శనివారం భానూర్‌లో రక్షణ రంగ ఉత్పత్తుల సంస్థ బీడీఎల్ ఉద్యోగులతో మాట్లాడుతున్న రాజ్‌నాథ్ సింగ్
పటాన్‌చెరు: రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలనే లక్ష్యంతో సాధిస్తున్న విజయాలు, మిస్సైళ్లు, ఇతర సాంకేతిక ఉత్పత్తులు వంటివి ఏ దేశాన్నో భయపెట్టేందుకు కాదని.. అవి కేవలం ప్రపంచ సంక్షేమానికేనని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం భానూర్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పరిశ్రమలో కొత్తగా ఏర్పాటు చేసిన వార్ హెడ్ తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
అక్కడి నుంచే వర్చువల్ పద్ధతిలో బీడీఎల్ కంచన్ బాగ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన రక్షణ రంగ సాంకేతికత ఆర్‌ఎఫ్ సీకర్‌ను.. ఏపీలోని వైజాగ్‌లో నెలకొల్పిన రక్షణ రంగం సెంట్రల్ స్టోర్స్‌ను, పశ్చిమ గోదావరిలోని మిలటరీ, మాధవరంలో బీడీఎల్ సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన స్కూల్, జిమ్, కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.
తమ ప్రభుత్వం దేశ రక్షణ రంగంలో ఎవరూ ఊహించని విధంగా గొప్ప సంస్కరణలు తీసుకువచ్చిందని.. అందులో అగ్నిపథ్ కూడా ఒకటని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ దేశాల్లోని విధివిధానాలను అధ్యయనం చేశాకే అగ్నిపథ్‌ను ప్రవేశపెట్టామన్నారు. బీడీఎల్ పరిశోధనలు, యుద్ధ ట్యాంకుల తయారీ, సాంకేతికతలో రక్షణ రంగానికి తోడ్పాటునందిస్తున్న తీరు హర్షణీయమని చెప్పారు. శాస్త్రవేత్తలను, బీడీఎల్ ఉద్యోగుల పనితీరును అభినందించారు. రక్షణ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలన్నారు.
కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే పరిశోధనలు జరగాలని.. ఇందుకోసం రక్షణ రంగ పరిశోధనలకు, విద్యా సంస్థల అనుసంధానం అవసరమని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్‌ప్రైజెస్ (సీపీఎస్‌ఈ) ఉండేవని.. ఇప్పుడు 250 సీపీఎస్‌ఈలు సుమారు రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులతో కొనసాగుతున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment