
రూ. లక్ష కోట్లకు చేరువో ‘స్విస్’ పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా స్విట్జర్లాండ్ పసిడికి దేశీయంగా గిరాకీ బాగా పుంజుకుంటోంది. వెరసి ఈ ఏడాది(2014) ఇప్పటివరకూ దిగుమతైన పసిడి విలువ రూ. లక్ష కోట్ల(ట్రిలియన్) సమీపానికి చేరింది. ఇందుకు అక్టోబర్ నెల కూడా జత కలిసింది. అక్టోబర్‌లో స్విస్ నుంచి దేశానికి రూ. 18,000 కోట్ల(2.8 బిలియన్ ఫ్రాంక్‌లు) విలువైన బంగారం దిగుమతి అయ్యింది. అంతకుముందు ఆగస్ట్‌లోనూ 2.2 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల విలువైన దిగుమతులు నమోదుకావడం గమనార్హం.
ఈ గణాంకాలను స్విస్ కస్టమ్స్ పాలనా విభాగం తాజాగా విడుదల చేసింది. దీంతో జనవరి మొదలు అక్టోబర్ చివరివరకూ మొత్తం 14.2 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల(రూ. 93,000 కోట్లు) విలువైన బంగారం దేశానికి దిగుమతి అయ్యింది. పసిడి ట్రేడింగ్ ద్వారా దేశంలోకి నల్లధనం దిగుమతి అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ గణాంకాలకు ప్రాధాన్యత ఏర్పడింది.