ఎగుమతులు నిరుత్సాహం
న్యూఢిల్లీ: భారత ఎగుమతులు ఈ ఏడాది అక్టోబర్‌లో నిరాశపరిచాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా ఈ విలువ 5.04 శాతం క్షీణించింది. ఆరు నెలల తరువాత ఎగుమతుల రంగంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకుంది. విలువ రూపంలో కేవలం 26.09 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఇక దిగుమతుల విషయానికి వస్తే- ఇవి 3.62 శాతం పెరిగాయి. ఈ విలువ 39.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దీనితో ఎగుమతులు-దిగుమతులకు మధ్య ఉన్న వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు ఈ నెలలో 13.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో వాణిజ్యలోటు 10.59 బిలియన్ డాలర్లు.
బంగారంపై ఆంక్షలు కొనసాగింపు!?
బంగారం దిగుమతులు పెరగడం వాణిజ్యలోటు భారీగా ఉండడానికి కారణాల్లో ఒకటి. 2013 అక్టోబర్‌లో బంగారం దిగుమతుల విలువ 1.09 బిలియన్ డాలర్లు. అయితే 2014 అక్టోబర్‌లో ఈ విలువ ఏకంగా 4.17 బిలియన్ డాలర్లకు ఎగసింది. బంగారం, వెండి రెండింటినీ చూస్తే ఈ విలువ 1.38 బిలియన్ డాలర్ల నుంచి 4.85 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఆయిల్ దిగుమతులు తగ్గడం వల్ల వాణిజ్య లోటు ఈ స్థాయిలో ఉందికానీ, లేదంటే ఈ లోటు మరింత పెరిగేదని నిపుణుల వ్యాఖ్య.
నెలవారీగా చూస్తే అంటే సెప్టెంబర్‌తో పోల్చిచూస్తే- వాణిజ్యలోటు 14.25 బిలియన్ డాలర్ల నుంచి 13.36 బిలియన్ డాలర్లకు తగ్గింది. పండుగల సీజన్లో డిమాండ్ పెరగడమే పసిడి దిగుమతుల పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ కరెంట్ అకౌంట్ లోటు కట్టడిలో భాగంగా ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కనకం దిగుమతుల కట్టడికి తీసుకుంటున్న చర్యల వల్ల ఈ మెటల్ దిగుమతులు గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. కాగా వరుసగా రెండవ నెల (సెప్టెంబర్ 4.22 బిలియన్ డాలర్లు) బంగారం దిగుమతులు 4 బిలియన్ డాలర్లు పైగా నమోదుకావడం- తాజా ఆందోళనకు కారణమవుతోంది.
ఈ మెటల్ దిగుమతుల కట్టడికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా సోమవారం తెలిపారు. పరిమాణం రూపంలో 2014 అక్టోబర్‌లో బంగారం దిగుమతుల పరిమాణం 150 టన్నులుగా ఉంది. 2013 ఇదే నెలలో ఈ పరిమాణం 24 టన్నులు. తాజా పరిణామం చూస్తుంటే... బంగారం దిగుమతులపై ఆంక్షలు మరికొంతకాలం తప్పేట్లు లేదని నిపుణుల వ్యాఖ్య.
అమెరికా, యూరప్‌ల స్థితికి అద్దం!
అమెరికా, యూరప్‌లలో మందగమన పరిస్థితులే ఎగుమతుల క్షీణతకు ప్రధాన కారణమని భారత ఎగుమతిదారుల సంఘం (ఎఫ్ఐఈఓ) ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ పేర్కొన్నారు. ఎగుమతిదారులకు సహాయం చేయడానికి ప్రభుత్వం కూడా ఇంకా ముందుకు రాకపోవడం పట్ల ఆయన నిరాశను వెలిబుచ్చారు. ఎగుమతిదారులకు సానుకూలమైన కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని సీఐఐ జాతీయ కమిటీ (ఎగుమతులు, దిగుమతుల విభాగం) చైర్మన్ సంజయ్ బుధియా అన్నారు. ఇంట్రస్ట్ సబ్వెన్షన్ స్కీమ్‌ను మళ్లీప్రవేశపెట్టాలని ఈ రంగం కోరుతోంది.