ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డితో చర్చిస్తున్న బీఈఎల్ డైరెక్టర్లు
సాక్షి, అమరావతి: దేశ రక్షణ రంగంలో అత్యంత కీలకమైన అధునాతన క్షిపణులు (మిస్సైల్స్) రాష్ట్రంలో ఉత్పత్తి కానున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద 914 ఎకరాల్లో వీటి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. క్షిపణులతోపాటు రాడార్ టెస్ట్ బెడ్, ఇతర రక్షణ రంగ ఉత్పత్తులను కూడా ఇక్కడ తయారు చేయనుంది.
ఈ యూనిట్‌కు రూ.384 కోట్లు కేటాయిస్తూ శనివారం మచిలీపట్నంలోని బీఈఎల్‌లో జరిగిన సంస్థ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నిర్వాకంతో ఆగిపోయిన ఈ ప్రాజెక్టును వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని రకాల అనుమతులు మంజూరు చేయించింది. 2016లో ఉమ్మడి అనంతపురం జిల్లా పాలసముద్రం వద్ద కేటాయించిన భూమి కన్వర్షన్, పర్యావరణ అనుమతులు తేవడంతో అప్పటి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. దీంతో ఈ యూనిట్ నిలిచిపోయింది.
వైఎస్ జగన్ సీఎం అయ్యాక దీనిపై దృష్టి సారించారు. త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోపక్క యూనిట్ పనులు ప్రారంభించకపోతే భూ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు, పెనాల్టీ విధిస్తామంటూ బీఈఎల్‌కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఈఎల్ కొంత సమయం ఇవ్వాలని, పెనాల్టీలు రద్దు చేయాలని కోరింది.
గతంలో కంటే పెద్ద యూనిట్ ఏర్పాటు చేసేలా కొత్తగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏపీఐఐసీ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో బీఈఎల్ కూడా యూనిట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టింది. నిధులు కూడా కేటాయించింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై బీఈఎల్ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
శనివారం బోర్డు సమావేశం అనంతరం బెంగళూరు బీఈఎల్ డైరెక్టర్లు భాను పి.శ్రీవాత్సవ, వినయ్ కుమార్ కత్యాల్, మనోజ్ జైన్, డాక్టర్ పార్థసారధి మంగళగిరిలో ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని కలిసి ప్రభుత్వం చొరవను అభినందించారు. ఏమాత్రం ఆలస్యం కాకుండా వెంటనే టెండర్లు పిలిచి త్వరలోనే పనులు మొదలుపెడతామని తెలిపారు. 6 నెలలకు ఒకసారి సమావేశమై పనుల పురోగతిని సమీక్షిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment