కేంద్రమంత్రులు కొందరు ‘ఫిట్‌నెస్ చాలెంజ్’ కార్యక్రమంలో తలమునకలై ఉండగా పలు రాష్ట్రాలు నాలుగు రోజులుగా రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. ఆగ్రహంతో ఊగి పోతున్న రైతులు రోడ్లపై కాయగూరలు, పాలు పారబోస్తున్న ఉదంతాలు చానెళ్లలో చూస్తుంటే ఎలాంటివారికైనా మనసుకు కష్టం కలగక మానదు. ఆ ఉత్పత్తులన్నీ వారు ఎండనకా, వాననకా రాత్రింబగళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని, దొరికినచోటల్లా అప్పులు చేసి పండించినవి. రైతాంగ ఉద్యమం కారణంగా కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. మార్కెట్‌లో 2 లక్షల లీటర్ల మేర పాల కొరత ఏర్పడిందని డెయిరీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నగరాలకు కూరగాయలు, పాలు ఆగిపోయాయి. ఈ ఆందోళన చివరి రోజైన జూన్ 10న ‘భారత్ బంద్’ కూడా జరపబోతున్నారు. ఈ స్ఫూర్తితో దేశంలోని ఇతరచోట్ల కూడా రైతాంగ ఉద్యమాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు.
రైతులేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, కనీస ఆదాయ హామీ పథకం అమలు చేయాలని, ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు అధికారం చలాయిస్తున్న పార్టీలు ఎన్నికల సమయంలో వాగ్దానాలిచ్చినవే. సాగు యోగ్యమైన భూ విస్తీర్ణంలో ప్రపంచంలో అమెరికాది తొలి స్థానం కాగా, మన దేశానిది రెండో స్థానం. కానీ మన వ్యవసాయ భూముల్లో కేవలం 35 శాతానికి మాత్రమే నీటిపారుదల సదుపాయం ఉంది. మిగిలిందంతా వర్షాధారం. 2 లక్షల కోట్ల డాలర్ల దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా 15 శాతం. దేశంలో దాదాపు 70 శాతంమంది దానిపై ఆధారపడి బతుకుతున్నారు. ఇంతటి కీలకమైన రంగం మన పాలకులకు పట్టడం లేదు. అలాగని వారికి రైతు సమస్యలు తెలియవని చెప్పలేం.
ఎన్నికల సమయంలో రైతులకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పడం ఎప్పటినుంచో వింటున్నదే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన పార్టీలు అధికారంలో కొచ్చాయి. ఇక కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ 2014 తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. పంజాబ్‌లో కాంగ్రెస్ కూడా రుణమాఫీ వాగ్దానం చేసి అధికారంలోకొచ్చింది. రుణమాఫీ చేశామని కొన్ని రాష్ట్రాలూ, ఆ ప్రక్రియ కొనసాగుతున్నదని మరికొన్ని రాష్ట్రాలూ చెబుతున్నాయి. మరి రైతుల్లో ఇంత అసంతృప్తి ఎందుకున్నట్టు? వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నట్టు? జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం ఏటా దాదాపు 6,000మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు తమ విధానాలు సక్రమంగా లేవని, అవి సమస్య మూలాలను తాకడం లేదని పాలకులకు అర్ధమై ఉంటే వేరుగా ఉండేది. కానీ ఎవరూ ఈ దిశగా ఆలోచిస్తున్న దాఖలా లేదు.
