పసిడికి చెక్!
ముంబై: దేశంలోకి బంగారం దిగుమతులకు కళ్లెంవేసేందుకు ప్రభుత్వం కొరఢా ఘులిపించింది. ప్రజల మోజును తగ్గించడానికి మంగళవారం పరోక్ష చర్యలకు దిగింది. బంగారం, వెండి ఆభరణాల దిగుమతి సుంకాన్ని ప్రస్తుత 10% నుంచి 15 శాతానికి పెంచింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆభరణాల విలువ మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, దేశీయ పరిశ్రమ ప్రయోజనాల పరిరక్షణకే ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక బంగారు ఆభరణాలపై రుణ నిబంధనలనూ మరింత కఠినతరం చేస్తూ మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
కారణాల్లోకి వెళితే...
ఒక్క పసిడి దిగుమతిపై ప్రస్తుతం 10% సుంకం అమల్లో ఉంది. ఇక ఆభరణాల దిగుమతులపై సైతం ఇప్పటివరకూ 10% సుంకమే అమల్లో ఉంది. ఇవి యంత్రాలమీద తయారై, తక్కువధరకు దిగుమతయ్యే పరిస్థితి నెలకొంది. రెండు రకాల సుంకాల మధ్య వ్యత్యాసం లేకపోవడంతో కొందరు వినియోగదారులు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆభరణాల కొనుగోలు వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితి దేశీయ పరిశ్రమ, ఈ పరిశ్రమపై ఆధారపడుతున్న చిన్న స్థాయి దేశీయ స్వర్ణకారులు, ఈ రంగంలోని కార్మికుల ప్రయోజనాలకు విఘాతంగా మారుతోంది. ఈ పరిస్థితుల నుంచి దేశ పరిశ్రమను రక్షించడానికే తాజా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 2012 జనవరిలో పసిడికి సంబంధించి ఈ సుంకాల వ్యత్యాసం 8 శాతంగా ఉండేది. వెండి విషయంలో 4 శాతంగా ఉండేది. అటు తర్వాత కేవలం బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను క్రమంగా ప్రభుత్వం 10 శాతానికి పెంచుతూ పోయింది. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- క్యాపిటల్ ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ పోయే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య ఉన్న వ్యత్యాసం) తీవ్ర సమస్యగా మారడం దీనికి కారణం. ప్రధానంగా ఈ మెటల్స్ డిమాండ్‌ను నెరవేర్చుకోవడానికి మనం అధికంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల దేశంపై దిగుమతుల భారం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వీటి కట్టడి కోసం ప్రభుత్వం, ఆర్‌బీఐ దృష్టి సారించాయి.
వర్తకులు, ఎగుమతిదారుల హర్షం
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దేశీయ పరిశ్రమ ప్రయోజనాలకు దోహదపడుతుందని దేశీయ ఆభరణాల తయారీ సంస్థలు, సంబంధిత చిన్న వర్తకులు, ఎగుమతిదారులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ ఆభరణాల వర్తకులకు ఇది ప్రయోజనం కలిగిస్తుందని పీసీ జ్యూవెలర్స్ ఎండీ బలరామ్ గర్గ్ పేర్కొన్నారు. రత్నాలు, ఆభరణాల ఎగుమతి అభివృద్ధి మండలి చైర్మన్ విపుల్ షా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2012-13లో బంగారం ఆభరణాల దిగుమతుల విలువ 5.04 బిలియన్ డాలర్లు. 2013-14 జూన్ క్వార్టర్‌లో ఈ విలువ 112 మిలియన్ డాలర్లు. భారత్‌కు ఆభరణాల దిగుమతులు ప్రధానంగా థాయ్‌లాండ్ నుంచి జరుగుతున్నాయి.
పుత్తడి రుణాలపై నిబంధనలు కఠినం
బంగారు ఆభరణాలపై రుణ నిబంధనలనూ కఠినతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక చర్య తీసుకుంది. బంగారం ధర తీవ్ర ఒడిదుడుకులకు లోనుకాకుండా, ఆభరణాలకు విలువకట్టే ప్రక్రియలో ప్రామాణీకీకరణను తీసుకురావడం, రుణ గ్రహీతకు పారదర్శక విధానం అందుబాటులో ఉంచడం తాజా నిబంధనల ప్రధాన లక్ష్యం. దీనిప్రకారం రుణం పొందడానికి హామీగా ఉంచిన పసిడి ఆభరణాలపై విలువ కట్టడానికి ఆర్‌బీఐ ఒక నిర్దిష్ట విధానాన్ని నిర్ణయించింది. ఇకపై 22 క్యారెట్లకు సంబంధించి రుణం మంజూరు చేసేటప్పటికి అంతకుముందటి 30 రోజుల్లో బొంబాయి బులియన్ అసోసియేషన్(బీబీఏ) కోట్ చేసిన ముగింపు ధరల సగటును ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ మేరకు ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం రుణాలు ఇవ్వడానికి హామీగా తీసుకునే పసిడి ఆభరణాలను విలువ కట్టడానికి ఒక నిర్దిష్ట విధానం అమల్లో లేదు. విలువ కట్టే విధానం ఏకపక్షంగా, ఎటువంటి పారదర్శకతా లేకుండా జరుగుతోంది.
విలువలో 60 శాతమే రుణం..: సూచించిన నిబంధనలకు లోబడి లెక్కించిన ఆభరణాల విలువలో 60 శాతాన్నే రుణంగా ఇవ్వాల్సి ఉంటుంది. రూ.5 లక్షలకు పైబడిన అన్ని లావాదేవీలకు సంబంధించి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు(ఎన్‌బీఎఫ్‌సీలు) రుణ గ్రహీత నుంచి పాన్ కార్డ్ కాపీని తప్పనిసరిగా తీసుకోవాలి. రూ.లక్ష ఆపైన రుణాలు కేవలం చెక్కు ద్వారానే మంజూరు చేయాలి. అన్ని బ్రాంచీల్లో ఒకే విధమైన డాక్యుమెంటేషన్‌ను నిర్వహించేలా పసిడి రుణ సంస్థలు చర్యలు తీసుకోవాలి. ‘కేవలం 2-3 నిముషాల్లోనే బంగారంపై రుణం’ వంటి తప్పుదోవపట్టించే ప్రకటనల జారీని ఆర్‌బీఐ నిషేధించింది.
శాఖ విస్తరణ కట్టుదిట్టం: బంగారంపై రుణాలిచ్చే ఎన్‌బీఎఫ్‌సీల బ్రాంచీల విస్తరణ నిబంధనలను సైతం ఆర్‌బీఐ కట్టుదిట్టం చేసింది. ఇప్పటికే 1000 బ్రాంచీలకుపైగా ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు తదుపరి బ్రాంచీల విస్తరణకు ఆర్‌బీఐ ఆమోదం పొందాలి. ఒకవేళ హామీగా ఉంచిన ఆభరణాలను వేలం వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమయితే, రుణం ఇచ్చిన బ్రాంచ్ ఉన్న పట్టణం, తాలూకాల్లోనే ఈ వేలం జరగాలి. తాకట్టు ఆభరణాలకు ఎన్‌బీఎఫ్‌సీలు రిజర్వ్ ధరను నిర్ణయించాలి. ఈ రిజర్వ్ ధర అప్పటికి గడచిన 30 రోజులుగా బొంబాయి బులియన్ అసోసియేషన్ ప్రకటించిన ధర సగటులో 85 శాతానికి తక్కువకాకుండా ఉండాలి.