ప్రదర్శనలో అలరించిన ‘సూర్యకిరణ్’ విమానాల విన్యాసాలు
సాక్షి, బెంగళూరు: రక్షణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాన్ని సాకారం చేసిన భారత్ తదుపరి లక్ష్యం ‘మేక్ ఫర్ వరల్డ్’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక సమీపంలో బుధవారం ప్రారంభమైన ఏరో ఇండియా వైమానిక ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెంగళూరులో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియాలో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు యుద్ధ సామగ్రిని ఎగుమతి చేయడంపై దృష్టి పెట్టిందని తెలిపారు. దేశంలో రక్షణ సామగ్రి ఉత్పత్తి కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. దాదాపు 500 కంపెనీలకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.
త్రివిధ దళాల కోసం 1.3 బిలియన్ డాలర్లను కేటాయించినట్లు గుర్తుచేశారు. దేశ సరిహద్దులతో పాటు నీరు, నేల రక్షణ విషయంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. భారత వాయుసేన తేజస్ ఎంకే1 లఘు యుద్ధ విమాన ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. కాగా, ఏరో ఇండియా ప్రదర్శనలో భారత వైమానిక దళ పాటవం అబ్బురపరిచింది. యుద్ధ హెలికాప్టర్లు, విమానాలు, సూర్యకిరణ్ జెట్ల విన్యాసాలు సందర్శకులను అలరించాయి. ఏరో ఇండియా ప్రదర్శన ద్వారా భారత ఖ్యాతి మరింత వెలుగులోకి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
హెచ్‌ఏఎల్‌తో రూ.48వేల కోట్ల డీల్
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి రూ.48వేల కోట్లతో 83 తేజస్ ఎంకే1ఏ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల(ఎల్‌సీఏ) కొను గోలుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. భారత రక్షణ కాంట్రాక్టుల విషయంలో ‘మేక్ ఇన్ ఇండియా’లో ఇదే అతిపెద్ద ఒప్పందమని నిపుణులు చెబుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో ఒప్పంద పత్రాలను రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ వి.ఎల్.కాంతారావు హెచ్‌ఏఎల్ ఎండీ ఆర్.మాధవన్‌కు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment