వస్తు, సేవల చట్టంతో సామాన్యుడికి మేలెంత?
దేశమంతటా ఒకే పన్ను వ్యవస్థను అమలు చేయటానికి వీలైన ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్’ అమలు ఖాయమైపోయింది. ముద్దుగా జీఎస్‌టీ అని పిలిచే ఈ బిల్లుకు సంబంధించి 122వ రాజ్యాంగ సవరణను రాజ్యసభ ఆమోదించటంతో పాటు... వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయటానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించటం దీనిపై ఉన్న సందిగ్ధాలన్నిటినీ తొలగించిందనే చెప్పాలి. పెపైచ్చు శాసన ప్రక్రియ పూర్తికావటానికి అనుసరించనున్న రోడ్ మ్యాప్‌ను కూడా గురువారం ప్రభుత్వం ప్రకటించింది. అంటే సెంట్రల్ జీఎస్‌టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీలపై పార్లమెంటు చట్టం చేయటం... స్టేట్ జీఎస్‌టీపై రాష్ట్రాలు చట్టం చేయటం వంటివన్న మాట. ఈ నేపథ్యంలో కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్‌గా వ్యవహరించి రిటైరైన పి.వి.సుబ్బారావు ‘సాక్షి’కి రాసిన ప్రత్యేక వ్యాసమిది..
ఒక్కమాటలో చెప్పా ంటే జీఎస్‌టీ అంటే... వస్తువులు లేదా సేవల సరఫరాపై విధించే సమగ్ర పన్ను. ప్రస్తుతం 150కి పైగా దేశాల్లో జీఎస్‌టీ లేదా వ్యాట్‌నే అనుసరిస్తున్నారు. దీని అమలు విషయానికొస్తే... ఒక వస్తువు లేదా సేవ వినియోగదారుడిని చేరాలంటే ముడిసరుకు నుంచి తయారీ, హోల్‌సేల్, రిటైల్... ఇలా పలు దశలుంటాయి. సేవల విషయంలోనూ అంతే. ఈ గొలుసులో ప్రతి దశలోనూ కొంత విలువ జోడించటమనేది జరుగుతుంది. పన్ను క్రెడిట్ వ్యవస్థ ద్వారా ఈ దశలన్నిటా పన్ను వసూలవుతుంది.
ప్రస్తుతమున్న వ్యాట్ లేదా సర్వీస్ ట్యాక్స్ వ్యవస్థలో... సెంట్రల్ ఎక్సైజ్, స్టేట్ వ్యాట్ వంటి చట్టాలు, సర్వీస్ ట్యాక్స్ నిబంధనలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందటానికి అవకాశం కల్పిస్తున్నాయి. అంటే.. సేవలు పొందిన వ్యక్తి లేదా వస్తువులు కొనుగోలు చేసిన వ్యక్తి చెల్లించే పన్నును సదరు అమ్మకందారు ముందే క్రెడిట్‌గా పొందుతారన్న మాట. కాకపోతే ప్రతిపాదిత జీఎస్‌టీలో... ఈ మూడు పరోక్ష పన్నుల చట్టాలూ విలీనమైపోతాయి. కేంద్రం చేసే సెంట్రల్ జీఎస్‌టీ చట్టం, రాష్ట్రాలు చేసే స్టేట్ జీఎస్‌టీ చట్టం (సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ) అమల్లోకి వస్తాయి.
మరి రెండు మూడు రాష్ట్రాలకు సంబంధిస్తే?
కొన్ని వస్తువులు లేదా సేవలు... ముడిసరుకు కొనేది ఒక రాష్ట్రంలో, తయారీ మరో రాష్ట్రంలో, డెలివరీ మరో రాష్ట్రంలో జరుగుతాయి. ఇలా ఒకటికన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య జరిగే లావాదేవీలపై ప్రస్తుతం సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కింద పన్ను వేస్తున్నారు. ఈ సీఎస్‌టీ కింద ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు అవకాశం లేదు. దీనిస్థానంలో ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీని తెస్తున్నారు. దీన్లో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కూ అవకాశముంటుందన్న మాట. ప్రస్తుతం సీఎస్‌టీ కింద వసూలు చేసిన పన్నుల మొత్తాన్ని రాష్ట్రాలే ఉంచుకుంటున్నాయి. కానీ ఐజీఎస్‌టీ వస్తే వసూళ్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఖాతాలోకి వెళతాయి.
