న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు గతేడాది భారీ ఎత్తున పెరిగాయి. ఏకంగా 846 టన్నుల పసిడి దేశంలోకి దిగుమతి అయింది. అంతర్జాతీయంగా ధరలు తక్కువ స్థాయిలో ఉండటంతో పాటు దేశీయంగా డిమాండ్ పెరగడమే దిగుమతులు అధికం కావడానికి కారణాలుగా ఎంఎంటీసీ– పీఏఎంపీ ఇండియా పేర్కొంది. 2016లో దిగుమతి అయిన బంగారం 550 టన్నులతో పోలిస్తే గతేడాది దిగుమతులు 53 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. 2017లో పసిడి దిగుమతులు గణనీయంగా పెరిగినట్టు ఎంఎంటీసీ–పీఏఎంపీ ఇండియా ప్రెసిడెంట్ విపిన్ రైనా తెలియజేశారు.
ఒక్క డిసెంబర్ నెలలోనే దిగుమతి అయిన బంగారం 70 టన్నులుగా ఉండటం విశేషం. 2016 డిసెంబర్ మాసంలో ఇది 49 టన్నులు మాత్రమే. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్‌కు తోడు అంతర్జాతీయంగా తక్కువ ధరలు ఉండటం పసిడి దిగుమతులను పెంచాయని రైనా అన్నారు. బంగారం దిగుమతులపై ప్రస్తుతం 10 శాతం సుంకం అమల్లో ఉంది. గతేడాది జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా, ఇందులో బంగారంపై 3 శాతం పన్ను వేసినప్పటికీ డిమాండ్ తగ్గకపోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment