పడిన పసిడి ధర
ముంబై: దిగుమతులపై ఆంక్షలను రిజర్వు బ్యాంకు సడలించడంతో బంగారం ధర గురువారం భారీగా పతనమైంది. పది నెలల కనిష్టస్థాయికి చేరింది. ముంబై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం (99.5 ప్యూరిటీ) రేటు రూ.780 క్షీణించి రూ.27,690కి చేరింది. బుధవారం క్లోజింగ్ ధర రూ.28,470. ప్యూర్ గోల్డ్ (99.9 ప్యూరిటీ) ధర ఇదే స్థాయిలో పతనమై రూ.28,620 నుంచి రూ.27,840కి చేరుకుంది. వెండి ధర కిలోకు రూ.85 పెరిగి రూ.41,860 వద్ద ముగిసింది. బుధవారం క్లోజింగ్ ధర రూ.41,775.
ఢిల్లీలో రూ.800...
దేశ రాజధానిలో బంగారం ధర రూ.800 వరకు క్షీణించింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో రేటు పతనం కావడం ఈ ఏడాది ఇదే ప్రథమం. పది గ్రాముల పసిడి ధర రూ.28,550కి చేరింది. గత పది నెలల్లో ఇదే కనిష్ట ధర. చెన్నై మార్కెట్లోనూ ధర దిగజారింది. పది గ్రాముల పుత్తడి రేటు రూ.800 తగ్గిపోయి రూ.28,310కి చేరుకుంది. కోల్‌కతాలోనూ రూ.665 తగ్గుదలతో రూ.28,340కి చేరింది.
పసిడి దిగుమతికి ట్రేడింగ్ హౌస్‌లను అనుమతిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. పెరుగుతున్న కరెంటు అకౌంటు లోటు(క్యాడ్)ను అదుపు చేసేందుకు గతేడాది జూలై నుంచి పుత్తడి దిగుమతులపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. బ్యాంకులను మాత్రమే, అది కూడా 80ః20 ఫార్ములాతో(దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతాన్ని తిరిగి ఎగుమతి చేయాలనే నిబంధన) దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. ప్రస్తుతం క్యాడ్ అదుపులోకి రావడం తో పాటు ఆభరణాల తయారీదారులు, బులి యన్ డీలర్ల విజ్ఞప్తులతో దిగుమతులపై ఆంక్షల ను సడలించారు. దీంతో స్టాకిస్టులు భారీగా అ మ్మకాలు జరపడంతో ధరలు పతనమయ్యాయి.
నెలకు 10-15 టన్నులు పెరగనున్న దిగుమతులు..
దిగుమతులపై ఆంక్షలు సడలించడంతో బంగారం దిగుమతులు నెలకు 10-15 టన్నుల మేరకు పెరిగే అవకాశముంది. ఎన్నికల ఫలితాల తర్వాత రూపాయి మారకం రేటు పుంజుకుందనీ, కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడనుండడంతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిందనీ అఖిల భారత రత్నాలు, ఆభరణాల సమాఖ్య (జీజేఎఫ్) డెరైక్టర్ బచ్‌రాజ్ బామాల్వా న్యూఢిల్లీలో తెలిపారు.
సరఫరాలు పెరుగుతాయి: ఆంక్షల సడలింపు నేపథ్యంలో భారత్‌లోకి బంగారం అధికారిక సరఫరాలు పెరుగుతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజీసీ) అభిప్రాయపడింది. దిగుమతి లెసైన్సు ఉన్న వారు మళ్లీ మార్కెట్లోకి వస్తారని కౌన్సిల్ ఎండీ సోమసుందరం చెప్పారు. అయితే 80ః20 ఫార్ములా నేటికీ కొనసాగడం ప్రతికూల అంశమని వ్యాఖ్యానించారు.