minimum supporting price
-
వరికి మద్దతు ధర రూ. 72.. అత్యధికంగా నువ్వులపై 452 పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: వరికి మద్దతు ధరను రూ.72 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2021–22 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి వివిధ పంటల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) పెంపు ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఈ కమిటీ సమావేశమైంది. వరి ధాన్యం కామన్ గ్రేడ్ ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1,868 ఉండగా రూ.72 పెంచుతూ... రూ. 1,940గా నిర్ధారించింది. ఈ ధాన్యం ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ. 1,293గా అంచనా వేసింది. వరి ధాన్యం గ్రేడ్ ఏ రకం ప్రస్తుతం క్వింటాల్‌కు రూ. 1,888 ఉండగా రూ.72 పెంచుతూ రూ.1,960గా ఖరారు చేసింది. రైతులకు సహేతుకంగా, న్యాయమైన రీతిలో గిట్టుబాటు ధర లభించేలా 2018–19 కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు ఉండేలా కనీస మద్దతు ధరను నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ లెక్కన అత్యధికంగా సజ్జలకు పెట్టుబడిపై 85 శాతం, మినుములకు 65 శాతం, కందులకు 62 శాతం ప్రతిఫలం దక్కుతుందని పేర్కొంది. ఈ సీజన్లో పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పప్పు గింజల్లో అత్యధిక ఉత్పాదకత ఉన్న రకాల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. ఈసారి ఖరీఫ్ సీజన్లో అదనంగా 6.37 లక్షల హెక్టార్లలో నూనె గింజల సాగుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపింది. కనీస మద్దతు ధర పెంపుతో రైతుల ఆదాయం పెరగడంతోపాటు వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మెరుగవనున్న రైల్వేల కమ్యూనికేషన్, సిగ్నలింగ్ రైల్వేల కమ్యూనికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థలను మరింత ఆధునీకరించేందుకు 700 మెగా హెడ్జెస్ బ్యాండ్‌లో 5 మెగా హెడ్జెస్ స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. స్పెక్ట్రమ్ పెరగడంతో రైల్వే ప్రయాణికుల భద్రత మరింత పెరగడంతోపాటు రైల్వేల రవాణా నెట్వర్క్ నవీకరణ సుసాధ్యం కానుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.లాంగ్–టర్మ్–ఎవల్యూషన్(ఎల్టీఈ) ఆధారిత మొబైల్ ట్రెయిన్ కమ్యూనికేషన్‌ను ఆయా రూట్లలో రైల్వే ఉపయోగించుకోనుంది. దీనికి సంబంధించిన రూ.25 వేల కోట్ల ప్రాజెక్టును వచ్చే ఐదేళ్లలో పూర్తిచేయనున్నారు. పంట ఎమ్మెస్పీ (రూ.) పెంపు(రూ.) వరి(కామన్) 1,940 72 వరి (ఏ) 1,960 72 జొన్న(హైబ్రిడ్) 2,738 118 జొన్న(మల్దండి) 2,758 118 సజ్జలు 2,250 100 రాగి 3,377 100 మొక్కజొన్న 1,870 20 కందులు 6,300 300 పెసర 7,275 79 మినుములు 6,300 300 వేరుశనగ 5,550 275 పొద్దుతిరుగుడు 6,015 130 నువ్వులు 7,307 452 ఒడిసలు(నైగర్‌సీడ్) 6,930 235 పత్తి (మీడియం స్టేపుల్) 5,726 211 పత్తి(లాంగ్ స్టేపుల్) 6,025 200 -
కనీస మద్దతు ధర ఒక భ్రమ
రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెండింతలు చేయాలని నిర్ణయించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు. దేశంలోని ఎక్కువమంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. వారిలో చాలామంది వ్యవసాయాధారిత పనులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామీణుల జీవన ప్రమాణాలను పెంచకుండా మనం నిజమైన అభివృద్ధిని, ప్రగతిని సాధించినట్టు కాదు. ఈ నేపథ్యంలో రైతుల ఆదాయాన్ని రానున్న మూడేళ్లలో రెట్టింపు చేయాలని నిర్ణయించడం ప్రశంసనీయం. రైతులను ఆదుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కనీస మద్దతు ధరలను ప్రకటిస్తున్నాయి. మార్కెట్ ధరలు కనీస మద్దతు ధరల కంటే దిగువకు పడిపోయినప్పుడు ఆ పంటలను ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. అయితే, కనీస మద్దతు ధర అనేది ఒక భ్రమ అని నేను గట్టిగా చెప్పదల్చుకున్నా. మన రైతులు వందలాది పంటలు పండిస్తుండగా కనీస మద్దతు ధరను 23 పంటలకు మాత్రమే అందిస్తున్నారు. ఇది గిట్టుబాటు ధర మాత్రం కాదు. జరిగిన నష్టాన్ని పూరించేది కాదు. పైగా.. వరి, గోధుమలకు తప్ప వేరే వాటికి మద్దతు ధర అందించడానికి ఎటువంటి వ్యవస్థా లేదు. కనీస మద్దతు ధర గురించీ, ప్రభుత్వం ఆ పద్ధతిలో పంటలు సేకరించే విధానం గురించీ చాలా మంది రైతులకు అవగాహన లేదు. ఫలితంగా రైతులు తమ పంటలను ఏజెంట్ల ద్వారా స్థానిక మిల్లర్లకు కనీస మద్దతు ధరకంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలు వరి, పత్తి పంటలను రైతుల నుంచి నేరుగా సేకరించకుండా, మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ధాన్యం సేకరణ విధానాన్ని పరిశీలించాను. అక్కడ ఖరీఫ్‌లో వరి కోత కోయడం, నూర్పడం యంత్రాలతోనే చేస్తున్నారు. అంతేకాదు, ఆ ధాన్యాన్ని బస్తాలకు కూడా ఎత్తకుండా ట్రాక్టర్లలో ఇసుక తీసుకొచ్చినట్టు తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో గుమ్మరిస్తారు. అటువంటి కేంద్రాలు ప్రతి ఐదారు కిలోమీటర్లకు ఒకటి ఉంటుంది. వాటిలో భారత ఆహార సంస్థతోపాటు రాష్ట్ర, ఆహార శాఖ, వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల కార్పొరేషన్, ఆగ్రో ఇండస్ట్రీస్, రాష్ట్ర వాణిజ్య సంస్థ వంటి విభాగాలన్నీ పోటీపడి ధాన్యం కొనుగోలు చేస్తారు. దాంతో అక్కడి ప్రైవేట్ మిల్లర్లకు ఆయా కొనుగోలు కేంద్రాల నుంచి 5 శాతం సరుకు కూడా చిక్కదు. ఖరీఫ్‌లో వరి కోతలయ్యాక మూడు, నాలుగు వారాల్లో రాష్ట్రంలో ఒక్క వడ్ల గింజ కూడా మిగలదు. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొన్న సరుకు తూకం వేసి బియ్యం మిల్లులకు రవాణా చేయడం, అందుకు అవసరమైన గిడ్డంగులు, నార సంచులు, పురికొసలు వంటివి పోగు చేసుకుని, రవాణా సౌకర్యాలు సిద్ధం చేసుకుని మరపట్టిన బియ్యాన్ని భారత ఆహార సంస్థకు అందించడం అతి పెద్ద రైతాంగ సంక్షేమ కార్యక్రమం. చట్ట ప్రకారం రైతుల నుండి నేరుగా ధాన్యం కొనుగోలు చేయవలసిన బాధ్యత భారత ఆహార సంస్థదే అయినా, దాన్ని ఆ సంస్థే నీరుగారుస్తోంది. మన రాష్ట్రంలో రైతులు ఎవరైనా ధాన్యాన్ని అమ్మాలనుకుంటే కుంటిసాకులతో దానిని తిరస్కరించడమే కాదు, కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలంటేనే రైతాంగం బెదిరిపోయే వాతావరణం నెలకొని ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సప్లయిస్ శాఖ వారు కూడా బియ్యం మిల్లులవారి సేవలోనే పునీతమవుతున్నారు. దీంతో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మిల్లర్ సపోర్ట్ ప్రైస్‌గా మారిపోయింది. దేశంలోని అన్ని పంటలకు వ్యవసాయ ధరల కమిషన్ ఒకే విధమైన కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ఉత్పత్తి