బెజవాడే బెస్ట్
‘బెజవాడను రాజధాని చేయండి.. రాజధాని నిర్మాణం కోసం అన్ని వసతులు, సౌకర్యాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి.. నీటి సమస్య, విద్యుత్ సమస్య లేదు.. రోడ్డు, రైలు, వాయు మార్గాలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి.. రాజధాని నిర్మాణానికి నగరం పూర్తిగా అనువుగా ఉంటుంది’ అంటూ పలు సంఘాలు, పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో వినతిపత్రాలు అందజేశారు. నూతన రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఆదివారం విజయవాడ చేరుకుంది. అనారోగ్య కారణంతో కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ హాజరుకాలేదు.
సాక్షి, విజయవాడ : స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు రాజధాని ఎంపిక కోసం ఇక్కడ అనువుగా ఉన్న అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసింగ్, పట్టణాభివృద్ధి తదితర అంశాలపై మాట్లాడారు. జిల్లాలో నదీజలాల పరిస్థితి, అటవీ ప్రాంతం, మైదాన ప్రాంతం, రవాణా సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా మ్యాప్, వీజీటీఎం ఉడా మాస్టర్ ప్లాన్‌లను పరిశీలించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సమగ్ర స్థితిని వివరించారు.
రాజధాని ఏర్పాటుకు జిల్లాలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలోని పోలీసు సిబ్బంది వివరాలను తెలిపారు. జిల్లా నుంచి దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రాంతాలకు రోడ్డు మార్గాలు ఉన్నాయని, ఇక్కడ పారిశ్రామికంగా వివాదాలు లేవని, మారకద్రవ్యాల విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు నగరం కొంత దూరంగా ఉందని గణాంకాలతో వివరించారు. నగరానికి సమీపంలో అతి పెద్ద పోలీసు బెటాలియన్ ఉందని, గన్నవరంలో 70 ఎకరాల్లో ఆక్టోపస్ ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. ఉడా అధికారులు, నగరపాలకసంస్థ కమిషనర్ తదితరులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన ద్వారా అన్ని అంశాలను వివరించారు. వీజీటీఎం ఉడా వైస్‌చైర్మన్ పి.ఉషాకుమారి, సబ్ కలెక్టర్ దాసరి హరిచందన, నగరపాలకసంస్థ కమిషనర్ సి.హరికిరణ్‌తో పాటు పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
సమాచార సేకరణ మాత్రమే...
తాము కేవలం జిల్లాలో పరిస్థితిపై సమాచారం సేకరించటం కోసమే వచ్చామని కమిటీ సభ్యులు ప్రకటించారు. రాజధాని ఎంపిక ప్రక్రియలో జోన్ నిబంధనలను పాటిస్తూ, రాజ్‌భవన్, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల నిర్మాణం, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ శాఖలు, ప్రధాన కార్యాలయాలు, గెస్ట్‌హౌస్‌లు, అధికారులు, సిబ్బందికి క్వార్టర్లు, స్టేడియంలు, హోటళ్లు, ఆస్పత్రులు, కళాశాలలు, లైబర్రీలు, మ్యూజియంలు, థియేటర్లు ఇలా అన్ని వసతుల ఏర్పాటుకు అనువుగా అవసరమైన మేరకు జిల్లాలో భూములు ఎక్కడ ఉన్నాయనే అంశంపై చర్చించారు.
వినతుల వెల్లువ...
అనంతరం కమిటీ సభ్యులు సబ్‌కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వర్తక, వాణిజ్య సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు విజయవాడనే రాజధాని చేయాలని కోరుతూ కమిటీ సభ్యులకు వినతిపత్రాలు అందజేశారు. మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ నేతృత్వంలో రాజధాని సాధన సమితి నేతలు కె.వాసుదేవరావు, జి.రాధాకృష్ణమూర్తి తదితరులు వినతిప్రతం సమర్పించారు.
శివాజీ మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటుకు ప్రదేశం అనువుగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా రెండు నగరాల్లో నీటి సమస్య లేదని, ఏడు వైద్య బోధనాసుపత్రులు ఉన్నాయని, రెండు పాల ఫ్యాక్టరీలు, విద్య, వాణ్యిపరంగా అనేక పరిశ్రమలు, విద్యాసంస్థలు ఉన్నాయని చెప్పి పరిశీలించాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్‌కె బాజీ, కొల్లూరు వెంకటేశ్వరరావు విజయవాడను రాజధాని చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్, టీడీపీ నేతలు కాట్రగడ్డ బాబు, తూమాటి ప్రేమ్‌నాధ్, పట్టాభిల నేతృత్వంలో నాయకులు, బీజేపీ నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు, కేఎస్ ఆర్ముగం, వీరబాబు, ప్రసాద్, చిక్కాల రజనీకాంత్, జై ఆంధ్ర జేఏసీ చైర్మన్ ఎల్.జైబాబు, బి.రామమోహనరావు, విజయవాడ చాంబర్ ఆ్‌ఫ్ కామర్స్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ నేతృత్వంలో సభ్యులు విజయవాడ బార్ అసోసియేషన్ నేత మట్టా జయకర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ వెంకటేశ్వరరావు, రైతు సంఘ నేత శ్రీనివాసరెడ్డి, లారీ ఓనర్స్ అసోసియేషన్ నేత ఈశ్వరరావు, చిల్డ్రన్స్ వెల్ఫేర్ సోసైటీ అధ్యక్షుడు నగేష్, ఆంధ్రరాష్ట సమితి నేత డీవీ రంగారావు, లయన్స్‌కబ్ల్ సభ్యుడు నాగమలేశ్వరరావు తదితరులు వినతులు అందజేశారు.
పలువురి నుంచి అభిప్రాయ సేకరణ
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం సీమాంధ్రలోని వివిధ ప్రాంతాలలో పర్యటనలో భాగంగా శివరామకృష్ణన్ కమిటీ ఆదివారం విజయవాడకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా గూడవల్లిలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ హార్టీకల్చర్ కళాశాల ఆవరణలో ఆదివారం సాయంత్రం అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి జగన్‌షా మాట్లాడుతూ సీమాంధ్ర రాజధాని గురించి జిల్లా వాసులు వివరించే అంశాలను ఆధారంగా చేసుకుని ఒక నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. నివేదికను బట్టి ప్రభుత్వం రాజధానిని నిర్ణయిస్తుందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాజధానికి కావలసిన అంశాలను అసలు ఇప్పటివరకూ ఎవరూ వివరించలేదని, చెప్పకుండానే పరిశీలనలు జరుగుతున్నాయని అన్నారు.
అయితే విజయవాడ అన్ని ప్రాంతాల కంటే రాజధానికి అనువైన ప్రదేశమని తెలిపారు. హైదరాబాద్ రాజధానిలో అన్నీ ఒకేచోట పెట్టి తప్పు చేశామని, ఇప్పుడు అలా కాకుండా పరిశ్రమలు అన్ని జిల్లాల్లో పెట్టి అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడలో స్థల సమస్య అంటూ ఏమీ లేదన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ మాట్లాడుతూ విజయవాడ రాజధాని చేయాలని 1953వ సంవత్సరంలోనే ప్రతిపాదన ఉందని, అయితే ఆ సమయంలో కర్నూలు రాజధాని చేశారని, తరువాత హైదరాబాద్‌కు తరలించాలని తెలిపారు. విజయవాడలో రైల్వే జంక్షన్, బందరు పోర్టు, ఎయిర్‌పోర్టు, తాగునీటి సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.
న్యాయవాది సుంకర కృష్ణమూర్తి మాట్లాడుతూ విజయవాడలో 40 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వానికి కావలసిన భూములు మొత్తం 49 వేల ఎకరాలు ఉన్నాయన్నారు. డాక్టర్ రమేష్ మాట్లాడుతూ విజయవాడ అన్ని రంగాలలోనూ ముందుందన్నారు. విద్య, వైద్య విభాగంలో ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని ప్రాంతాల కంటే విజయవాడ అనువైనదని తెలిపారు. ఐలా చైర్మన్ పౌండ్రీ ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడలోని ఆటోనగర్‌లో ఎంతోమంది కార్మికులు ఉపాధి పొందుతున్నారన్నారు. విజయవాడను రాజధానిచేస్తే విదేశాలలో ఉన్న ఉద్యోగులందరూ ఇక్కడికొచ్చి పరిశ్రమలు స్థాపించి రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తారన్నారు.