ఎలక్ట్రానిక్స్ సంస్థలకు 10 వేల కోట్ల ఫండ్!
న్యూఢిల్లీ: దేశీ ఎలక్ట్రానిక్స్ సంస్థలకు ఆర్థిక చేయూతను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో రూ.10,000 కోట్ల మూలధనంతో ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఈడీఎఫ్)ను ఏర్పాటు చేయనున్నది. ఈ ఫండ్‌ను కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, పారిశ్రామికవేత్తలకు బాసటగా నిలువడానికి ఉపయోగిస్తామని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ తెలిపారు.
ఆయన ఇక్కడ జరిగిన క్వాల్‌కామ్ ‘డిజైన్ ఇన్ ఇండియా’ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దేశంలో 2014-15 ఏడాదిలో ఇంజరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని, 2020 నాటికి ఈ ఎగుమతుల విలువ 40 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముందని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) అభివృద్ధి కోసం ఒక అనుకూల వ్యవస్థ ఏర్పాటుకు రూ.25 కోట్ల ప్రారంభ వ్యయంతో బెంగళూరులో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు కానుందని తెలిపారు.
4 లక్షల డాలర్ల కార్పస్ ప్రకటించిన క్వాల్‌కామ్
ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ భాగస్వామ్యంతో క్వాల్‌కామ్ కంపెనీ భారతీయ పారిశ్రామికవేత్తలు ‘డిజైన్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారుచేయడానికి అనుగుణంగా 4 లక్షల డాలర్ల కార్పస్‌ను ప్రకటించింది. ‘డిజైన్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద క్వాల్‌కామ్ వినూత్నంగా ఆలోచించే కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 29 చివరి తేదీగా 10 సంస్థలను ఎంపిక చేసి, ఒక్కొక్క దానికి 10,000 డాలర్ల మూలధనాన్ని సమకూరుస్తుంది. ఈ మూలధనంతో ఆయా కంపెనీలు వాటి వాటి ఉత్పత్తి సంబంధిత ఆలోచనలను క్వాల్‌కామ్ బెంగళూరు ప్రయోగశాలలో కార్యరూపంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. 3 ఉత్తమ ఉత్పత్తులను ఎంపిక చేసి, వాటిని రూపొందించిన కంపెనీలకు ఒక్కొక్క దానికి లక్ష డాలర్ల మూలధనాన్ని అందిస్తుంది.