బంగారు ఉత్పత్తులకు అందించే హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ)ను మరో 18 జిల్లాల్లో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానంతో 40 కోట్లకు పైగా బంగారు ఆభరణాలు, వస్తువులు ఈ గుర్తింపు పొందాయి. ఇది మార్కెట్‌లో బంగారు ఉత్పత్తులకు సంబంధించి వినియోగదారుల విశ్వాసాన్ని, ఉత్పత్తుల పారదర్శకతను పెంపొందిస్తుందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
‘గోల్డ్ జువెల్లరీ అండ్ గోల్డ్ ఆర్ట్‌ఫ్యాక్ట్స్ ఎమెండమెంట్ ఆర్డర్-2024’ ప్రకారం బంగారు ఉత్పత్తులపై తప్పనిసరి హాల్‌మార్కింగ్ ఉండాలి. అందులో భాగంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆధ్వర్యంలో నవంబర్ 5, 2024 నుంచి హెచ్‌యూఐటీ నాలుగో దశను ప్రారంభించింది. ఇందులో అదనంగా 18 జిల్లాలను చేర్చారు. అందుకోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్తగా చేరిన జిల్లాలతో కలిపి తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం అమలులో ఉన్న జిల్లాల సంఖ్య 361కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని జిల్లాల్లో తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం అమల్లోకి వచ్చినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
ఇదీ చదవండి: 17,000 మంది ఉద్యోగుల తొలగింపు!
తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం ప్రారంభమైన జూన్ 23, 2021 నుంచి నమోదిత నగల వ్యాపారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ విధానం అమలు ప్రారంభంలో వీరి సంఖ్య 34,647గా ఉండేది. ప్రస్తుతం అది దాదాపు ఐదురెట్లు పెరిగి 1,94,039కు చేరింది. హాల్‌మార్కింగ్ కేంద్రాల సంఖ్య 945 నుంచి 1,622కి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment