
బంగారం దిగుమతి సుంకాల తగ్గింపు?
ముంబై: స్మగ్లింగ్‌ను నిరోధించే దిశగా పసిడి దిగుమతులపై సుంకాలను తగ్గించాలని యోచిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం 10 శాతంగా ఉన్న దీన్ని 6 శాతానికి తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం. రికార్డు స్థాయిలోని కరెంటు అకౌంటు లోటును భర్తీ చేసుకునేందుకు, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు 2013లో ప్రభుత్వం పసిడి దిగుమతి సుంకాన్ని మూడు సార్లు పెంచింది. దీంతో పసిడి దిగుమతులు భారంగా మారడంతో .. స్మగ్లింగ్‌కు ఊతమిచ్చినట్లయిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
సుంకాల విధానం పారదర్శకతను పెంచే విధంగానే ఉండాలి తప్ప స్మగ్లింగ్‌కు ఊతమిచ్చేలా ఉండకూడదని వ్యాఖ్యానించాయి. గతేడాది దాదాపు 120 టన్నుల బంగారం దిగుమతి స్మగ్లింగ్ జరగ్గా ఈ ఏడాది ఈ పరిమాణం మరింత పెరిగి 140 టన్నుల నుంచి 160 టన్నుల దాకా ఉండొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనా. వివిధ అంశాల కారణంగా ఈ ఏడాది దేశీయంగా పసిడి వినియోగం ఏడేళ్లలో కనిష్ట స్థాయికి తగ్గిపోవచ్చని..సుమారు 650 టన్నుల నుంచి 750 టన్నుల దాకా మాత్రమే ఉండొచ్చని డబ్ల్యూజీసీ నవంబర్‌లో అంచనా వేసింది.