న్యూఢిల్లీ: పుత్తడి దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల కాలంలో 7 శాతం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ కాలానికి 2,473 కోట్ల డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 2,300 కోట్ల డాలర్లకు తగ్గాయని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో వాణిజ్య లోటు 14,823 కోట్ల డాలర్ల నుంచి 11,800 కోట్ల డాలర్లకు తగ్గిందని పేర్కొంది. కాగా 2018 , జూలై–సెప్టెంబర్ కాలానికి 2.9 శాతంగా ఉన్న కరంట్ అకౌంట్ లోటు(క్యాడ్) గత ఏడాది ఇదే కాలానికి 0.9%కి తగ్గింది. విలువ పరంగా చూస్తే క్యాడ్ 1,900 కోట్ల డాలర్ల నుంచి 630 కోట్ల డాలర్లకు చేరింది. ఈ ఏడాది జూలై నుంచి పుత్తడి దిగుమతులు తగ్గుతూనే ఉన్నాయి.
వార్షిక దిగుమతులు 800–900 టన్నులు
ప్రపంచంలోనే పుత్తడిని అత్యధికంగా దిగుమతి చేసుకునేది మన దేశమే. వార్షికంగా దిగుమతులు 800–900 టన్నుల మేర ఉంటాయని అంచనా. ఈ నేపథ్యంలో పుత్తడి దిగమతులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 10% నుంచి 12.5 శాతానికి పెంచింది. ఈ సుంకం పెంపు కారణంగా పలు కంపెనీలు తమ తయారీ కేంద్రాలను పొరుగు దేశాలకు తరలిస్తున్నాయని పుత్తడి పరిశ్రమ పేర్కొంది. దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment