
పుత్తడి దిగుమతులపై తాజా ఆంక్షలు లేనట్టే!
న్యూఢిల్లీ: పుత్తడి దిగుమతులు ఈ డిసెంబర్ మొదటి రెండు వారాల్లో భారీగా తగ్గడంతో బంగారం దిగుమతులపై ప్రభుత్వం కొత్తగా ఆంక్షలు విధించే అవకాశాల్లేవు. ఈ ఏడాది నవంబర్‌లో 150 టన్నుల బంగారం దిగుమతులు జరిగాయి. గత నెల 28న బంగారం దిగుమతులకు సంబంధించిన వివాదస్పదమైన 80:20 స్కీమ్‌ను ఆర్‌బీఐ రద్దు చేసింది.
ఈ స్కీమ్‌ను రద్దు చేసినప్పటికీ, డిసెంబర్‌లో మొదటి రెండు వారాల్లో 25 టన్నుల బంగారం దిగుమతులే జరిగాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. దీంతో ప్రభుత్వం పుత్తడి దిగుమతులపై తాజాగా ఎలాంటి ఆంక్షలు విధించే అవకాశాల్లేవని ఆయన వివరించారు. కాగా గత ఏడాది డిసెంబర్‌లో 30 టన్నుల బంగారం దిగుమతులు జరిగాయి. విలువ పరంగా చూస్తే ఈ ఏడాది నవంబర్‌లో పుత్తడి దిగుమతులు ఆరు రెట్ల వృద్ధితో రూ.35,000 కోట్లకు పెరిగాయి.