టోక్యో: రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, జపాన్‌లు నిర్ణయించుకున్నాయి. జపాన్ పర్యటనలో భాగంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆ దేశ రక్షణ మంత్రి యసుకజు హమదాతో చర్చలు జరిపారు. ఇరు దేశాల సైన్యాల సమన్వయం మరింతగా పెరిగేందుకు వీలుగా తొలిసారిగా రెండు దేశాల అధునాతన యుద్ధవిమానాలతో కూడిన సంయుక్త సైనిక విన్యాసాలకూ ఆమోదం తెలుపుతూ మంత్రులిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తమ స్వేచ్ఛాయుత, వ్యూహాత్మక ఒప్పందాలు చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తాయని భారత్, జపాన్ భావిస్తున్న తరుణంలో ఇరు దేశాల రక్షణ మంత్రుల భేటీ జరగడం గమనార్హం.
‘రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు మొదలై 70 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి’ అని రాజ్‌నాథ్ ట్వీట్‌చేశారు. భారత రక్షణ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పరిశ్రమలను రాజ్‌నాథ్ కోరారు. మరోవైపు, భారత్–జపాన్ 2+2 మంత్రుల భేటీలో భాగంగా జపాన్ విదేశాంగ మంత్రి యొషిమస హయషితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చించారు.‘ ప్రపంచ దేశాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఇతర దేశాలతో విభేదాలను పరిష్కరించుకోవాలని, బెదిరింపులకు, సైనిక చర్యలకు పాల్పడకూడదు. దేశాల మధ్య తగాదాలు, వాతావరణ మార్పులతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమౌతోంది. దీంతో ఇంథన, ఆహార భద్రత సంక్షోభంలో పడుతోంది’ అని జైశంకర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment