ఆరుగురి చేతిలో 40% పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న పసిడిలో 40% పరిమాణాన్ని కేవలం ఆరుగురు ట్రేడర్లు నియంత్రిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి ఆరు నెలల(ఏప్రిల్-సెప్టెంబర్) కాలంలో వీరి ద్వారానే 40% పసిడి దిగుమతులు జరిగాయని ప్రభుత్వ వర్గాలు విశ్లేషించాయి. వీరిలో ముగ్గురు ముంబైకి చెందిన పసిడి ట్రేడర్లుకాగా, మిగిలినవారు ముంబై, బెంగళూరు, హర్యానాలకు చెందిన వర్తకులు.
అయితే ఈ ఆరుగురు ట్రేడర్లు నిర్వహించే వర్తకంలో చట్టవిరుద్ధమైన అంశాలేవీ లేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇటీవల పసిడి దిగుమతులు పుంజుకోవడంతో ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించే యోచనలో ఉన్న సంగతి తెలిసిందే.