సామాన్య పౌరులు బియ్యం కొనాలంటే కిలోకు దాదాపు రూ. 50 వెచ్చించాల్సి ఉంటుంది. కానీ వరి ధాన్యానికి నిరుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వంద కిలోల బస్తా రూ. 1,550. ఈ ధరకు కొనేవారు కూడా దొరక్క చాలామంది రైతులు ఇంతకన్నా తక్కువకే అమ్ముకున్నారు. రైతు అమ్మినప్పుడు కనీస ధర రాని దిగుబడులు వ్యాపారుల దగ్గరకెళ్లేసరికి ఒక్కసారిగా విజృం భిస్తాయి. ఏటా ఇదే తంతు నడుస్తున్నా ప్రభుత్వాలకు పట్టదు. రుణమాఫీ వంటి పథకాలు ఎంత బాగా అమలవుతున్నాయన్నది పక్కనబెడితే అమలైన మేరకైనా నిజమైన రైతుకు చేరడం లేదు. మన దేశంలో వ్యవసాయంలో అధిక భాగం కౌలు రైతుల చేతులమీదుగానే నడుస్తోంది. కానీ ప్రభుత్వ పథకాలేవీ వారిని గుర్తించవు. ఫలితంగా నిజంగా వ్యవసాయం చేస్తూ తీవ్ర నష్టాలు చవిచూస్తున్న రైతులు దిక్కూ మోక్కూలేని స్థితిలో ఉండిపోతున్నారు.
ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో సాగుతున్న రైతు ఉద్యమానికి ఈ నేపథ్యం ఉంది. తాము అప్పులు ఊబిలో కూరుకుపోతున్నా పట్టించుకోని పాలకులపై రైతుల్లో అసహనం అంతకంతకు పెరుగుతున్నదని ఈ ఉద్యమం నిరూపిస్తోంది. అదృష్టవశాత్తూ ఇంతవరకూ ఇది కట్టుతప్పలేదు. నిరుడు ఇదే రోజుల్లో ఉత్తరాదిన పెల్లుబికిన రైతుల ఆందోళన గుర్తుకు తెచ్చుకోవాలి. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో జిల్లా కలెక్టర్, ఎస్‌పీ సహా పలువురు ఉన్నతాధికారులపై దాడులు చేసి కొట్టడం, కర్ఫ్యూ ధిక్కరించి రాస్తారోకోలకు దిగడం, వాహనాలను ధ్వంసం చేయడం, చివరకు పోలీసు కాల్పుల్లో 8మంది మరణించడం వంటి ఉదంతాలు మరిచిపోకూడదు. కానీ ఇతర రాష్ట్రాల సంగతలా ఉంచి మధ్యప్రదేశ్ ప్రభుత్వమైనా రైతు సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలా కనబడదు. ఆ రాష్ట్రంలో కూడా సాగుతున్న రైతు ఉద్యమాలే అందుకు రుజువు.
దళారులు, గుత్త వ్యాపారుల హవా నడిచే హోల్‌సేల్ మార్కెట్ల స్థానంలో ప్రధాన మార్కెట్లతో అనుసంధానించే ఎలక్ట్రానిక్ ఆధారిత ఈ–మండీలు ప్రారంభిస్తామని రెండేళ్లక్రితం కేంద్రం ప్రకటించింది. అది అమల్లోకొచ్చి కూడా ఏడాది దాటుతోంది. కానీ అవి నామమాత్రంగా మిగిలాయని, యథాప్రకారం దళారులదే పైచేయి అవుతున్నదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒకప్పుడు హరిత విప్లవం పేరుతో వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వాలే ఇప్పుడు అంతకన్నా అధికాదాయం లభిస్తున్న సేవల రంగానికి, తయారీరంగానికి మళ్లాయి. వ్యవసా యాన్ని గాలికొదిలేశాయి. కనుకనే రైతుల వెతలు తీరడం లేదు. రైతులు కోరుతున్నట్టు స్వామి నాథన్ కమిటీ సిఫార్సులు సక్రమంగా అమలు చేసి, ఎక్కడికక్కడ కోల్డ్ స్టోరేజీలు నిర్మించి, దళా రుల్ని, గుత్త వ్యాపారుల్ని అరికట్టినప్పుడే రైతులు కష్టాలనుంచి గట్టెక్కుతారు. ఆ దిశగా ప్రభు త్వాలు చర్యలు ప్రారంభించాలి.
Comments
Please login to add a commentAdd a comment