
స్విట్జర్లాండ్ నుంచి భారీగా బంగారం దిగుమతులు
న్యూఢిల్లీ/బెర్న్: స్విట్జర్లాండ్ నుంచి భారత్‌కు ఈ ఏడాది రూ.70 వేల కోట్ల విలువైన బంగారం దిగుమతులు జరిగాయి. ఒక్క సెప్టెంబర్‌లోనే రూ.15,000 కోట్ల బంగారం దిగుమతులు స్విట్జర్లాండ్ నుంచి భారత్‌కు జరిగాయి. ఇది అంతకు ముందటి నెల బంగారం దిగుమతులతో పోల్చితే రెండు రెట్లు అధికం. ఈ వివరాలను స్విస్ కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. సెప్టెంబర్‌లో అధిక సంఖ్యలో బంగారం దిగుమతులు జరగడానికి దీపావళి, ఇతర పండుగలు ఒక కారణమని నిపుణులంటున్నారు. నల్లధనం విషయమై భారత్‌లో రాజకీయంగా దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో కొందరు తమ సొమ్ములను స్విట్జర్లాండ్ నుంచి బంగారం రూపంలో లేయరింగ్ చేస్తున్నారన్న అనుమానాలూ లేకపోలేదు. ఈ లేయరింగ్ కారణంగానే బంగారం దిగుమతులు సెప్టెంబర్‌లో భారీగా పెరిగాయన్ని వాదన కూడా ఉంది. నల్లధనం దాచుకున్న వారి వివరాలు వెల్లడి కాకుండా బంగారం, వజ్రాల వ్యాపారం ముసుగులో లేయరింగ్ అనే కొత్తవ్యూహాం వెలుగులోకి వచ్చిందని ప్రభుత్వ, బ్యాం కింగ్ వర్గాలంటున్నాయి. స్విట్జర్లాండ్ నుంచి భారత్‌కు తమ నల్లధనం నిధులను బంగారం, వజ్రాల వ్యాపారం ముసుగులో తరలిస్తున్నారని సందేహం పెరిగిపోతోంది. మనీ లాండరింగ్‌లో ఇది కీలకమైనదని నిపుణులంటున్నారు.
స్విస్ బ్యాంకుల జాగ్రత్త
భారతీయులు స్విట్జర్లాండ్‌లో నల్లధనాన్ని పోగేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో స్విస్ బ్యాంక్‌లు భారత క్లయింట్లతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని సమాచారం. నల్లధనం విషయమై వివిధ దేశాలు తీసుకునే చర్యలకు సంబంధించి, స్విస్ బ్యాంకులకు ఎలాంటి బాధ్యత లేదంటూ అండర్ టేకింగ్స్ ఇవ్వాలని క్లయింట్లను స్విస్ బ్యాంకులు కోరుతున్నాయి. ఇలాం టి అండర్ టేకింగ్స్ ఇవ్వకపోతే సదరు క్లయింట్లు తమ ఖాతాలను మూసేయాలని కూడా ఈ బ్యాంకులు కోరుతున్నాయని సమచారం.