Yalamanchili Sivaji
-
రైతులకు దగ్గర చుట్టం వైఎస్సార్
నేను అధికార పక్షంలో లేనప్పటికీ, రైతాంగ సమస్యలపై ఎప్పుడు ఏది చెప్పినా.. వైఎస్ రాజశేఖరరెడ్డి సహృదయంతో స్వీకరించేవారు. ఆయనతో నా సత్సంబంధాలకు కులం, ప్రాంతం, పదవి ఏదీ అడ్డుగోడ కాలేదు. రైతుల కోసం పాటుపడేవారెవరైనా సరే తన సొంత మనుషులుగా, ఆత్మీయులుగా చూసేవారు. మనస్సు విప్పి మాట్లాడేవారు. సమస్యలు పరిష్కరించేవారు. రాష్ట్రంలోని రైతులకు కొండంత అండగా ఉండేవారు. ఆయనతో రాజకీయంగా విభేదించేవారైనా సరే.. రైతాంగం పట్ల ఆయనకున్న పక్షపాతాన్ని, వారి ఉద్ధరణ పట్ల ఆయనకు గల నిబద్ధతను కాదనలేరు. రాష్ట్రంలో రైతాంగానికి, వారి కోసం శ్రమించే మాబోటి వారందరికీ వైఎస్సార్ అకాల మరణంతో, పెద్దదిక్కును కోల్పోయినట్లు అయ్యింది. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డితో చాలా కాలంగా పరిచయమున్నా 1989లో కడప నుండి ఆయన లోక్‌సభకు ఎన్నికై వచ్చిన తరువాతనే వారిని దగ్గరగా చూశాను. అప్పట్లో నేను రాజ్యసభ సభ్యుడిని. వైఎస్సార్ తోటి కాంగ్రెస్ ఎంపీలు, సహచర మిత్రులతో పార్లమెంటు సెంట్రల్ హాల్లో పరివేష్ఠితుడై ఉండేవారు. ఆనాటి సహచరులందరినీ వదిలి పెట్టకుండా తనతోపాటుగా వారిని కూడా రాజకీయంగా పైకి తెచ్చారు. ఓ సందర్భంలో తన మిత్రుడికి కాకుండా అనంతపురంలో వేరొకరికి సీటు ఇవ్వనున్నారనే వార్త పొక్కడంతో.. తన చుట్టూ ఉన్న వారిని తోడు చేసుకొని తన మిత్రుడికి సీటివ్వాల్సిందే అని అధి ష్టానంపై ఒత్తిడి తెచ్చి ఒప్పించారు. నడి వేసవిలో వైఎస్సార్ కఠోరమైన పాదయాత్ర చేపట్టి రాష్ట్రమంతటా పర్యటిస్తూన్న సమయం. 2003 జూలై 23న హైదరాబాద్‌లోని సుందరయ్యభవన్‌లో డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పుచ్చలపల్లి సుందరయ్య గారిని గూర్చి ఒక పుస్తకాన్ని ప్రచురించి దానిని నాకు అంకితమిచ్చారు. డాక్టర్ వై.ఎస్. ఆ గ్రంథాన్ని ఆవిష్కరించారు. నాటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సభకు అధ్యక్షులు. 1978–83 మధ్య శాసనసభలో సుందరయ్యగారు రాష్ట్రమంతటా నదీ జలాలను కనీసం ఒక పంటకయినా అందించాలని చేసిన ప్రసంగాలు తన చెవిలో యింకా మార్మోగుతున్నాయని ఆ దిశగా ఆలోచనలు చేయాలని వైఎస్సార్ వక్కాణించారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే అదే స్ఫూర్తితో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తో పాటుగా జలయజ్ఞానికి ఆయన శ్రీకారం చుట్టడం గమనార్హం. ముఖ్యమంత్రయిన నెలా పదిహేను రోజులకు 2004 జూలై 4, 5 విజయవాడలో మకాం పెట్టి, 5వ తేదీ ఉదయం ప్రకాశం బ్యారేజీ మరమ్మతులు పరిశీలించారు. పులిచింతల సాధనకై చిరకాలంగా ఈ జిల్లాల రైతాంగం పడుతున్న ఆందోళన వివరించాను. అక్టోబర్ 15, 2004న జలయజ్ఞంలో తొలి పునాదిరాయి పులిచింతలకే వేశారు. 30 ఏప్రిల్ 2005న పులిచింతల ప్రాజెక్టు బహిరంగ విచారణ పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేశారు. ఇది కేవలం రూ. 262 కోట్ల విలువగల పని. కాంట్రాక్టర్లో కరుకుదనం లోపించి అనుకొన్నట్లుగా పని జరుగలేదు. 23 మార్చి 2007 నాడు (వరల్డ్ వాటర్స్డే) ప్రపంచ జల దినోత్సవం ఏర్పాటు చేశారు, హైదరాబాద్ జూబ్లీహాల్లో జరిగిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, సహాయ నిరాకరణ చేస్తూన్న కాంట్రాక్టర్లను కాడికిందకు తేవాలని సూచించాను. దానితో జాప్యాన్ని సమీక్షించి, వేగం పుంజుకొనేట్లు చూడాలని అధికారులను ఆదేశించారు వైఎస్. ఆ తర్వాత 2005 మార్చి 23, 24, 25 తేదీల్లో దక్షిణాసియా వ్యవసాయ ఆర్థిక వేత్తల సమావేశాలు జరిగాయి. 25వ తేదీ మధ్యాహ్నం జూబ్లీహాల్లో ముఖ్యమంత్రి వై.ఎస్. కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ గౌరవార్థం విందు ఏర్పాటు చేసి, మమ్ములనందరినీ ఆహ్వానించారు. అప్పటికే కొత్తగా శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాన్ని ప్రకటించారు. రాయలసీమ, కోస్తా జిల్లాలకు మరొక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పవలసిన అవసరాన్ని వివరించాను. రాష్ట్ర వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డిని పిలిచి వెంటనే ఆమేరకు ప్రతిపాదనలు రూపొందించమని ఆదేశించారు. మరో వ్యవసాయ విశ్వవిద్యాలయం కన్నా ప్రత్యేకంగా ఉద్యానవన పంటల విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం బాగుంటుందేమోనన్నారు. వై.