నిజంగా ధరలు తగ్గుతాయా?
దేశంలో దశాబ్దానికి పైగా మనం వ్యాట్‌ను చూస్తూనే ఉన్నాం. దీన్ని ప్రవేశపెట్టేటపుడు రాష్ట్రాలన్నీ ‘‘అన్నిదశల్లోనూ భారం పడే పరిస్థితి పోయి ధరలు దిగి వస్తాయి’’ అని చెప్పాయి. మరి వ్యాట్‌తో ధరలు నిజంగా తగ్గాయా? లేదా? అనేది మనకు తెలియనిది కాదు. ఇప్పుడు జీఎస్‌టీ విషయంలోనూ అలాగే చెబుతున్నారు. ఇది అమల్లోకి వస్తే ధరలు తగ్గిపోతాయని పలువురు చెబుతున్నారు. మరి వీటిని నమ్మేదెలా? వ్యాట్ వల్ల ఫలానా ధరలు తగ్గాయని ప్రభుత్వం అంకెలతో సహా నిరూపిస్తే కదా!! 2005లో వ్యాట్ తెచ్చేటపుడు బియ్యం, గోధుమలు, వంటనూనెల వంటి నిత్యావసర సరుకుల ధరలెలా ఉన్నాయి? 2006 నుంచి వ్యాట్‌ను అమలు చేశాక వీటి హెచ్చుతగ్గులెలా ఉన్నాయి? అనేది గనక ప్రభుత్వం అంకెలతో సహా వివరిస్తే... ఇపుడు జీఎస్‌టీతో ధరలు దిగొస్తాయన్న హామీల్ని జనం విశ్వసించే వీలుండేది.
వ్యాట్ - జీఎస్‌టీ ఒకటేనా?
వాస్తవ పరిస్థితుల్ని బట్టి చూస్తే వ్యాట్, జీఎస్‌టీల నియమాలు పరస్పర విరుద్ధమే. నిజం చెప్పాలంటే వ్యాట్, జీఎస్‌టీల వల్ల పలు ప్రయోజనాలుంటాయి. దాన్లో రెండో అభిప్రాయానికే తావులేదు. కాకపోతే... ఇదంతా వ్యవస్థ బాగుంటేనే. అంటే... విస్తృతమైన పరిధితో పాటు ఒకే పన్నురేటు, కనీస స్థాయిలో మినహాయింపులు, ఎక్కువ ఆదాయం ఉన్నవారిని మాత్రమే దీన్లోకి తీసుకురావటం, పన్ను చెల్లించాల్సిన వ్యక్తి తాలూకు అర్థాన్ని విసృ్తతం చేయటం, జీరో రేటు వస్తువుల్ని కనీస స్థాయికి తేవటం... ఇవన్నీ ఆ వ్యవస్థలో భాగమై ఉండాలి. నిపుణులు చెప్పేదేంటంటే... ఒకే పన్ను రేటన్నది ఆదర్శనీయం. రెండుంటే పర్వాలేదు. కానీ అంతకు మించితే నాశనమేనని. నిజానికి ప్రయోజనాలొచ్చేది ఆదర్శనీయమైన వ్యవస్థతోనే. మరి మనది ఆదర్శనీయమేనా? కాలమే చెప్పాలి.
మినహాయింపులు చాలానే ఉన్నాయి...
►ప్రతిపాదిత జీఎస్‌టీలో లిక్కర్, పెట్రోలియం ఉత్పత్తుల్ని మినహాయిం చారు. అంటే వీటిపై ప్రస్తుత చట్టాల ప్రకారమే పన్నులు వేస్తారన్న మాట. గణాంకాలను బట్టి చూస్తే... రాష్ట్రాల సొంత పన్ను ఆదాయంలో దాదాపు 50 శాతం ఈ రెండిటి నుంచే వస్తోంది. దీనర్థం... రాష్ట్రాల ఆదాయంలో 50 శాతం వరకూ జీఎస్‌టీ పరిధిలో ఉండదన్న మాట.
