‘మేక్ ఇన్ ఇండియా’లో దూసుకుపోతున్న భారత్
2023–24లో రూ.1.26 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు
2019–20తో పోలిస్తే 60% వృద్ధి
రక్షణ రంగ దిగుమతుల్ని తగ్గించుకుంటున్న భారత్
ఐదు విడతల్లో 3,318 ఉత్పత్తులు, ముడిసరుకు దిగుమతులకు స్వస్తి
రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి రెట్టింపవుతోంది. ముడిసరుకు నుంచి ఆయుధ సంపత్తి వరకూ స్వదేశీ వాటా ఏటా పెరుగుతూ వస్తోంది. ‘మేక్ ఇన్ ఇండియా’లో దూసుకుపోతూ ఐదేళ్ల కాలంలో 60 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది.
2023–24 ఆరి్థక సంవత్సరంలో రూ.1.26 లక్షల కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తుల్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తయారు చేయడం విశేషం. రక్షణ రంగానికి చెందిన దిగుమతుల్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్న భారత్.. 2047 నాటికి పూర్తి 100 శాతం స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి సారిస్తూ దూసుకుపోతోంది. ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. – సాక్షి, విశాఖపట్నం
స్వదేశీ విధానంతో ముందుకు..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వదేశీ విధానంతో భారత రక్షణ వ్యవస్థ గతం కంటే పటిష్టంగా మారింది. ‘ఆత్మ నిర్భర్ భారత్’ పేరిట రక్షణ రంగంలోనూ స్వావలంబన సాధించేందుకు తీసుకొచి్చన సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, తమిళనాడులో డిఫెన్స్ ఇండ్రస్టియల్ కారిడార్లు ఏర్పాటు చేసింది. దేశీయ రక్షణ రంగ పరిశ్రమకు మూలధన సేకరణ బడ్జెట్‌లో 75% కేటాయించింది. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్), ఐడెక్స్ ప్రైమ్, ఐడెక్స్ అదితీ వంటి పథకాలు, ఆవిష్కరణలను ప్రారంభించడంతో సత్ఫలితాలు నమోదవుతున్నాయి.
ప్రపంచ కేంద్రంగా భారత్
ప్రపంచ రక్షణ తయారీ కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ ప్రణాళికల్ని అమలు చేస్తోంది. 2023–24 ఆరి్థక సంవత్సరంలో ఏకంగా రూ.1,26,887 కోట్ల విలువైన రక్షణరంగ ఉత్పత్తుల్ని భారత్ తయారు చేయడం విశేషం. గతేడాది కంటే 16.7 శాతం వృద్ధి నమోదు చేసింది. 2022–23లో రూ.1,08,684 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారయ్యాయి. 2019–20 నుంచి పరిగణనలోకి తీసుకుంటే.. ఐదేళ్ల కాలంలో 60 శాతం పెరుగుదల కనిపించింది.
అన్ని డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్‌లు (డీపీఎస్‌యూలు) ఇతర పీఎస్‌యూలు రక్షణరంగ వస్తువుల తయారీతో పాటు ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం దేశంలో రక్షణ ఉత్పత్తి విలువ రికార్డు స్థాయిలో ఉంది. 2023–24లో డీపీఎస్‌యూలు, పీఎస్‌యూల వాటా రూ.1,00,381 కోట్లు కాగా ప్రైవేట్ సంస్థలు రూ.26,506 కోట్ల ఉత్పత్తులు తయారు చేశాయి.
ఎగుమతుల్లోనూ అదే దూకుడు
స్వదేశీకరణ ప్రయత్నాలు నిరంతర ప్రాతిపదికన దూకుడుగా కొనసాగుతుండగా.. ఎగుమతుల్లోనూ అదే జోరు నమోదైంది. స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో మొత్తం వృద్ధికి డిఫెన్స్ ఎగుమతులు దోహదపడుతున్నాయి. 2023–24 ఆరి్థక సంవత్సరంలో డిఫెన్స్ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 21,083 కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.15,920 కోట్లతో పోలిస్తే 32.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశంలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ జాబితాలో తొలి కొనుగోలుదారుగా ఫిలిప్పీన్స్ నిలిచింది. తేజస్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసేందుకు సైతం ఫిలిప్పీన్స్ ఆసక్తి చూపిస్తోందనీ భారత రక్షణరంగ వర్గాలు చెబుతున్నాయి.
విడిభాగాల దిగుమతులు తగ్గుముఖం
వివిధ దేశాల నుంచి రక్షణ రంగానికి సంబంధించి 4,664 కీలక విడిభాగాలు దిగుమతి అవుతున్నాయి. ఐదు విడతలుగా 3,318 విడిభాగాల దిగుమతుల్ని నిలుపుదల చేసిన భారత్.. వీటిని స్వయంగా తయారు చేయడం ప్రారంభించింది. దేశంలోని ప్రతి నౌక, జలాంతర్గామి, విమానాలు, ఆయుధ వ్యవస్థ తయారీలో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతోంది. భారత రక్షణ రంగం స్వయం సమృద్ధిగా మారడానికి కట్టుబడి.. 2047 నాటికి పూర్తిగా స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment