సుంకాల తగ్గింపు యోచన లేదు
న్యూఢిల్లీ: బంగారం దిగుమతి సుంకాల తగ్గింపు తక్షణ యోచన లేదని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పేర్కొన్నారు. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా గత యేడాది బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దిగుమతి సుంకాల పెంపు వల్లే బంగారం అక్రమ రవాణా పెరిగిందని తాను చెప్పలేనని అన్నారు. మోడీ సర్కారు అధికారం చేపట్టి వంద రోజులు పూర్తై సందర్భంగా బుధవారం న్యూఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు.
విభిన్నంగా నూతన విదేశీ వాణిజ్య విధానం
2014-19 కాలానికి త్వరలో ప్రకటించనున్న నూతన విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్‌టీపీ) గత విధానాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తయారీ, ఎగుమతుల రంగాల్ని ప్రోత్సహించేదిగా నూతన విధానం ఉంటుందని అన్నారు.
ఈయూతో స్వేచ్ఛా వాణిజ్యం...
యూరోపియన్ యూనియన్(ఈయూ)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడానికి ఇండియా సుముఖంగా ఉందనీ, అయితే భారత్ లేవనెత్తిన అంశాల పరిష్కారానికి ఈయూ కృషిచేయాలని కోరుకుంటున్నామనీ నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈయూ రాయబారి ఇటీవల తనతో సమావేశమైనపుడు ఈ విషయం ఎఫ్‌టీఏ ప్రస్తావన వచ్చిందని పేర్కొన్నారు.
జీ-20లో భారత్‌కు నిర్మల ప్రాతినిధ్యం
ఆస్ట్రేలియాలో ఈ నెల 20,21 తేదీల్లో నిర్వహించనున్న జీ20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మధుమేహానికి చికిత్స తీసుకుంటుండడంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
సోలార్ ప్యానెళ్లపై సుంకాలు ఉండావు..
అమెరికా, చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే సోలార్ ప్యానెళ్లపై యాంటీ డంపింగ్ సుంకం విధించరాదని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీతారామన్ తెలిపారు. యాంటీ డంపింగ్ సుంకం విధిస్తే సౌర పరికరాల ధరలు పెరుగుతాయంటూ విద్యుదుత్పత్తి సంస్థలు ఈ సుంకాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే, దేశీయ పరిశ్రమను కాపాడేందుకు అమెరికా, చైనా, మలేసియాల నుంచి దిగుమతి చేసుకునే సోలార్ సెల్స్‌పై ఒక వాట్‌కు 0.11-0.81 డాలర్ల సుంకం విధించాలని వాణిజ్యశాఖ గత మేనెలలో సిఫార్సు చేసింది.