
పసిడిపై బడ్జెట్ ఎఫెక్ట్!
2016-17 వార్షిక బడ్జెట్ ప్రభావం బడ్జెట్‌పై ఉంటుందని నిపుణుల అంచనా. ప్రత్యేకించి పసిడి దిగుమతి సుంకంపై కేంద్రం నిర్ణయం పసిడి ధరలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పసిడిపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. దీనిని పెంచితే దేశీయంగా ధర మరింత పెరుగుతుందని, తగ్గిస్తే, కొంత తగ్గుదలకు అవకాశం ఉంటుందని ఈ రంగంలో నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌తో పోల్చితే భారత్‌లో ధర దాదాపు రూ.3,000 అధిక ప్రీమియంతో ఉంది.
వారంలో ధర కదలికలు ఇలా...
అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ డెలివరీ పసిడి ఔన్స్ (31.1గ్రా) కాంట్రాక్ట్ ధర వారం వారీగా దాదాపు 10 డాలర్లు తగ్గింది. 1,220 డాలర్లు వద్ద ముగిసింది. లాభాల స్వీకరణ దీనికి కారణంగా పేర్కొంటున్నారు. అయితే రూపాయి బలహీనత కారణంగా, దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర వారం వారీగా స్వల్పంగా రూ.135 ఎగసింది. రూ.29,230 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర సైతం ఇంతే స్థాయిలో ఎగసి 29,080కి చేరింది.