ఆభరణాలకు రికార్డు స్థాయి డిమాండ్
⇒ 2014లో 662 టన్నులు
⇒ పెట్టుబడుల్లో వెనుకంజ
⇒ మొత్తంగా తగ్గిన డిమాండ్
⇒ భారత్‌పై డబ్ల్యూజీసీ నివేదిక
న్యూఢిల్లీ: భారత్ పసిడి ఆభరణాల డిమాండ్ 2014లో 662.1 టన్నులుగా నమోదయ్యింది. 2013తో పోల్చితే ఇది ఎనిమిది శాతం ఎక్కువ. పసిడి దిగుమతులపై పలు ఆంక్షలు ఉన్నప్పటికీ డిమాండ్ పెరగడం విశేషం. 1995 నుంచీ చూసుకుంటే, ఒక్క ఆభరణాల కోసం ఇంత డిమాండ్ పెరగడం ఇదే మొదటిసారి. అయితే పెట్టుబడుల డిమాండ్ మాత్రం 50 శాతం పడిపోయింది. ఈ విలువ 180.6 టన్నులుగా నమోదయ్యింది. ఇది ఐదేళ్ల కనిష్ట స్థాయి.
అంటే అటు ఆభరణాలకు, ఇటు పెట్టుబడులకు కలిపి 2014లో భారత్ మొత్తం డిమాండ్ పరిమాణం 842.7 టన్నులు. 2013లో ఈ పరిమాణం 974.8 టన్నులు. కాగా చైనాతో (813.6 టన్నులు) పోలిస్తే భారత్ డిమాండ్‌లో మొదటిస్థానంలో ఉంది. దీనితో ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్ తొలి స్థానంలో నిలిచినట్లయ్యింది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే, 2015లో కూడా ఆభరణాలకు డిమాండ్ పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. మరిన్ని అంశాల్లోకి వెళితే...
⇒ 2014లో బంగారం దిగుమతులు 769 టన్నులు. 2013లో ఈ పరిమాణం 825 టన్నులు. అయితే వార్షికంగా పసిడి అక్రమ రవాణా దాదాపు 175 టన్నులు ఉంటుందని అంచనా.
⇒ పరిశ్రమలు, డెకరేటివ్ అప్లికేషన్స్ వంటి విభాగాల్లో పసిడి వినియోగం 2014లో ఆరుశాతం తగ్గింది. ఐదేళ్ల కనిష్ట స్థాయి 87.5కి ఈ పరిమాణం పడిపోయింది.
⇒ పట్టు వంటి వస్త్రాల్లో జరి దారం వినియోగం ఏయేటికాయేడు తగ్గుతూ వస్తోంది. మారుతున్న వినియోగదారుల అభిరుచికి ఇది అద్దం పడుతోంది.