అమెరికాపై సుంకాలు ఎత్తేసిన ఇజ్రాయెల్
జెరూసలేం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరికలు పని చేస్తున్నాయి. అమెరికా దిగుమతులపై అన్ని సుంకాలను ఇజ్రాయెల్ ఎత్తేసింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం ఈ మేరకు ప్రకటించారు. ‘‘అమెరికా వస్తువులపై కస్టమ్స్ సుంకాలను రద్దు చేయడమంటే మార్కెట్‌ను ఒక దశాబ్దం పాటు పోటీకి తెరవడం. ఆర్థిక వ్యవస్థకు వైవిధ్యాన్ని పరిచయం చేయడం. జీవన వ్యయాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం ఎంచుకున్న విధానాల్లో ఇది అదనపు దశ. మార్కెట్‌కు, ఇజ్రాయెల్ పౌరులకు ప్రయోజనం చేకూర్చేది. ఇజ్రాయెల్, అమెరికాల సంబంధాలను ఈ చర్య మరింత బలోపేతం చేస్తుంది’’ అని ‘ఎక్స్’లో నెతన్యాహు ప్రకటించారు.40 ఏళ్ల స్వేచ్ఛా వాణిజ్యంఇజ్రాయెల్, అమెరికా మధ్య 40 ఏళ్లుగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లో ఉంది. 99 శాతం అమెరికా దిగుమతులను ఇజ్రాయెల్ ఇప్పటికే సుంకాల నుంచి మినహాయించింది. ఈ నేపథ్యంలో తాజా చర్యను ఆర్థిక చర్యగా కంటే దౌత్య, రాజకీయ చర్యగా భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వ్యవసాయోత్పత్తులపై ఇజ్రాయెల్ ఏటా 42 మిలియన్ షెకెల్స్ (సుమారు 1.15 కోట్ల డాలర్ల) సుంకాలు వసూలు చేస్తోంది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం 2024లో ఆ దేశం మొత్తం ఎగుమతుల విలువ 172 కోట్ల డాలర్లు. అమెరికా నుంచి దిగుమతుల విలువ 92 కోట్ల డాలర్లు.