
రక్షణ రంగానికి పెద్దపీట
న్యూఢిల్లీ: మోడీ సర్కారు తన తొలి బడ్జెట్‌లోనే రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2.29 లక్షల కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఈ కేటాయింపులు 12.5శాతం ఎక్కువని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 2013-14లో రూ.2,03,672 కోట్లు కేటాయించగా, మొన్నటి మధ్యంతర బడ్జెట్‌లో 2లక్షల 24 వేల కోట్లకు అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రతిపాదించారు. ప్రస్తుత బడ్జెట్‌లో జైట్లీ మరో రూ. 5 వేల కోట్లు పెంచారు. దేశ భద్రత విషయంలోరాజీ పడేది లేదని మంత్రి స్పష్టం చేశారు. సైనికదళాల ఆధునీకరణకు గత ఏడాది కేటాయించిన రూ.89,587.95 కోట్లకు అదనంగారూ.5వేల కోట్లు కేటాయించారు.
రక్షణశాఖ మూలధన పెట్టుబడులను రూ.5వేల కోట్లకు పెంచుతున్నట్టు జైట్లీ ప్రకటించారు. ఇందులోనే వెయ్యి కోట్లను సరిహద్దు ప్రాంతాలకు రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయటానికి ఉద్దేశించారు. రక్షణ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి నిధికి వంద కోట్లను కేటాయించారు. భద్రతాబలగాలు తమ ఆయుధ సంపత్తిని ఆధునీకరించుకునే దిశగా 126 మల్టీరోల్ యుద్ధ విమానాల కాంట్రాక్టును ప్రభుత్వం త్వరలోనే కుదుర్చుకోనుంది. ఈ కాంట్రాక్టు విలువ రూ. 60 వేల కోట్లు. 22 అపాచే యుద్ధ హెలికాప్టర్లు, 15 చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు, గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సామర్థ్యం ఉన్న విమానాలు ఆరింటికి సంబంధించిన 40 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు కొద్ది వారాల్లో పూర్తి కావచ్చు .
అంతర్గత భద్రత: వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవటానికి, దాని ప్రభావమున్న జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చనున్నట్టు జైట్లీ వివరించారు. ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలను బలోపేతం చేయడానికి రూ. 3వేల కోట్లు కేటాయించామన్నారు. ఒకేర్యాంకు.. ఒకే పింఛను భారత సైనికుల బాగోగుల పట్ల తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని జైట్లీ అన్నారు. మాజీ సైనికుల పింఛనులను ఒకే ర్యాంకు.. ఒకే పింఛను విధానం కిందకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది పింఛను అవసరాలు తీర్చేందుకు రూ. వెయ్యికోట్లు కేటాయించారు.
వార్ మెమోరియల్ ఏర్పాటు..
దేశ రాజధాని ఢిల్లీలో వార్ మెమోరియల్, ఇండియాగేట్ సమీపంలో ఉన్న ప్రిన్సెస్ పార్కులో మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ. 100 కోట్లు కేటాయించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవానులు, అధికారులను ఈ దేశం రుణపడి ఉందని.. వారి స్మృతి చిహ్నంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు జైట్లీ తెలిపారు. అలాగే సైనికులతో సమానంగా దేశంలో అంతర్గతంగా శత్రువులతో పోరాడి ప్రాణాలు అర్పించిన పోలీసుల స్మారకార్థం జాతీయ పోలీస్ మెమోరియల్ ఏర్పాటు కోసం రూ. 50 కోట్లు కేటాయించామన్నారు. దేశ సరిహద్దుల్లో మౌలిక వసతుల పెంపుదలకు ఇప్పటికే కేటాయించిన 2,250 కోట్లకు మరో రూ. 990 కోట్లు కేటాయించామని తెలిపారు.