► ఇక ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అనుమతించని నెగెటివ్ లిస్ట్‌ను బట్టి చూస్తే... దాదాపు 10 శాతం రెవెన్యూకు మాత్రమే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తిస్తుంది.
► సీజీఎస్‌టీ క్రెడిట్‌ను సీజీఎస్‌టీ ఔట్‌పుట్ ట్యాక్స్ ద్వారా మాత్రమే సెట్ ఆఫ్ చేసుకోవాలి. ప్రస్తుత మూడు పన్ను చట్టాలూ కలిసి ఒకే చట్టంగా మారినా సరే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను సీజీఎస్‌టీ- ఎస్‌జీఎస్‌టీల్లో ఒకదానితో మరొకటి సెట్ ఆఫ్ చేసుకోవటం కుదరదు. దాంతో ధరల భారం ప్రస్తుతం మాదిరిగానే ఉండొచ్చు.
►పస్తుతం ఉన్న సంకేతాల ప్రకారం జీఎస్‌టీ రెవెన్యూ న్యూట్రల్ రేటు (ఆర్‌ఎన్‌ఆర్) 18 శాతంగా ఉండొచ్చు. అయితే పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే ఆర్‌ఎన్‌ఆర్ 27 శాతంగా ఉండొచ్చనేది మరో అభిప్రాయం. ఆర్‌ఎన్‌ఆర్ అంటే... దీని అమలు వల్ల ప్రభుత్వానికి ఎలాంటి రాబడి నష్టం రాకుండా ఉండే రేటు.
ధరలు, వినియోగదారులపై చర్చ ఏదీ?
జీఎస్‌టీపై చర్చంతా రాష్ట్రాలు తమ ఆదాయాన్ని కోల్పోతామనే ఆందోళనల చుట్టూనే నడిచింది. ధరలు తగ్గుతాయని జనాంతికంగా చెప్పేశారు తప్ప దీనివల్ల ధరలెలా ప్రభావితమవుతాయి? వినియోగదారుడు దీన్ని భరించగలడా? వంటి అంశాలు చర్చకు నోచుకోలేదు. దురదృష్టవశాత్తూ వ్యాట్ అమలు చేయటంతో వచ్చిన లాభనష్టాల్ని గానీ, ధరలపై దాన్ని ప్రభావాన్ని గానీ అధ్యయనం చేయటం, అంకెలతో సహా వివరించటం వంటివేమీ జరగలేదు.
వ్యాట్ మాదిరే... దశలవారీ పన్ను
2005 వరకూ అమల్లో ఉన్న జనరల్ సేల్స్ ట్యాక్స్ వ్యవస్థలో పన్ను విధింపు ఒకే చోట జరిగేది. ఉదాహరణకు ఒక రైస్ మిల్లరు క్వింటాలు బియ్యాన్ని రూ.1,000కి విక్రయించాడనుకుందాం. 4 శాతం చొప్పున రూ.40 పన్ను చెల్లించేవాడు. ఇక ఆ తరవాత సేల్స్ ట్యాక్స్‌లేవీ ఉండేవి కాదు. వ్యాట్‌లో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం వివిధ దశల్లో పన్ను విధిస్తున్నారు. పై ఉదాహరణనే చూస్తే... రైస్ మిల్లరు రూ.40 పన్ను చెల్లించి హోల్‌సేల్ డీలరుకు దాన్ని విక్రయిస్తాడు. డీలరు దానికి రూ.100 మేర విలువను జోడించి 1,100కు రిటైలర్‌కు విక్రయిస్తాడు. తను జోడించిన విలువ రూ.100పై 4 శాతం... అంటే రూ.4 పన్ను చెల్లిస్తాడు. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌గా మిల్లరు చెల్లించిన రూ.40ని మినహాయిస్తాడు. ఇక రిటైలర్ దానికి రూ.200 జోడించి రూ.1,300కు విక్రయిస్తాడు. తను జోడించిన రూ.200పై 4 శాతం అంటే... రూ.8 పన్ను చెల్లిస్తాడు. అంతకుముందే చెల్లించిన రూ.44ను ఐటీసీగా మినహాయిస్తాడు. అంటే జనరల్ సేల్స్ ట్యాక్స్‌లో పన్ను రూ.40 కాగా... ఇక్కడ వివిధ దశల్లో కలిపి రూ.52 అయిందన్న మాట. రేపు జీఎస్‌టీ అమల్లోకి వచ్చినా ఇంతే. వివిధ దశల్లో పన్ను చెల్లించాల్సిందే.