ఖర్చుల డేటాపైనే కమిషన్ ఆధారపడుతుంది. పంటలను సేకరించే సందర్భంలో కనీస మద్దతు ధరకు, ఉత్పత్తి ధరకు మధ్య నుండే వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉంది. వాస్తవమైన ఉత్పత్తి ధరను నిర్ణయించడానికి రాష్ట్రాల స్థాయిలో వ్యవసాయ ధరల కమిషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. కనీస మద్దతు ధరలను వాస్తవికంగా నిర్ణయించి అమలు చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం చేరుకుంటుందని ఆశిస్తున్నా. (బడ్జెట్‌కు ముందు చర్చల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పంపిన ఆహ్వానానికి స్పందిస్తూ రచయిత పంపిన నోట్స్ సారాంశం) యలమంచిలి శివాజీ వ్యాసకర్త గౌరవాధ్యక్షుడు, కిసాన్ ఫౌండేషన్ ‘ 98663 7673 -
అది రైతుల హక్కుగా చట్టం చేయాలి
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరలపై మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి సిటుతో పాటు యాభై శాతం కలిపి ఇస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పంటల మద్దతు ధర రైతుల హక్కుగా పార్లమెంట్ లో చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించిన ధరల్లో ఒక్క సజ్జకు మాత్రమే సిట్ ప్రకారం న్యాయం జరిగిందని అన్నారు. ధాన్యానికి ప్రకటించిన రెండు వందలు కూడా తక్కువే అని మండిపడ్డారు. శాస్త్రీయంగా పెరగాల్సిన వాటికి ఐదు వందల రూపాయలు తక్కువగా ప్రకటించారని ధ్వజమెత్తారు. పప్పుధాన్యాలలో పెసరకు మినహా ఇతర పంటలకు తక్కువ మద్దతు ధరనే ప్రకటించారని మండిపడ్డారు. కందులు, మినుములకు కేటాయించిన ధరలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. ఆయిల్ సీడ్ పంటలకు సరైన విధంగా ధర పెంచే విధంగా కేంద్రం ఇప్పటికైన సరైన ఆలోచన చేయకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం సగటు కుటుంబ ఆదాయం రూ. 18 వేలు ఉండాలని, కానీ రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ. 6630 మాత్రమేనని తెలిపారు. తక్షణమే స్వామినాథన్ కమీషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర కన్నా రైతులు తక్కువకు అమ్ముకుంటే... రెండిటి మధ్య తేడాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని కోరారు. -
అన్నదాత ఆగ్రహం
కేంద్రమంత్రులు కొందరు ‘ఫిట్నెస్ చాలెంజ్’ కార్యక్రమంలో తలమునకలై ఉండగా పలు రాష్ట్రాలు నాలుగు రోజులుగా రైతుల ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. ఆగ్రహంతో ఊగి పోతున్న రైతులు రోడ్లపై కాయగూరలు, పాలు పారబోస్తున్న ఉదంతాలు చానెళ్లలో చూస్తుంటే ఎలాంటివారికైనా మనసుకు కష్టం కలగక మానదు. ఆ ఉత్పత్తులన్నీ వారు ఎండనకా, వాననకా రాత్రింబగళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని, దొరికినచోటల్లా అప్పులు చేసి పండించినవి. రైతాంగ ఉద్యమం కారణంగా కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. మార్కెట్లో 2 లక్షల లీటర్ల మేర పాల కొరత ఏర్పడిందని డెయిరీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నగరాలకు కూరగాయలు, పాలు ఆగిపోయాయి. ఈ ఆందోళన చివరి రోజైన జూన్ 10న ‘భారత్ బంద్’ కూడా జరపబోతున్నారు. ఈ స్ఫూర్తితో దేశంలోని ఇతరచోట్ల కూడా రైతాంగ ఉద్యమాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. రైతులేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, కనీస ఆదాయ హామీ పథకం అమలు చేయాలని, ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు అధికారం చలాయిస్తున్న పార్టీలు ఎన్నికల సమయంలో వాగ్దానాలిచ్చినవే. సాగు యోగ్యమైన భూ విస్తీర్ణంలో ప్రపంచంలో అమెరికాది తొలి స్థానం కాగా, మన దేశానిది రెండో స్థానం. కానీ మన వ్యవసాయ భూముల్లో కేవలం 35 శాతానికి మాత్రమే నీటిపారుదల సదుపాయం ఉంది. మిగిలిందంతా వర్షాధారం. 2 లక్షల కోట్ల డాలర్ల దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా 15 శాతం. దేశంలో దాదాపు 70 శాతంమంది దానిపై ఆధారపడి బతుకుతున్నారు. ఇంతటి కీలకమైన రంగం మన పాలకులకు పట్టడం లేదు. అలాగని వారికి రైతు సమస్యలు తెలియవని చెప్పలేం. ఎన్నికల సమయంలో రైతులకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పడం ఎప్పటినుంచో వింటున్నదే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన పార్టీలు అధికారంలో కొచ్చాయి. ఇక కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ 2014 తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. పంజాబ్‌లో కాంగ్రెస్ కూడా రుణమాఫీ వాగ్దానం చేసి అధికారంలోకొచ్చింది. రుణమాఫీ చేశామని కొన్ని రాష్ట్రాలూ, ఆ ప్రక్రియ కొనసాగుతున్నదని మరికొన్ని రాష్ట్రాలూ చెబుతున్నాయి. మరి రైతుల్లో ఇంత అసంతృప్తి ఎందుకున్నట్టు? వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నట్టు? జాతీయ క్రైం రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం ఏటా దాదాపు 6,000మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు తమ విధానాలు సక్రమంగా లేవని, అవి సమస్య మూలాలను తాకడం లేదని పాలకులకు అర్ధమై ఉంటే వేరుగా ఉండేది. కానీ ఎవరూ ఈ దిశగా ఆలోచిస్తున్న దాఖలా లేదు. సామాన్య పౌరులు బియ్యం కొనాలంటే కిలోకు దాదాపు రూ. 50 వెచ్చించాల్సి ఉంటుంది. కానీ వరి ధాన్యానికి నిరుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వంద కిలోల బస్తా రూ. 1,550. ఈ ధరకు కొనేవారు కూడా దొరక్క చాలామంది రైతులు ఇంతకన్నా తక్కువకే అమ్ముకున్నారు. రైతు అమ్మినప్పుడు కనీస ధర రాని దిగుబడులు వ్యాపారుల దగ్గరకెళ్లేసరికి ఒక్కసారిగా విజృం భిస్తాయి. ఏటా ఇదే తంతు నడుస్తున్నా ప్రభుత్వాలకు పట్టదు. రుణమాఫీ వంటి పథకాలు ఎంత బాగా అమలవుతున్నాయన్నది పక్కనబెడితే అమలైన మేరకైనా నిజమైన రైతుకు చేరడం లేదు. మన దేశంలో వ్యవసాయంలో అధిక భాగం కౌలు రైతుల చేతులమీదుగానే నడుస్తోంది. కానీ ప్రభుత్వ పథకాలేవీ వారిని గుర్తించవు. ఫలితంగా నిజంగా వ్యవసాయం చేస్తూ తీవ్ర నష్టాలు చవిచూస్తున్న రైతులు దిక్కూ మోక్కూలేని స్థితిలో ఉండిపోతున్నారు. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో సాగుతున్న రైతు ఉద్యమానికి ఈ నేపథ్యం ఉంది. తాము అప్పులు ఊబిలో కూరుకుపోతున్నా పట్టించుకోని పాలకులపై రైతుల్లో అసహనం అంతకంతకు పెరుగుతున్నదని ఈ ఉద్యమం నిరూపిస్తోంది. అదృష్టవశాత్తూ ఇంతవరకూ ఇది కట్టుతప్పలేదు. నిరుడు ఇదే రోజుల్లో ఉత్తరాదిన పెల్లుబికిన రైతుల ఆందోళన గుర్తుకు తెచ్చుకోవాలి. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులపై దాడులు చేసి కొట్టడం, కర్ఫ్యూ ధిక్కరించి రాస్తారోకోలకు దిగడం, వాహనాలను ధ్వంసం చేయడం, చివరకు పోలీసు కాల్పుల్లో 8మంది మరణించడం వంటి ఉదంతాలు మరిచిపోకూడదు. కానీ ఇతర రాష్ట్రాల సంగతలా ఉంచి మధ్యప్రదేశ్ ప్రభుత్వమైనా రైతు సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలా కనబడదు. ఆ రాష్ట్రంలో కూడా సాగుతున్న రైతు ఉద్యమాలే అందుకు రుజువు. దళారులు, గుత్త వ్యాపారుల హవా నడిచే హోల్‌సేల్ మార్కెట్ల స్థానంలో ప్రధాన మార్కెట్లతో అనుసంధానించే ఎలక్ట్రానిక్ ఆధారిత ఈ–మండీలు ప్రారంభిస్తామని రెండేళ్లక్రితం కేంద్రం ప్రకటించింది. అది అమల్లోకొచ్చి కూడా ఏడాది దాటుతోంది. కానీ అవి నామమాత్రంగా మిగిలాయని, యథాప్రకారం దళారులదే పైచేయి అవుతున్నదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒకప్పుడు హరిత విప్లవం పేరుతో వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వాలే ఇప్పుడు అంతకన్నా అధికాదాయం లభిస్తున్న సేవల రంగానికి, తయారీరంగానికి మళ్లాయి. వ్యవసా యాన్ని గాలికొదిలేశాయి. కనుకనే రైతుల వెతలు తీరడం లేదు. రైతులు కోరుతున్నట్టు స్వామి నాథన్ కమిటీ సిఫార్సులు సక్రమంగా అమలు చేసి, ఎక్కడికక్కడ కోల్డ్ స్టోరేజీలు నిర్మించి, దళా రుల్ని, గుత్త వ్యాపారుల్ని అరికట్టినప్పుడే రైతులు కష్టాలనుంచి గట్టెక్కుతారు. ఆ దిశగా ప్రభు త్వాలు చర్యలు ప్రారంభించాలి. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఖమ్మం: పండిన పంటకు గిట్టుబాటు ధర లేక...అప్పు తీర్చే మార్గం కానరాక ఆ రైతు పంట చేలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు...ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బాలప్పేట గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలివీ... గ్రామానికి చెందిన పాలెపు పుల్లారావు (40) తనకున్న ఎకరం పొలంలో మిర్చి సాగు చేశాడు. ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. పత్తి ఈ ఏడాది అంతంతమాత్రంగానే ఉంది. ధర కూడా తక్కువగానే ఉంది. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడులు, కౌలు చెల్లింపు కోసం తీసుకొచ్చిన అప్పులు రూ.5 లక్షలకు చేరుకున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు శనివారం రాత్రి మిరపతోటలో పురుగుమందు తాగి తనువు చాలించాడు. (తల్లాడ) -
మద్దతేది మహాప్రభో..!
సాక్షి, నెట్వర్క్: ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన అన్నదాతకు చివరకు కన్నీరే మిగులుతోంది.. తీవ్ర వర్షాభావం, కరెంటు కోతలతో దిగుబడీ తగ్గి ఆవేదనలో ఉన్న రైతన్నకు... ఇప్పుడు ప్రభుత్వ ‘మద్దతూ’ కరువవుతోంది.. ఇదే అదనుగా వ్యాపారుల మార్కెట్ మాయాజాలం రైతులను నిలువునా దోచుకుంటోంది.. పంట విస్తీర్ణం తగ్గితే ధరలు పెరగాల్సింది పోయి మరింతగా తగ్గడం వారి అడ్డగోలుతనాన్ని పట్టిచూపుతోంది. కొద్దిరోజులుగా మార్కెట్‌కు వస్తున్న మిర్చి, వేరుశనగ, పసుపు, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా మద్దతు ధర లభించడం లేదు.. తీవ్ర వర్షాభావం, విద్యుత్ సరఫరా సరిగా లేక రబీ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన పంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీంతో పంటల ఉత్పత్తి కూడా తగ్గింది. ఇలా పంట విస్తీర్ణం, ఉత్పత్తి తగ్గినప్పుడు సహజంగానే రైతులకు ఎక్కువ ధర రావాలి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యాపారుల మాయాజాలంతో రైతులకు ఎప్పటిలాగే కనీస మద్దతు ధర రావడమే కష్టంగా మారుతోంది. ప్రస్తుతం మార్కెట్‌కు ఎక్కువగా వచ్చే మిర్చి, వేరుశనగ, పసుపు, మొక్కజొన్న వంటి పంటలకు ఆశించిన మేరకు ధరలు అందడం లేదు. మార్కెటింగ్ అధికారుల సహకారంతో వ్యాపారులు పంట నాణ్యత పేరిట రైతులను ముంచుతున్నారు. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఒక్క కందులు, సోయాకు మాత్రం కనీస మద్దతు ధర కంటే కొంత ఎక్కువగా ధర లభిస్తోంది. భారీగా తగ్గిపోయిన సాగు.. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం ముందే చేతులు ఎత్తేయడంతో రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 65 లక్షల ఎకరాలు. ప్రతికూల పరిస్థితులతో ఈ ఏడాది 55 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ప్రధానంగా వరిసాగు బాగా తగ్గింది. ఇక మొక్కజొన్నను గత ఏడాది 6.25 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఈ సారి 5 లక్షల ఎకరాల్లోనే సాగయింది. గత ఏడాది ఇదే సమయంలో మొక్కజొన్న క్వింటాల్‌కు రూ. 1,572 చొప్పున ధర లభించగా... ఇప్పుడు కనీస మద్దతు ధరకు సమానంగా రూ. 1,310 రావడమే కష్టంగా ఉంది. నాణ్యత పేరుతో కొన్ని చోట్ల వ్యాపారులు రూ. 950 మాత్రమే ఇస్తున్నారు. రబీలో ప్రధాన వాణిజ్య పంట మిర్చి. రాష్ట్రంలో ఈ సారి 1.25 లక్షల ఎకరాల్లో దీనిని సాగుచేశారు. గత ఏడాది ఇదే సీజన్లో మిర్చి క్వింటాల్‌కు రూ. 12,500 వరకు పలుకగా.. ఇప్పుడు మేలు రకం పంటకు కూడా రూ. 10 వేల వరకే వస్తోంది. ఇక కొన్ని చోట్ల నాణ్యత పేరిట రూ. 5 వేలు మాత్రమే ఇస్తున్నారు. అంతా మాయాజాలం.. వరంగల్ జిల్లాలో ఆరు తడి పంటలు ఎక్కువగా సాగు చేయాలనే ప్రభుత్వ సూచనలతో వేరుశనగ సాగు పెరిగింది. ధర పరిస్థితి మాత్రం రకరకాలుగా ఉంటోంది. 2013 ఏప్రిల్ నుంచి 2014 మార్చి వరకు గరిష్టంగా రూ.4,570, కనిష్టంగా రూ.1,400 పలికింది. 2014 మార్చి నుంచి 2015 ఫిబ్రవరి 15 వరకు గరిష్టంగా రూ. 5,450, కనిష్టంగా రూ. 1,300 పలికింది. కొనుగోలు చేసే వారి ఆధిపత్యంతో వేరుశనగ రైతులు మార్కెట్లలో నిరసనలకు దిగుతున్నారు. నల్లగొండ జిల్లాలో ప్రధాన పంట వరి హెక్టారుకు 50 క్వింటాళ్లదాకా దిగుబడి వచ్చినప్పటికీ.. పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడ్డారు. ప్రభుత్వ సంస్థలు, మిల్లర్లు తేమను సాకుగా చూపి మద్దతు ధర కంటే తక్కువగా ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావం కారణంగా కంది, సోయా పంటల దిగుబడి బాగా తగ్గిపోయింది. హెక్టార్‌కు 7 నుంచి 8 క్వింటాళ్లకు మించి దిగుబడి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. పచ్చిదంటూ మోసం.. ‘‘మార్కెట్‌కు 26 బస్తాల పచ్చి పల్లికాయ తెచ్చాను. క్వింటాల్‌కు ధర రూ. 1,800 అంటున్నారు. పచ్చిదనే పేరుతో వ్యాపారులు మోసం చేయాలని చూస్తున్నారు. పచ్చి పల్లికాయ ఎప్పుడు కూడా కనీసం రూ. 2,500 కన్నా తక్కువ పలకలేదు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.’’ - దండుగుల మొగిలి, మేడారం పల్లి, వరంగల్ దిగుబడులు తగ్గాయి.. ‘‘వేరుశనగ పంటను ఐడు ఎకరాల్లో వేసిన. వేలు పెట్టుబడి పెట్టాం. కానీ దిగుబడులు సరిగా రాలేదు. 200 బస్తాలు రావాల్సింది 140 బస్తాలే వచ్చింది. దిగుబడులు తగ్గడంతో పెట్టుబడులు రాని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి..’’ - నీల్యానాయక్, దొంతికుంటతండా, మహబూబ్‌నగర్