ఎస్. ఆలోచనలు, అనతికాలంలోనే కార్యరూపం దాల్చి తాడేపల్లిగూడెం దగ్గర వెంకట్రామన్నగూడెం కేంద్రంగా ఉద్యానవన విశ్వవిద్యాలయం రూపుదాల్చింది. అలాగే 2005 నవంబర్ 26న జూబ్లీహాల్లో వర్జీనియా పొగాకు రైతు సంఘం, ఇండియన్ పేజెంట్స్ ఫోరమ్‌ల ఆధ్వర్యంలో ఆచార్య యన్.జి.రంగా జన్మదిన వేడుకలు జరిపారు. ఆనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ బీటీ పత్తివిత్తనాలను అడ్డగోలు ధరలకు అమ్మడంపై ఆందోళన ప్రకటిస్తూ ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ధరలు తగ్గించాలని మనవి చేశాను. అక్కడనే ఉన్న వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డిని పిలిచి శివాజీ చెప్పింది నిజమేనా అని విచారించి, దోపిడీకి గురవుతున్న రైతులను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టవలసినదిగా ఆదేశించారు. దానిపై మూడోరోజునే విత్తన వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్యాకెట్ రూ. 1,650 అమ్మే విత్తనాలను రూ. 800కు అమ్మించారు. సీఎం దృష్టికి తెచ్చిన నలభై గంటలలోనే ఈ సమస్యలు పరిష్కరించడం విశేషం. దాని తర్వాత... గుత్త వ్యాపార నిరోధక సంస్థ వద్ద కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడింది.2007 ఖరీఫ్‌లో ధాన్యం కనీస మద్దతు ధర గోధుమతో సమానంగా ఉండాలని రైతాంగం, రాజకీయ పక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు మరొక రూ. 75 రాష్ట్ర ప్రభుత్వం జోడిస్తే దానంతటదే మార్కెట్ ధర ఆ మేరకు పెరుగుతుందని సవివరంగా ఓ నివేదిక తయారు చేసి వై.ఎస్.కిచ్చాను. దాని వలన రాష్ట్ర ఖజనాపై భారం పడకుండానే ధాన్యం ధర పెంచగలమని వివరించాను. దానిపై వ్యవసాయ కమిషనర్ సుకుమార్, పౌర సరఫరా శాఖ అధికారులతో చర్చించారు. చివరికి ఏమయ్యిందోగాని.. 2007 జూలై 25, 26 తేదీలలో వ్యవసాయదారుల రుణగ్రస్తతపై ఓ జాతీయస్థాయి సెమినార్‌ను గుంటూరులో నిర్వహించాం. ఆ సమావేశానికి పది మందికి పైగా ఐఏఎస్ అధికారులను, వ్యవసాయ విశ్వవిద్యాలయం, యితర విశ్వవిద్యాలయాలలోని ఆర్థికవేత్తలందరినీ గుంటూరు పంపారు. ఆనాడు చర్చించి రూపొందించిన నివేదికే.. 2008–09 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలో చోటుచేసుకొన్న రైతుల రుణ విమోచన పథకం. 2008 జనవరి 21న నేను, ఎస్.వి. పంతులు జరిగిన పరిణామాలను, సాధించిన ప్రగతిని వివరిస్తే సంబరపడ్డ వై.ఎస్. వెంటనే శరద్‌పవార్‌కు ఫోన్ చేసి శివాజీ పథకం ఎంతవరకూ వచ్చిందని విచారించారు. ‘ఇప్పుడే ఆర్థిక మంత్రి చిదంబరంతో చర్చించి వస్తున్నాను. రాబోయే బడ్జెట్ ప్రతిపాదనలలో దీనిని పొందుపరుస్తున్నాం’ అని చెప్పారు పవార్. దీని బదులు, ఇన్ పుట్ సబ్సిడీ యిస్తే ఎక్కువమందికి ప్రయోజనం కలుగుతుందని కొంత మంది పెద్దలు సూచిస్తే దీని మీద శివాజీ కొంత కృషి చేసి, ముందుకు తీసుకెళ్ళారు, ఈ దశలో మనం మరొకటి చెప్పడం బాగుం డదని సున్నితంగా వారించారట వై.ఎస్. 2007 సెప్టెంబర్ 20న ప్రకాశం బ్యారేజీకి 5.56 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. డెల్టా దెబ్బతిన్నది. వై.ఎస్. ఢిల్లీలో ఉండగా వారిని కలిసి డెల్టాను ఆధునీకరించాల్సిన అవసరం గురించి చెప్పాను. ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని సూచిం చాను. ప్రస్తుతం వున్నవి చేస్తూ, ఈ ఏడాది పూర్తి వివరాలతో అంచనాలు రూపొందించి, వచ్చే ఏడాది ప్రారంభిద్దామన్నారు. అన్నట్లుగానే 2008, జూన్‌లో అవనిగడ్డలో పునాది వేసి శంకుస్థాపన గావిం చారు. అయితే కాంట్రాక్టర్లు అంతగా ముందుకురాక, అనుకొన్న ప్రగతి కనపడలేదు. పులిచింతల పర్యావరణ తదితర అనుమతులు గాని ఏదైనా సరే వారి దృష్టికి తేవడమే ఆలస్యం, వెంటనే స్పందించి పరిష్కరించేవారు. తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికయిన తర్వాత, 2009 జూన్ 13 నాడు డాక్టర్ ధూళిపాళ్ళ సాంబశివరావుగారమ్మాయి వివాహంలో కలుసుకొన్నప్పుడు రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధిపై సవివరంగా ఒక నివేదిక తయారు చేస్తున్నానని చెప్పాను. అప్పుడే సహకార వ్యవసాయంపై వారికున్న ఆలోచనలు వివరించారు. నేను అధికార పక్షంలో లేను. ఏ పదవిలోనూ లేను. పైగా ప్రాంతాలు వేరు, కులాలు వేరు. ఇవేవీ వైఎస్సార్‌కి, నాకు మధ్య సత్సంబంధాలకు అడ్డుగాలేవు. రైతాంగ సమస్యలపై ఎప్పుడు ఏది చెప్పినా, సహృదయంతో స్వీకరించేవారు. రైతుల కోసం పాటు పడేవారెవరైనా సరే తన సొంత మనుషులుగా చూసేవారు. మనస్సు విప్పి మాట్లాడేవారు, సమస్యలు పరిష్కరించేవారు. రాష్ట్రంలోని రైతులకు కొండంత అండగా ఉండేవారు. ఆయనతో రాజకీయంగా విభేదించేవారైనా సరే రైతాంగం పట్ల ఆయనకున్న పక్షపాతాన్ని, వారి ఉద్ధరణ పట్ల వారికి గల నిబద్ధతను కాదనలేరు. వ్యవసాయ రంగాన్ని బాగు చేసి రైతుల బ్రతుకుల్లో వెలుగు నింపుదామన్న ఆయన తపనను వైరిపక్షం వారు కూడా తప్పుపట్టలేరు. రాష్ట్రంలో రైతాంగానికి, వారి కోసం శ్రమించే మాబోటి వారందరికీ వైఎస్సార్ అకాల మరణంతో, పెద్దదిక్కును కోల్పోయినట్లు అయ్యింది. వారి ఆత్మకు శాంతి కలగాలని, భగవంతుని ప్రార్థిస్తూ, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వ్యాసకర్త: డాక్టర్ యలమంచిలి శివాజీ, రాజ్యసభ మాజీ సభ్యులు, వ్యవసాయ రంగ నిపుణులు ‘ మొబైల్ : 98663 76735 -
కనీస మద్దతు ధర ఒక భ్రమ
రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెండింతలు చేయాలని నిర్ణయించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు. దేశంలోని ఎక్కువమంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. వారిలో చాలామంది వ్యవసాయాధారిత పనులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామీణుల జీవన ప్రమాణాలను పెంచకుండా మనం నిజమైన అభివృద్ధిని, ప్రగతిని సాధించినట్టు కాదు. ఈ నేపథ్యంలో రైతుల ఆదాయాన్ని రానున్న మూడేళ్లలో రెట్టింపు చేయాలని నిర్ణయించడం ప్రశంసనీయం. రైతులను ఆదుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కనీస మద్దతు ధరలను ప్రకటిస్తున్నాయి. మార్కెట్ ధరలు కనీస మద్దతు ధరల కంటే దిగువకు పడిపోయినప్పుడు ఆ పంటలను ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. అయితే, కనీస మద్దతు ధర అనేది ఒక భ్రమ అని నేను గట్టిగా చెప్పదల్చుకున్నా. మన రైతులు వందలాది పంటలు పండిస్తుండగా కనీస మద్దతు ధరను 23 పంటలకు మాత్రమే అందిస్తున్నారు. ఇది గిట్టుబాటు ధర మాత్రం కాదు. జరిగిన నష్టాన్ని పూరించేది కాదు. పైగా.. వరి, గోధుమలకు తప్ప వేరే వాటికి మద్దతు ధర అందించడానికి ఎటువంటి వ్యవస్థా లేదు. కనీస మద్దతు ధర గురించీ, ప్రభుత్వం ఆ పద్ధతిలో పంటలు సేకరించే విధానం గురించీ చాలా మంది రైతులకు అవగాహన లేదు. ఫలితంగా రైతులు తమ పంటలను ఏజెంట్ల ద్వారా స్థానిక మిల్లర్లకు కనీస మద్దతు ధరకంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలు వరి, పత్తి పంటలను రైతుల నుంచి నేరుగా సేకరించకుండా, మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ధాన్యం సేకరణ విధానాన్ని పరిశీలించాను. అక్కడ ఖరీఫ్‌లో వరి కోత కోయడం, నూర్పడం యంత్రాలతోనే చేస్తున్నారు. అంతేకాదు, ఆ ధాన్యాన్ని బస్తాలకు కూడా ఎత్తకుండా ట్రాక్టర్లలో ఇసుక తీసుకొచ్చినట్టు తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో గుమ్మరిస్తారు. అటువంటి కేంద్రాలు ప్రతి ఐదారు కిలోమీటర్లకు ఒకటి ఉంటుంది. వాటిలో భారత ఆహార సంస్థతోపాటు రాష్ట్ర, ఆహార శాఖ, వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల కార్పొరేషన్, ఆగ్రో ఇండస్ట్రీస్, రాష్ట్ర వాణిజ్య సంస్థ వంటి విభాగాలన్నీ పోటీపడి ధాన్యం కొనుగోలు చేస్తారు. దాంతో అక్కడి ప్రైవేట్ మిల్లర్లకు ఆయా కొనుగోలు కేంద్రాల నుంచి 5 శాతం సరుకు కూడా చిక్కదు. ఖరీఫ్‌లో వరి కోతలయ్యాక మూడు, నాలుగు వారాల్లో రాష్ట్రంలో ఒక్క వడ్ల గింజ కూడా మిగలదు. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొన్న సరుకు తూకం వేసి బియ్యం మిల్లులకు రవాణా చేయడం, అందుకు అవసరమైన గిడ్డంగులు, నార సంచులు, పురికొసలు వంటివి పోగు చేసుకుని, రవాణా సౌకర్యాలు సిద్ధం చేసుకుని మరపట్టిన బియ్యాన్ని భారత ఆహార సంస్థకు అందించడం అతి పెద్ద రైతాంగ సంక్షేమ కార్యక్రమం. చట్ట ప్రకారం రైతుల నుండి నేరుగా ధాన్యం కొనుగోలు చేయవలసిన బాధ్యత భారత ఆహార సంస్థదే అయినా, దాన్ని ఆ సంస్థే నీరుగారుస్తోంది. మన రాష్ట్రంలో రైతులు ఎవరైనా ధాన్యాన్ని అమ్మాలనుకుంటే కుంటిసాకులతో దానిని తిరస్కరించడమే కాదు, కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలంటేనే రైతాంగం బెదిరిపోయే వాతావరణం నెలకొని ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సప్లయిస్ శాఖ వారు కూడా బియ్యం మిల్లులవారి సేవలోనే పునీతమవుతున్నారు. దీంతో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మిల్లర్ సపోర్ట్ ప్రైస్‌గా మారిపోయింది. దేశంలోని అన్ని పంటలకు వ్యవసాయ ధరల కమిషన్ ఒకే విధమైన కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ఉత్పత్తి ఖర్చుల డేటాపైనే కమిషన్ ఆధారపడుతుంది. పంటలను సేకరించే సందర్భంలో కనీస మద్దతు ధరకు, ఉత్పత్తి ధరకు మధ్య నుండే వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉంది. వాస్తవమైన ఉత్పత్తి ధరను నిర్ణయించడానికి రాష్ట్రాల స్థాయిలో వ్యవసాయ ధరల కమిషన్లను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. కనీస మద్దతు ధరలను వాస్తవికంగా నిర్ణయించి అమలు చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం చేరుకుంటుందని ఆశిస్తున్నా. (బడ్జెట్‌కు ముందు చర్చల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పంపిన ఆహ్వానానికి స్పందిస్తూ రచయిత పంపిన నోట్స్ సారాంశం) యలమంచిలి శివాజీ వ్యాసకర్త గౌరవాధ్యక్షుడు, కిసాన్ ఫౌండేషన్ ‘ 98663 7673 -
అసెంబ్లీ సీట్ల పెంపునకు అవకాశం లేదు
♦ ఇతర రాష్ట్రాలూ కోరే వీలుంది ♦ పెంచాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి ♦ డీ లిమిటేషన్ కమిటీ వేసినా ఆరేడేళ్లు పట్టే పరిస్థితి ♦ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏదీ జరగదు ♦ ఇష్టారీతిన ఎందుకు మాట్లాడుతున్నారో..? ♦ మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ సాక్షి, హైదరాబాద్, గుంటూరు (కొరిటెపాడు): రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు పెంచడానికి అవకాశం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ అభిప్రాయపడ్డారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని తన నివాసంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల సంఖ్యను పెంచుతారనే వాదన తాజాగా వినపడుతోంది. అయితే రాష్ట్ర విభజన చట్టం గెజిట్‌లో సెక్షన్-26 కింద రాజ్యాంగంలోని 170 అధికరణకు లోబడి మాత్రమే ఉభయ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల సంఖ్యను పెంచుతాం అనే మాటను పొందుపరిచారు. దీని ప్రకారం రాజ్యాంగ సవరణ చేయకుండా శాసనసభ స్థానాల సంఖ్యను పెంచడం సాధ్యం కాదు’ అని శివాజీ స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలని, దీంతోపాటు దేశంలోని మెజార్టీ శాసనసభలు తీర్మానాలు చేయాల్సి ఉంటుందని వివరించారు. గత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా సాధ్యం కాదన్నారు.. అంతేకాకుండా పునర్వ్యవస్థీకరణకు డీలిమిటేషన్ కమిటీ కూడా వేయాల్సి ఉందని శివాజీ తెలిపారు. 2002లో కులదీప్‌సింగ్ అధ్యక్షతన డీలిమిటేషన్ కమిటీ వేయగా.. ఆ కమిటీ నిర్ణయాలు 2009 ఎన్నికల్లో అమల్లోకి వచ్చాయని తెలిపారు. దీని ప్రకారం ఒకవేళ కేంద్రం పునర్వ్యవస్థీకరణ కమిటీని వేసినా అమలుకు ఆరేడేళ్లు పట్టే పరిస్థితి ఉంటుందని వివరించారు. గత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం సాధ్యం కాదని అప్పట్లో ఒక ప్రకటన చేశారని గుర్తుచేశారు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని వారందరితో చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లాలని, లేకుంటే లేనిపోని ఉపద్రవాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. ఇష్టారీతిన ఎందుకు మాట్లాడుతున్నారో? పార్టీలు, రాష్ట్రాలు కోరినట్లు తొందరపడి శాసనసభా స్థానాలను పెంచేయడానికి సాధ్యం కాదని, ఎవరికి వారు ఎందుకు ఇష్టారీతిన మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. 1970-71లో వేసిన పునర్వ్యవస్థీకరణ కమిటీ నిర్ణయాలు 1978 ఎన్నికలకు గాని అమల్లోకి రాలేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రేపు, ఎల్లుండి శాసనసభ స్థానాల సంఖ్య పెరుగుతాయని అనడానికి వీల్లేదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏదీ జరగదని, ఆచితూచి అడుగులు వేయాలే తప్ప ఇష్టానుసారం చెప్పడానికి వీల్లేదన్నారు. 1975లో ఎమర్జెన్సీ విధించారని, చట్టసభల కాలపరిమితిని 5 ఏళ్లు, 7 ఏళ్లుగా పెట్టారని, దీనికి 42వ రాజ్యాంగం ద్వారా మెజార్టీ శాసనసభలు తీర్మానం చేశాయని యలమంచిలి శివాజీ పేర్కొన్నారు. రాజ్యాంగ స్వరూపం, స్వభావాలు మార్చడానికి వీల్లేదు రాజ్యాంగ స్వరూపం, స్వభావం, ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడానికి వీల్లేదని శివాజీ ’సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచడానికి సాధ్యం కాదని గతేడాది ఫిబ్రవరి 7న లోక్‌సభలో కేంద్రం తేల్చి చెప్పిందని గుర్తుచేశారు. గతంలోనూ నియోజకవర్గ కేంద్రాల స్థానాలు మారా యే తప్ప సంఖ్య మారలేదన్నారు. తాజా వాదన లేవనెత్తితే ఇతర రాష్ట్రాలు కూడా శాసనసభ స్థానాలు పెంచాలనే డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదన్నారు. ఉత్తరాంచల్‌లో 70 అసెంబ్లీ స్థానాలను 101కి, జార్ఖండ్ 81 నుంచి 160 స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలను ఇంకా పెంచాలని ఇటీవల కోరుతున్నాయని వివరించారు. -
'బాబు వైఖరితోనే గ్రేటర్లో ఓటమి'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరించిన వైఖరి కారణంగా గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైందని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ అన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన సాక్షి ప్రతినిధితో ఫోన్లో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం చంద్రబాబు స్నేహపూర్వకంగా మెలగడం వల్ల ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ఫ్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయలేకపోయారని అన్నారు. ఈ విధానం వల్ల టీడీపీ కేడర్‌కు బాబు ధైర్యాన్ని ఇవ్వలేకపోవడంతోపాటు టీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేయలేకపోయారని శివాజీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు ఇద్దరూ స్నేహంగా ఉన్న సమయంలో తాము స్థానికులతో ఎందుకు వివాదాలకు పోవాలని భావించి సీమాంధ్ర ఓటర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు ఊహించినవేనని, ఒక ప్రాంతీయపార్టీ మరో రాష్ట్రంలోని స్థానిక ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవని, చరిత్ర ఇదే చెబుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయకుండా పక్క రాష్టంలో పార్టీని బలపరిచే దిశగా ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం కాదని శివాజీ అన్నారు. -
నిర్బంధాల నీడలలో
బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా విన్న తరువాతనే తెలిసింది-ఎమర్జెన్సీ సంగతి. జయ ప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ వంటి నేతలు ఆ ముందు రాత్రి అరెస్టయిన సంగతి కూడా అలాగే తెలిసింది. నేను విలేకరులను పిలిచి ఈ చర్యలను ఖండి స్తున్నట్టు చెప్పాను. జూన్ 12, 1975. ఆ ముందురోజు రాత్రి నుంచే గుజరాత్ అసెంబ్లీ ఎన్ని కల ఫలితాలు రావడం మొదలైంది. కాంగ్రెస్ పరిస్థితి ఆశా జనకంగా లేదు. మరోవైపు రాయబరేలీ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఇందిరా గాంధీ ఎన్నిక (1971) చెల్లదంటూ సోష లిస్ట్ నాయకుడు రాజ్‌నారాయణ్ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జేఎంఎల్ సిన్హా తీర్పు ఇచ్చినట్టు వార్త వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో మిత్రుడు సి. నరసింహారావు రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించే పనిలో ఉన్నాను. వార్త తెలిసిన వెంటనే ‘ఇందిర రాజీనామా చేయాలి’ అన్నాను. జూన్ 25, 1975 అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద పూర్తిగా స్టే విధించాలని కోరుతూ జూన్ 23న ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లారు. వెకేషన్ జడ్జి వీఆర్ కృష్ణయ్యర్ షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చారు. అది జరిగిన కొన్ని గంటలకే ఇందిరా గాంధీ ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని విధిస్తూ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఆ రాత్రే కొద్దిగా జల్లు పడుతోం డగా నేనూ, మా నాన్నగారూ విజయవాడ నుంచి గుం టూరు శివార్లలో ఉండే మా ఇంటికి తిరిగి వచ్చాము. ఒం టిగంటకు తలుపు చప్పుడైంది. ఎదురుగా పోలీసులు. కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ వెంటనే రమ్మన్నారని చెప్పారు. అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కొంచెం హడా వుడి జరిగింది. ఇంతకీ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన సంగతి నాకు తెలియదు. ఆశ్చర్యంగా పోలీసులు కూడా చెప్పలేకపోయారు. ఇక్కడ నాకు స్నేహితుడు రాఘ వరావు జతయ్యాడు. ఇద్దరినీ ఒక హోటల్‌కు మార్చి, తరు వాత రాజమండ్రి జైలుకు తీసుకువెళతామని తెలియచేశా రు. మరునాడు ఉదయం పదిగంటలకు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని మాత్రమే ఆకాశవాణి ప్రకటించిం ది. చివరికి బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా విన్న తరువా తనే తెలిసింది- ఎమర్జెన్సీ సంగతి. జయప్రకాశ్ నారా యణ్, మొరార్జీ దేశాయ్ వంటి నేతలు ఆ ముందు రాత్రి అరెస్టయిన సంగతి అలాగే తెలిసింది. నేను విలేకరులను పిలిచి ఈ చర్యలను ఖండి స్తున్నట్టు