పన్నుల వల్లేనా ధరల్లో హెచ్చుతగ్గులు?
పన్ను వల్ల కాకపోయినా... రకరకాల కారణాల వల్ల వస్తువుల ధరలు మారుతుంటాయి. ఉదాహరణకు కొన్ని సమయాల్లో కూరగాయల ధరలు అసాధారణంగా పెరుగుతాయి. మరి వాటిపై పన్ను లేదుకదా!! పన్నుల వల్ల పెరిగాయని చెప్పగలమా? కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం పన్ను రేటు తగ్గించినా వస్తువుల ధరలు మాత్రం తగ్గవు. ఇక ప్రభుత్వం మరీ పన్ను పెంచేసిన సందర్భాల్లో ఆయా వస్తువుల్ని పుస్తకాల్లో చూపకుండానే అమ్మేస్తుంటారు. అంటే పన్ను ఎగవేయటమన్న మాట. ఇదంతా ఎందుకంటే... ఏదో ఒక పన్ను వ్యవస్థ కారణంగా ధరలు దిగివస్తాయనే వాదనను చాలామంది ఆమోదించరు. ఆర్థికశాస్త్రంలో ఒకటుంది!!. అంచనాలు నిజం కావాలంటే మిగతా అంశాలన్నీ మారకూడదని. ఒకవేళ ధరలు పెరిగితే... ‘‘వివిధ స్థానిక కారణాల వల్ల ఆదర్శనీయ వ్యవస్థను అమలు చేయలేకపోతున్నాం. అందుకే ఈ పెరుగుదల’’ అని సాకులు వెతికే అవకాశాలెటూ ఉన్నాయి.
సంబంధీకుల సంగతేంటి?
జీఎస్‌టీ వ్యవస్థలో ప్రధాన భాగం ప్రభుత్వాలు, పన్ను చెల్లింపుదారులు, వినియోగదారులదే. అయితే ధరలు తగ్గుతాయనే ఓ హామీ తప్ప వినియోగదారుల గురించి పెద్దగా చర్చ జరిగినట్లు మనం వినలేదు. వ్యాట్ తరవాత ధరలెందుకు తగ్గలేదనేది వివరించలేదు కూడా. బహుశా.. మన వినియోగదారుల్లో బలమైన చైతన్యం లేకపోవటమూ దీనికొక కారణం కావచ్చు. ప్రభుత్వానికి ఆర్‌ఎన్‌ఆర్ ఎలాగో... సామాన్యుడికీ చెల్లించే స్తోమత సూచీ (పీసీఐ) ఉంటుంది. అది దాటితే తను వెచ్చించలేడన్నది తిరుగులేని వాస్తవం. వ్యాట్, జీఎస్‌టీ వంటి పన్ను వ్యవస్థలు సామాన్యుడికి అర్థం కాకపోవచ్చు. తనకు కావాల్సిందల్లా కనీసం నిత్యావసర వస్తువులైనా తనకు అందుబాటులో ఉండాలి. దీన్నంతటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జీఎస్‌టీ రేటును నిర్ణయిస్తుందని... దానివల్ల ధరలు తగ్గుతాయని ఆశిద్దాం. ‘‘ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నీకు తారసపడిన నిరుపేద, నిర్భాగ్యుడిని దృష్టిలో పెట్టుకో. నీ నిర్ణయం తనకేమైనా పనికొస్తుందేమో చూడు’’ అనే మహాత్మగాంధీ మాటలు మనమెన్నడూ మరిచిపోనివే.!!
(వ్యాసకర్త: పీవీ సుబ్బారావు, మొబైల్: 9391018552)