సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరలపై మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి సిటుతో పాటు యాభై శాతం కలిపి ఇస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పంటల మద్దతు ధర రైతుల హక్కుగా పార్లమెంట్ లో చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించిన ధరల్లో ఒక్క సజ్జకు మాత్రమే సిట్ ప్రకారం న్యాయం జరిగిందని అన్నారు. ధాన్యానికి ప‍్రకటించిన రెండు వందలు కూడా తక్కువే అని మండిపడ్డారు. శాస్త్రీయంగా పెరగాల్సిన వాటికి ఐదు వందల రూపాయలు తక్కువగా ప్రకటించారని ధ్వజమెత్తారు.
పప్పుధాన్యాలలో పెసరకు మినహా ఇతర పంటలకు తక్కువ మద్దతు ధరనే ప్రకటించారని మండిపడ్డారు. కందులు, మినుములకు కేటాయించిన ధరలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. ఆయిల్ సీడ్ పంటలకు సరైన విధంగా ధర పెంచే విధంగా కేంద్రం ఇప్పటికైన సరైన ఆలోచన చేయకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం సగటు కుటుంబ ఆదాయం రూ. 18 వేలు ఉండాలని, కానీ రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ. 6630 మాత్రమేనని తెలిపారు. తక్షణమే స్వామినాథన్ కమీషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర కన్నా రైతులు తక్కువకు అమ్ముకుంటే... రెండిటి మధ్య తేడాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment