న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో భారత్ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. త్వరలో ప్రకటించబోయే సెమీకండక్టర్ ఫ్యాబ్, తొలి ప్యాకేజింగ్ యూనిట్‌లతో పాటు 2024 నాటికి 100 డిజైన్ స్టార్టప్‌లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాల ఊతంతో భారత్ సెమీకండక్టర్ల హబ్‌గా మారగలదని ఆయన పేర్కొన్నారు.
చిప్‌ల తయారీ కోసం రూ. 76,000 కోట్ల ప్రోత్సాహక పథకం, విరివిగా నిపుణుల లభ్యత, నైపుణ్యాలను పెంచే శిక్షణా కార్యక్రమాలు మొదలైనవి ఇందుకు దోహదపడగలదని చంద్రశేఖర్ చెప్పారు. ఐఐటీ ఢిల్లీలో జరిగిన మూడో సెమీకాన్‌ఇండియా ఫ్యూచర్‌డిజైన్ రోడ్‌షోలో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖర్ ఈ విషయాలు వివరించారు. దేశీయంగా ఏడాదిన్నర క్రితం సెమీకండక్టర్ డిజైన్ స్టార్టప్‌లనేవి దాదాపు శూన్యమని, కానీ ప్రస్తుతం 27–30 డిజైన్, సెమీకండక్టర్ అంకుర సంస్థలు పని చేస్తున్నాయని మంత్రి తెలిపారు.
2024 నాటికి ఈ విభాగంలో 100 పైచిలుకు అంకుర సంస్థలు ఏర్పాటయ్యే దిశగా ముందుకు వెడుతున్నామన్నారు. యాపిల్, సిస్కో, శాంసంగ్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ ఆవిష్కరణలకు భారత్ కేంద్రంగా నిలవగలదని.. తయారీ రంగం ఇప్పటికే ఊపందుకుందని చంద్రశేఖర్ తెలిపారు.
ఇన్‌కోర్‌లో సెకోయా పెట్టుబడులు..
రోడ్‌షో సందర్భంగా ఇన్‌కోర్ సెమీకండక్టర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సెకోయా క్యాపిటల్ ఇండియా ప్రకటించింది. ఇన్‌కోర్ ఇప్పటి వరకూ సెకోయా నుంచి 3 మిలియన్ డాలర్లు సమీకరించింది. సెమీకండక్టర్ల విభాగంలో సెకోయాకు ఈ ఏడాది ఇది రెండో పెట్టుబడి. ఈ మధ్యే మైండ్‌గ్రోవ్ అనే సంస్థలో ఇన్వెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment