61 శాతం పెరిగిన పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంక్ దిగుమతుల నిబంధనలను సడలించడం, అంతర్జాతీయంగా ధరలు క్షీణించడం వంటి పలు అంశాల వల్ల దేశంలోకి పసిడి దిగుమతి బాగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి రెండు మాసాల్లో (ఏప్రిల్-మే) బంగారం దిగుమతి 61% వృద్ధితో 155 టన్నులకు చేరింది. గతేడాది ఇదే సమయంలో బంగారం దిగుమతి 96 టన్నులు. జ్యూయలరీ పరిశ్రమ నుంచి డిమాండ్ అధికంగా ఉండటం వల్ల బంగారం దిగుమతి బాగా పెరిగింది.
బంగారం దిగుమతి 2013-14 ఆర్థిక సంత్సరంలో 662 టన్నులుగా, 2014-15లో 916 టన్నులుగా ఉంది. అధిక మొత్తంలో బంగారం దిగుమతి ప్రభావం దేశ కరెంటు ఖాతా లోటుపై ఉంటుంది. 2013-14లో 1.7%గా ఉన్న కరెంటు ఖాతా లోటు 2014-15లో 1.3%కి తగ్గింది.