న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద వ్యవధిలో అంతర్జాతీయ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో కీలకంగా ఎదిగే దిశగా భారత్ ముందుకు పురోగమిస్తోందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఆ స్థాయికి చేరుకునేందుకు చైనాకు 25–30 సంవత్సరాలు పట్టిందని ఆయన పేర్కొన్నారు. మొబైల్ ఫోన్స్ నుంచి కార్ల వరకూ అన్నింటా ఉపయోగించే చిప్‌ల తయారీని దేశీయంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలు భారత్ పురోగమనానికి దోహదపడగలవని ఆయన పేర్కొన్నారు.
‘ఈ 10 బిలియన్ డాలర్ల తోడ్పాటుతో వచ్చే 10 ఏళ్లలో సెమీకండక్టర్ల విభాగంలో కీలకంగా ఎదిగే దిశగా భారత్ ముందుకు వెడుతోంది. దీనికోసం చైనా వంటి దేశాలకు 25–30 ఏళ్లు పట్టేసింది. అయినా అవి ఇంకా పూర్తిగా సఫలం కాలేదు ‘అని మంత్రి చెప్పారు. మెమరీ సొల్యూషన్స్ దిగ్గజం మైక్రాన్ తలపెట్టిన ఏటీఎంపీ ప్రాజెక్టుతో సెమీకండక్టర్ల పరిశ్రమలో ప్రత్యక్షంగా 5,000, పరోక్షంగా 15,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) స్కీముతో .. వేదాంత, ఫాక్స్‌కాన్ వంటి దిగ్గజాలు ఇక్కడ చిప్స్ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment