రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెండింతలు చేయాలని నిర్ణయించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు. దేశంలోని ఎక్కువమంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. వారిలో చాలామంది వ్యవసాయాధారిత పనులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామీణుల జీవన ప్రమాణాలను పెంచకుండా మనం నిజమైన అభివృద్ధిని, ప్రగతిని సాధించినట్టు కాదు. ఈ నేపథ్యంలో రైతుల ఆదాయాన్ని రానున్న మూడేళ్లలో రెట్టింపు చేయాలని నిర్ణయించడం ప్రశంసనీయం.
రైతులను ఆదుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కనీస మద్దతు ధరలను ప్రకటిస్తున్నాయి. మార్కెట్ ధరలు కనీస మద్దతు ధరల కంటే దిగువకు పడిపోయినప్పుడు ఆ పంటలను ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. అయితే, కనీస మద్దతు ధర అనేది ఒక భ్రమ అని నేను గట్టిగా చెప్పదల్చుకున్నా. మన రైతులు వందలాది పంటలు పండిస్తుండగా కనీస మద్దతు ధరను 23 పంటలకు మాత్రమే అందిస్తున్నారు. ఇది గిట్టుబాటు ధర మాత్రం కాదు. జరిగిన నష్టాన్ని పూరించేది కాదు. పైగా.. వరి, గోధుమలకు తప్ప వేరే వాటికి మద్దతు ధర అందించడానికి ఎటువంటి వ్యవస్థా లేదు. కనీస మద్దతు ధర గురించీ, ప్రభుత్వం ఆ పద్ధతిలో పంటలు సేకరించే విధానం గురించీ చాలా మంది రైతులకు అవగాహన లేదు. ఫలితంగా రైతులు తమ పంటలను ఏజెంట్ల ద్వారా స్థానిక మిల్లర్లకు కనీస మద్దతు ధరకంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.
భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలు వరి, పత్తి పంటలను రైతుల నుంచి నేరుగా సేకరించకుండా, మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ధాన్యం సేకరణ విధానాన్ని పరిశీలించాను. అక్కడ ఖరీఫ్‌లో వరి కోత కోయడం, నూర్పడం యంత్రాలతోనే చేస్తున్నారు. అంతేకాదు, ఆ ధాన్యాన్ని బస్తాలకు కూడా ఎత్తకుండా ట్రాక్టర్లలో ఇసుక తీసుకొచ్చినట్టు తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో గుమ్మరిస్తారు. అటువంటి కేంద్రాలు ప్రతి ఐదారు కిలోమీటర్లకు ఒకటి ఉంటుంది. వాటిలో భారత ఆహార సంస్థతోపాటు రాష్ట్ర, ఆహార శాఖ, వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల కార్పొరేషన్, ఆగ్రో ఇండస్ట్రీస్, రాష్ట్ర వాణిజ్య సంస్థ వంటి విభాగాలన్నీ పోటీపడి ధాన్యం కొనుగోలు చేస్తారు. దాంతో అక్కడి ప్రైవేట్ మిల్లర్లకు ఆయా కొనుగోలు కేంద్రాల నుంచి 5 శాతం సరుకు కూడా చిక్కదు. ఖరీఫ్‌లో వరి కోతలయ్యాక మూడు, నాలుగు వారాల్లో రాష్ట్రంలో ఒక్క వడ్ల గింజ కూడా మిగలదు.
ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొన్న సరుకు తూకం వేసి బియ్యం మిల్లులకు రవాణా చేయడం, అందుకు అవసరమైన గిడ్డంగులు, నార సంచులు, పురికొసలు వంటివి పోగు చేసుకుని, రవాణా సౌకర్యాలు సిద్ధం చేసుకుని మరపట్టిన బియ్యాన్ని భారత ఆహార సంస్థకు అందించడం అతి పెద్ద రైతాంగ సంక్షేమ కార్యక్రమం. చట్ట ప్రకారం రైతుల నుండి నేరుగా ధాన్యం కొనుగోలు చేయవలసిన బాధ్యత భారత ఆహార సంస్థదే అయినా, దాన్ని ఆ సంస్థే నీరుగారుస్తోంది. మన రాష్ట్రంలో రైతులు ఎవరైనా ధాన్యాన్ని అమ్మాలనుకుంటే కుంటిసాకులతో దానిని తిరస్కరించడమే కాదు, కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలంటేనే రైతాంగం బెదిరిపోయే వాతావరణం నెలకొని ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సప్లయిస్ శాఖ వారు కూడా బియ్యం మిల్లులవారి సేవలోనే పునీతమవుతున్నారు. దీంతో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మిల్లర్ సపోర్ట్ ప్రైస్‌గా మారిపోయింది. దేశంలోని అన్ని పంటలకు వ్యవసాయ ధరల కమిషన్ ఒకే విధమైన కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ఉత్పత్తి ఖర్చుల డేటాపైనే కమిషన్ ఆధారపడుతుంది.
పంటలను సేకరించే సందర్భంలో కనీస మద్దతు ధరకు, ఉత్పత్తి ధరకు మధ్య నుండే వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉంది. వాస్తవమైన ఉత్పత్తి ధరను నిర్ణయించడానికి రాష్ట్రాల స్థాయిలో వ్యవసాయ ధరల కమిషన్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. కనీస మద్దతు ధరలను వాస్తవికంగా నిర్ణయించి అమలు చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం చేరుకుంటుందని ఆశిస్తున్నా. (బడ్జెట్‌కు ముందు చర్చల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పంపిన ఆహ్వానానికి స్పందిస్తూ రచయిత పంపిన నోట్స్ సారాంశం)
యలమంచిలి శివాజీ
వ్యాసకర్త గౌరవాధ్యక్షుడు,
కిసాన్ ఫౌండేషన్ ‘ 98663 7673
Comments
Please login to add a commentAdd a comment