చెప్పాను. రాఘవరావు, నేనూ విజయవాడ బయలుదేరాం. విజయవాడ బస్ డిపో లోనూ, రైల్వే స్టేషన్లోనూ మాకు సాదర స్వాగతం లభిం చింది. జూపూడి యజ్ఞనారాయణ, బి. సుబ్బారెడ్డి, తూమా టి బాలకోటేశ్వరరావులను కూడా ‘మీసా’ (మెయింటె నెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) కింద అరెస్ట్ చేసినట్టు ఇక్కడే తెలిసింది. గొట్టిపాటి మురళీమోహనరావు, కొమర గిరి కృష్ణమోహన్‌రావు, ఎంవీ రామమూర్తి, తుమ్మల చౌదరి, అట్లూరి శ్రీమన్నారాయణ, అయితా రాములు- వీరందరినీ కూడా రాజమండ్రి జైలుకే తరలిస్తున్నట్టు సమాచారం అందింది. దేశమే నిర్బంధం నీడలోకి వెళ్లింది. అంతటా, భయం అంతర్లీనంగా. ఆ గుబులుకు కొద్దిగా సాంత్వనను ఇచ్చే ఘటనలు కూడా మధ్య మధ్య జరగక పోలేదు. మాకు కాపలా ఉన్న పోలీసుకు రూపాయి ఇచ్చి పత్రికలు తెచ్చి పెట్టమన్నాను. నాలుగు తెచ్చాడు. నాలు గూ ఆంధ్రపత్రిక ప్రతులే. నాలుగు పత్రికలంటే, ఒకే పత్రి క నాలుగు ప్రతులు తెచ్చే మేధావులు ఉన్నంత వరకు ఫర వాలేద నిపించింది. ఇలాంటి వారి సాయంతో ఇందిర నియంత కావాలనుకుంటే కష్టమే అని బయటకే అన్నాను. రాజమండ్రి జైలులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో అడుగుపెట్టాం. అక్కడ ఎంవీ ఎస్ సుబ్బరాజు (వ్యవస్థా కాంగ్రెస్) ఉన్నారు. మాకినేని బసవపున్నయ్య (సీపీఎం), కాతా జనార్దనరావు (సోష లిస్ట్), కొల్లా వెంకయ్య (కమ్యూనిస్టు నాయకుడు), పీవీ ఎన్ రాజు (జనసంఘ్) మాదల నారాయణస్వామి (ఎం ఎల్ న్యూడెమోక్రసీ) ఉన్నారు. ‘మీసా’ నిబంధన కింద అరెస్టయిన వారిలో అన్నిరకాలు ఉన్నారు. మీసా నిబం ధనల మేరకు నిర్బంధానికి కారణాలేమిటో బందీలకు చెప్పాలి. గుంటూరు జిల్లా కలెక్టర్‌కు కారణాలు చెబుదామ నిపించింది కాబోలు. మేము చెరుకుపల్లి పోలీస్‌స్టేషన్ మీద దాడికి వ్యూహం పన్నామట. ఇద్దరు కానిస్టేబుళ్ల మర ణానికి కారణమట. ఆయుధాలు దొంగిలించుకుపోవడా నికి కుట్ర చేశామట. ఇదీ వివరణ. భారతీయ లోక్‌దళ్ కార్యదర్శిగా సంచలనాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నా నట. అలహాబాద్ హైకోర్టు తీర్పు తరువాత ఇందిర రాజీ నామా చేయాలని కోరడం, ‘సంపూర్ణ విప్లవం’ కావాలని కోరడం నేరమట. మాకు వివరణ ఇచ్చిన కొన్ని గంటలకే ఇలా కారణాలు చెప్పాలన్న ఆ నిబంధనను (జూన్ 29న) హఠాత్తుగా సవరించారు. అయితే ఏవో సాంకేతిక కారణా లతో మీసా అరెస్టులు చెల్లవని కర్ణాటక హైకోర్టు ఆగస్టు, 1975లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత నిర్బంధ ఆదేశాలను రద్దు చేసి కొత్తవి జారీ చేసింది. నేను ఎండీ ప్రవేశం కోసం విశాఖపట్నంలో ఇంటర్వ్యూకు హాజ రు కావలసి ఉంది. ఈ సౌకర్యం నాకు ఇవ్వలేదు. కాగా 20 రోజుల వరకు ఈ అరెస్టుల గురించి తెలియచేయలేదు కాబట్టి, ఆ అరెస్టులు చెల్లవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రక టించింది. కానీ పోలీసులు మా విడుదల, మళ్లీ అరెస్టు ఒకేసారి నిర్వహించారు. నేను హైకోర్టు మెట్లు దిగగానే అరెస్టు చేసి, చార్మినార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ రాత్రి పోలీస్ స్టేషన్లోనే నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్న పుడు నిఘా విభాగానికి చెందిన ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులు వచ్చారు. ‘‘జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీదేశాయ్ వంటి పెద్ద నాయకులను అరెస్ట్ చేసినా ప్రజలు మౌనంగానే ఉం డిపోయారు. అంటే ఈ పరిణామాలకు ప్రజా మద్దతులే దని అర్థం కావడం లేదా?’’ అన్నారు. ‘‘ఇందిరా గాంధీని అరెస్టు చేసినా అంతే, జనం మాట్లాడరు!’’ అన్నాన్నేను. ప్రజావిజయం కానీ ఆ మౌనం ఎంతోకాలం కొనసాగలేదు. 21 మాసాల తరువాత ఎమర్జెన్సీ ఎత్తివేయక తప్పలేదు. అరెస్టయిన వేలాది మందిని విడుదల చేయక తప్పలేదు. జనతా పార్టీ ఆవిర్భవించింది. 1977 ఎన్నికలలో ఇందిరాగాంధీ ఘోరం గా ఓడిపోయారు. జూన్, 1975 నుంచి 1977 మధ్య కాలం మన ప్రజాస్వామ్యానికి ఒక పీడకల. దేశం లో పడగ విప్పిన నియంతృత్వాన్నీ, నిర్బంధాన్నీ కూల దోసినవారు ఎవరో కాదు. అలాంటి రాజ్యశక్తిని ఎది రించి, తాము పోగొట్టుకున్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలను జాతికి అలవాటైన అహింసా పద్ధతిలో పదిల పరచిన వారు సామాన్య ప్రజానీకమే. ఇందుకు భావితరాలు రుణపడి ఉండాలి. (వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యులు) మొబైల్: 98663 76735, యూఎస్ 001-41077 78552 - ఎలమంచిలి శివాజీ -
సింగపూర్ రాజధాని మూడెకరాలే!
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం సింగపూర్ మోడల్ తీసుకుంటామని చెబుతున్నారని.. కానీ వాస్తవానికి సింగపూర్ రాజధాని కేవలం మూడెకరాల్లోనే ఉందని ప్రముఖ రైతు నాయకుడు యలమంచిలి శివాజీ అన్నారు. రాజధాని భూసేకరణ అంశంపై రైతుల్లో అనేక భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో 'సాక్షి' ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని.. రైతులకు అవగాహన కలిగేలా వివరణాత్మకంగా మాట్లాడారు. నూజివీడు ప్రాంతంలో 30వేల ఎకరాల అటవీ భూమి ఉందని చెబుతున్నారు గానీ, అదంతా కేవలం కాగితాల మీద ఉందే తప్ప.. ఒక్క గజం కూడా మిగల్లేదని, మొత్తం ఆ భూమినంతటినీ ఆక్రమించుకుని తోటలు వేసుకున్నారని శివాజీ అన్నారు. ఊహాజనితమైన లెక్కలతో వెళ్లడం కాకుండా.. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూముల్లో నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. కేవలం భూమి ఉన్న యజమానులు మాత్రమే కాక, ఆయా ఊళ్లలో ఉండే చిరు వ్యాపారులు, ఇతర వర్గాల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని, వాళ్ల జీవితం గురించి కూడా పట్టించుకోవాలని అన్నారు. శాఖాధిపతులకు హైదరాబాద్‌లో పనేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలను లండన్‌లో పరిపాలించినట్లుగా ఉందని యలమంచిలి శివాజీ విమర్శించారు. ఉన్నతాధికారులు నిర్ణయాలు తీసుకున్నా.. వాటిని అమలుచేయాల్సింది క్షేత్రస్థాయిలోనే కాబట్టి, శాఖాధిపతులంతా వెంటనే ఈ ప్రాంతానికి రావాలని ఆయన గట్టిగా చెప్పారు. ఇంత విస్తారమైన రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు కూర్చుని మాట్లాడుకోడానికి సరిపడ ఒక్క ఆడిటోరియం కూడా లేకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. నాగార్జున యూనివర్సిటీ వాళ్లు తమ ఆడిటోరియాన్నే ఇవ్వమని చెబుతున్నారు.. మరి కొన్ని తరాలుగా సాగుచేసుకుంటున్న భూమిని రైతులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. నాగార్జున యూనివర్సిటీలో పనిచేసే ఏ ఒక్కళ్లూ కూడా అక్కడ నివాసం ఉండట్లేదని గుర్తు చేశారు. -
'రియల్ ఎస్టేట్ కు టీడీపీ నేతల దన్ను'
విజయవాడ: రాజధానిపై అస్పష్టమైన ప్రకటనలతో టీడీపీ తీవ్ర గందరగోళానికి తెరలేపిందని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ విమర్శించారు. గుంటూరు-విజయవాడ-అమరావతి మధ్య 23 వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం భూసేకరణ జరపాలంటే పదేళ్లు పడుతుందన్నారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న తర్వాతే రైతుల భూసేకరణ గురించి ఆలోచించాలని సూచించారు. రియల్ ఎస్టేట్ ను ప్రోత్సహించేవిధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. విజయవాడలో ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన జాతీయ భూసేకరణ చట్టంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. -
బెజవాడే బెస్ట్
‘బెజవాడను రాజధాని చేయండి.. రాజధాని నిర్మాణం కోసం అన్ని వసతులు, సౌకర్యాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి.. నీటి సమస్య, విద్యుత్ సమస్య లేదు.. రోడ్డు, రైలు, వాయు మార్గాలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి.. రాజధాని నిర్మాణానికి నగరం పూర్తిగా అనువుగా ఉంటుంది’ అంటూ పలు సంఘాలు, పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో వినతిపత్రాలు అందజేశారు. నూతన రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఆదివారం విజయవాడ చేరుకుంది. అనారోగ్య కారణంతో కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ హాజరుకాలేదు. సాక్షి, విజయవాడ : స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు రాజధాని ఎంపిక కోసం ఇక్కడ అనువుగా ఉన్న అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసింగ్, పట్టణాభివృద్ధి తదితర అంశాలపై మాట్లాడారు. జిల్లాలో నదీజలాల పరిస్థితి, అటవీ ప్రాంతం, మైదాన ప్రాంతం, రవాణా సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా మ్యాప్, వీజీటీఎం ఉడా మాస్టర్ ప్లాన్లను పరిశీలించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సమగ్ర స్థితిని వివరించారు. రాజధాని ఏర్పాటుకు జిల్లాలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలోని పోలీసు సిబ్బంది వివరాలను తెలిపారు. జిల్లా నుంచి దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రాంతాలకు రోడ్డు మార్గాలు ఉన్నాయని, ఇక్కడ పారిశ్రామికంగా వివాదాలు లేవని, మారకద్రవ్యాల విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు నగరం కొంత దూరంగా ఉందని గణాంకాలతో వివరించారు. నగరానికి సమీపంలో అతి పెద్ద పోలీసు బెటాలియన్ ఉందని, గన్నవరంలో 70 ఎకరాల్లో ఆక్టోపస్ ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. ఉడా అధికారులు, నగరపాలకసంస్థ కమిషనర్ తదితరులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన ద్వారా అన్ని అంశాలను వివరించారు. వీజీటీఎం ఉడా వైస్‌చైర్మన్ పి.ఉషాకుమారి, సబ్ కలెక్టర్ దాసరి హరిచందన, నగరపాలకసంస్థ కమిషనర్ సి.హరికిరణ్‌తో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. సమాచార సేకరణ మాత్రమే... తాము కేవలం జిల్లాలో పరిస్థితిపై సమాచారం సేకరించటం కోసమే వచ్చామని కమిటీ సభ్యులు ప్రకటించారు. రాజధాని ఎంపిక ప్రక్రియలో జోన్ నిబంధనలను పాటిస్తూ, రాజ్‌భవన్, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల నిర్మాణం, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ శాఖలు, ప్రధాన కార్యాలయాలు, గెస్ట్‌హౌస్‌లు, అధికారులు, సిబ్బందికి క్వార్టర్లు, స్టేడియంలు, హోటళ్లు, ఆస్పత్రులు, కళాశాలలు, లైబర్రీలు, మ్యూజియంలు, థియేటర్లు ఇలా అన్ని వసతుల ఏర్పాటుకు అనువుగా అవసరమైన మేరకు జిల్లాలో భూములు ఎక్కడ ఉన్నాయనే అంశంపై చర్చించారు. వినతుల వెల్లువ... అనంతరం కమిటీ సభ్యులు సబ్‌కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వర్తక, వాణిజ్య సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు విజయవాడనే రాజధాని చేయాలని కోరుతూ కమిటీ సభ్యులకు వినతిపత్రాలు అందజేశారు. మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ నేతృత్వంలో రాజధాని సాధన సమితి నేతలు కె.వాసుదేవరావు, జి.రాధాకృష్ణమూర్తి తదితరులు వినతిప్రతం సమర్పించారు. శివాజీ మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటుకు ప్రదేశం అనువుగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా రెండు నగరాల్లో నీటి సమస్య లేదని, ఏడు వైద్య బోధనాసుపత్రులు ఉన్నాయని, రెండు పాల ఫ్యాక్టరీలు, విద్య, వాణ్యిపరంగా అనేక పరిశ్రమలు, విద్యాసంస్థలు ఉన్నాయని చెప్పి పరిశీలించాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్కె బాజీ, కొల్లూరు వెంకటేశ్వరరావు విజయవాడను రాజధాని చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్, టీడీపీ నేతలు కాట్రగడ్డ బాబు, తూమాటి ప్రేమ్‌నాధ్, పట్టాభిల నేతృత్వంలో నాయకులు, బీజేపీ నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు, కేఎస్ ఆర్ముగం, వీరబాబు, ప్రసాద్, చిక్కాల రజనీకాంత్, జై ఆంధ్ర జేఏసీ చైర్మన్ ఎల్.జైబాబు, బి.రామమోహనరావు, విజయవాడ చాంబర్ ఆ్‌ఫ్ కామర్స్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ నేతృత్వంలో సభ్యులు విజయవాడ బార్ అసోసియేషన్ నేత మట్టా జయకర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ వెంకటేశ్వరరావు, రైతు సంఘ నేత శ్రీనివాసరెడ్డి, లారీ ఓనర్స్ అసోసియేషన్ నేత ఈశ్వరరావు, చిల్డ్రన్స్ వెల్ఫేర్ సోసైటీ అధ్యక్షుడు నగేష్, ఆంధ్రరాష్ట సమితి నేత డీవీ రంగారావు, లయన్స్కబ్ల్ సభ్యుడు నాగమలేశ్వరరావు తదితరులు వినతులు అందజేశారు. పలువురి నుంచి అభిప్రాయ సేకరణ విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం సీమాంధ్రలోని వివిధ ప్రాంతాలలో పర్యటనలో భాగంగా శివరామకృష్ణన్ కమిటీ ఆదివారం విజయవాడకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా గూడవల్లిలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ హార్టీకల్చర్ కళాశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి జగన్‌షా మాట్లాడుతూ సీమాంధ్ర రాజధాని గురించి జిల్లా వాసులు వివరించే అంశాలను ఆధారంగా చేసుకుని ఒక నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. నివేదికను బట్టి ప్రభుత్వం రాజధానిని నిర్ణయిస్తుందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాజధానికి కావలసిన అంశాలను అసలు ఇప్పటివరకూ ఎవరూ వివరించలేదని, చెప్పకుండానే పరిశీలనలు జరుగుతున్నాయని అన్నారు. అయితే విజయవాడ అన్ని ప్రాంతాల కంటే రాజధానికి అనువైన ప్రదేశమని తెలిపారు. హైదరాబాద్ రాజధానిలో అన్నీ ఒకేచోట పెట్టి తప్పు చేశామని, ఇప్పుడు అలా కాకుండా పరిశ్రమలు అన్ని జిల్లాల్లో పెట్టి అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడలో స్థల సమస్య అంటూ ఏమీ లేదన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ మాట్లాడుతూ విజయవాడ రాజధాని చేయాలని 1953వ సంవత్సరంలోనే ప్రతిపాదన ఉందని, అయితే ఆ సమయంలో కర్నూలు రాజధాని చేశారని, తరువాత హైదరాబాద్‌కు తరలించాలని తెలిపారు. విజయవాడలో రైల్వే జంక్షన్, బందరు పోర్టు, ఎయిర్‌పోర్టు, తాగునీటి సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. న్యాయవాది సుంకర కృష్ణమూర్తి మాట్లాడుతూ విజయవాడలో 40 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వానికి కావలసిన భూములు మొత్తం 49 వేల ఎకరాలు ఉన్నాయన్నారు. డాక్టర్ రమేష్ మాట్లాడుతూ విజయవాడ అన్ని రంగాలలోనూ ముందుందన్నారు. విద్య, వైద్య విభాగంలో ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని ప్రాంతాల కంటే విజయవాడ అనువైనదని తెలిపారు. ఐలా చైర్మన్ పౌండ్రీ ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడలోని ఆటోనగర్‌లో ఎంతోమంది కార్మికులు ఉపాధి పొందుతున్నారన్నారు. విజయవాడను రాజధానిచేస్తే విదేశాలలో ఉన్న ఉద్యోగులందరూ ఇక్కడికొచ్చి పరిశ్రమలు స్థాపించి రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తారన్నారు. -
రాజధానిగా విజయవాడ-గుంటూరు సరిపోతుంది
హైదరాబాద్: సీమాంధ్రకు రాజధానిగా విజయవాడ-గుంటూరు సరిపోతుందని రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ రైతు నాయకుడు యలమంచిలి శివాజి చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీమాంధ్ర అసెంబ్లీ, సెక్రటేరియట్ ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. యూనివర్శిటీని ఒంగోలు పిజి సెంటర్‌కు తరలించవచ్చునని తెలిపారు. హైదరాబాద్ మాదిరిగా సీమాంధ్ర రాజధాని ఉండాలనుకోవడం సరికాదన్నారు. అన్నీ ఒకే నగరంలో ఏర్పాటు చేయడం కూడా సరికాదని చెప్పారు. 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలని కోరారు. విజయవాడ- గుంటూరును నో ఇండస్ట్రీయల్ జోన్‌గా ప్రకటించాలని శివాజీ డిమాండ్ చేశారు.