థాయికి చేరొచ్చని అంచనాలు వేస్తున్నారని, దీనికి ప్రభుత్వం సుంకాలు తగ్గించడం తోడైతే ప్రస్తుత స్థాయి నుంచి బంగారం ధరలు గరిష్టంగా 15 నుంచి 18 శాతం తగ్గినా ఆశ్చర్చపోనవసరం లేదని నమశ్శివాయ పేర్కొన్నారు. పెళ్లిల సీజన్, శ్రావణ మాసం వంటివి ఉండటంతో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ బాగుంటుందని, దీంతో తక్షణం ధరలు బాగా తగ్గే అవకాశాలు తక్కువని, నవంబర్ నాటికి బాగా తగ్గొచ్చని అంచనా వేస్తున్నట్లు ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శరత్ శర్మ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కిలోకి ఐదు లక్షలు అధికం బంగారంపై ప్రభుత్వ ఆంక్షల వల్ల అంతర్జాతీయ ధరల కంటే దేశీయంగా కిలో బంగారం ధర రూ. 5 లక్షలు అధికంగా ఉందని రిద్ధిసిద్ధి బులియన్స్ డెరైక్టర్ గుంపెళ్ల శేఖర్ పేర్కొన్నారు. బంగారం దిగుమతులపై ఆర్బీఐ విధించిన 20:80 శాతం నిబంధనలతో రూ. 2 లక్షలు, దిగుమతి సుంకంతో రూ. 2 లక్షలు, వ్యాట్ లక్ష చొప్పున మొత్తం అయిదు లక్షలు అధికంగా ఉందన్నారు. ఇప్పుడు ఆర్బీఐ 20:80 పరిధి కింద మరో పది కంపెనీలకు బంగారం దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో ఇప్పటి వరకు ఉన్న ప్రీమియం కిలోకి రూ.80,000 తగ్గిందన్నారు. మోడీ ప్రభుత్వం సుంకాలు తగ్గిస్తే మరో 5 శాతం తగ్గుతుందని, అప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ.25,000కి రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బంగారం అమ్మకాలకు డిమాండ్ లేదని, ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత వస్తే కాని ఎంత వరకు తగ్గవచ్చన్నది చెప్పలేమని ఆంధ్రప్రదేశ్ గోల్డ్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. ప్రస్తుతం పది శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 4-5 శాతానికి తగ్గిస్తే దీపావళి నాటికి బంగారం ధరలు రూ. 23,000 నుంచి రూ.24,000కు తగ్గుతాయని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు అంతర్జాతీయంగా పుత్తడికి డిమాండ్ తగ్గడం, ఇదే సమయంలో బంగారం ఉత్పత్తి పెరుగుతుండటంతో ఇప్పట్లో ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదని బులియన్ నిపుణులు అంటున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం జనవరి- మార్చి త్రైమాసికంలో బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే ఇండియాలో 26%, చైనాలో 16% క్షీణించడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. ఒకవేళ ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,280 డాలర్ల వద్దే స్థిరంగా ఉన్నా, దేశీయ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ తగ్గుతుందని నమశ్శివాయ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 1,050 డాలర్ల వరకు క్షీణించే అవకాశం ఉందని, ఒకవేళ పెరిగితే 1,320-1,400 డాలర్ల వద్ద తీవ్ర నిరోధాలున్నాయన్నారు. ఇలా ఏ విధంగా చూసినా రానున్న కాలంలో ఇండియాలో బంగారం ధరలు తగ్గడమే కాని పెరిగే అవకాశాలు తక్కువన్నది చాలామంది నిపుణుల అభిప్రాయం.